Begin typing your search above and press return to search.

అప్పుల్లో దేశంలోనే నెంబర్ 1గా ఏపీ.. 11 నెలల్లో ఎంత చేశారో తెలుసా?

By:  Tupaki Desk   |   28 March 2021 4:32 AM GMT
అప్పుల్లో దేశంలోనే నెంబర్ 1గా ఏపీ.. 11 నెలల్లో ఎంత చేశారో తెలుసా?
X
తరచూ ఏదో ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా ఏపీ సర్కారు తరచూ ప్రకటనల్ని జారీ చేస్తుంటుంది. సంక్షేమం సంగతేమో కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం సీరియస్ కండీషన్ లోకి వెళుతున్నట్లుగా చెప్పాలి. ఎందుకంటే.. గడిచిన పదకొండు నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు లెక్క వింటే అవాక్కు అవ్వాల్సిందే. దీనికి సంబంధించిన వివరాల్ని కాగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర బడ్జెట్ లో పొందు పరిచిన అంచనాలకు ఏ మాత్రం సంబంధం లేకుండా అప్పులు చేస్తున్న విషయాన్ని తాజాగా కాగ్ తన నివేదికలో వెల్లడించింది.

2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి భారీ రుణాలకు శ్రీకారం చుట్టిన దానికి ఏ మాత్రం తీసిపోకుండా నెల తిరిగేసరికి కొత్త అప్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన పదకొండు నెలల్లో ఏకంగా రూ.79,191 కోట్లను అప్పుగా తీసుకున్నట్లుగా కాగ్ వెల్లడించింది. దేశంలో ఆర్థికంగా.. జనాభా పరంగా పెద్దగా ఉన్న పద్నాలుగు రాష్ట్రాల్లో ఏది కూడా ఇంత భారీగా అప్పు చేసింది లేదని చెబుతున్నారు.

అంతేకాదు.. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో పేర్కొన్న అంచనాలకు మించి 63.9 శాతం అధికంగా అప్పులు చేస్తున్న వైనాన్ని గుర్తించారు. కరోనా పుణ్యమా అని దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలు ఒకే స్థాయిలో ఉన్నాయి. అయితే.. ఏపీ మాత్రం అప్పుల విషయంలో దూసుకెళుతోంది. పదకొండు నెలల్లోచేసిన రుణాన్ని సరాసరి తీసుకుంటే.. నెలకు రూ.7,199 కోట్ల అప్పును తీసుకున్నట్లుగా అర్థమవుతుంది.

గత ఆర్థిక సంవత్సరంలో పదకొండు నెలల్లో రూ.52,090 కోట్ల అప్పు తీసుకుంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగిన 11 నెలల్లో అప్పుల భారం 52 శాతం పెరగటం గమనార్హం. 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను.. పన్నేతర ఆదాయం రూ.71,699 కోట్లు కాగా.. అప్పు రూ.79,191 కోట్లు కావటం ఆందోళన కలిగించే అంశం. అంటే.. వంద రూపాయిల సంపాదన ఉంటే.. రూ.102 అప్పు చేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. బడ్జెట్ లో చెప్పిన దాని కంటే అధికంగా అప్పుతీసుకున్న రాష్ట్రాల్లో రాజస్థాన్.. పశ్చిమబెంగాల్.. తెలంగాణ.. కేరళ రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ పోటీ పడటం గమనార్హం. ఈ అప్పుల తిప్పలు రాష్ట్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పాలి.