Begin typing your search above and press return to search.

'పచ్చళ్లు అమ్మినా అది మావారే ఉండాలి'.జగన్ మాటల్లో నిజమెంత?

By:  Tupaki Desk   |   16 Sep 2022 4:33 AM GMT
పచ్చళ్లు అమ్మినా అది మావారే ఉండాలి.జగన్ మాటల్లో నిజమెంత?
X
ఏపీ అసెంబ్లీ సాక్షిగా మరోసారి చెలరేగిపోయారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తన మూడు రాజధానుల ఆలోచనకు భిన్నంగా అమరావతినే రాజధాని అన్న పాయింట్ మీద నిలబడిన వారిపై ఆయన మండిపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తనదైన శైలిలో ఆవేశానికి గురయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆయన టీం సభ్యుల తీరు ఎలా ఉంటుందో సభకు తెలియజేశారు. ఆయన చేసిన ఆగ్రహాంతో కూడిన ఆవేశపు మాటల్లోని లాజిక్కును చూడాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే.. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడే మాటల్లో నిజాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. తన వాదనకు భిన్నంగా స్పందించే వారిని ఇష్టం వచ్చినట్లుగా మాట అనేయటం కారణంగా.. రానున్న రోజుల్లో ఎవరూ నోరు మెదపలేని పరిస్థితి ఉంటుంది. అందుకే.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యల్లోని నిజానిజాల్ని తార్కిక బుద్ధితో చెక్ చేస్తే అందులో వాస్తవం పాళ్లు ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ముందుగా సీఎం జగన్ చేసిన కీలక వ్యాఖ్యల్ని తీసుకుంటే..

"ఈ పెత్తందారీల మనస్తత్వాల్ని పరిశీలిస్తే.. మా బినామీ భూముల ప్రాంతాలు మాత్రమే రాజధానిగా ఉండాలి. ఇంకెక్కడా ఉండకూడదు. పత్రిక అంటే అది కేవలం ఈనాడు.. మా చంద్రజ్యోతి మాత్రమే. మరే పత్రికా ఉండకూడదు. పచ్చళ్లు అమ్మినా కూడా అది మావారి పచ్చళ్లే అమ్మాలి. చిట్ ఫండ్స్ వ్యాపారం చేసినా కూడా మావారిదే జరగాలి.

మా వాడైతే ఆర్బీఐ నిబంధనల్ని ఉల్లంఘించి కూడా ఏమైనా చేయొచ్చు"

"డైరీలు.. పాలు అంటే ప్రభుత్వ రంగంలో లాభాల్లో ఉన్న చిత్తూరు డైరీని కూడా మూసేయాలి. మా హెరిటేజ్ కోసం ఆ డైరీల గొంతు నొక్కాలి. ఆ రంగం.. ఈ రంగం.. వాళ్లు.. వీళ్లు అనే తేడా లేదు. ఎవరూ కూడా మార్కెట్ లో ఉండకూడదు. ఏ ఇండస్ట్రీలో అయినా నా మనుషులు మాత్రమే ఉండాలి"

"కార్పొరేట్ చదువులు తీసుకుంటే కూడా కేవలం మా నారాయణ.. మా చైతన్య మాత్రమే ఉండాలి. గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లీష్ మీడియం కూడా ఉండకూడదు. అన్ని వ్యవస్థలు కూడా మన మనసుషుల చేతుల్లోనే ఉండాలి. అన్ని ప్రతిపక్ష పార్టీల్లో కూడా నా మనుషులే ఉండాలనేదే ఈ పెత్తందారీల మనస్తత్వం" అంటూ విరుచుకుపడ్డారు.

ఇప్పుడు జగన్ చేసిన తీవ్రమైన ఆరోపణల్ని లాజిక్ తో క్రాస్ చెక్ చేద్దాం.

- మరే పత్రికా ఉండకూడదన్నదే నిజమైతే.. జగన్ చెప్పినట్లుగా ఈనాడు.. చంద్రజ్యోతి మాత్రమే కాదు కదా సాక్షి కూడా వచ్చింది కదా? చంద్రబాబు పాలనలో సాక్షిని ఇబ్బంది పెడుతూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కదా? ఒకవేళ.. జగన్ చెప్పినట్లుగా మరెవరూ బతకకూడదన్నదే ఆలోచన అయితే.. సాక్షిని చుక్కలు చూపేవారు కదా? అంతదాకా ఎందుకు సాక్షి పెట్టినప్పుడు ఈనాడు.. చంద్రజ్యోతి (జగన్ చెప్పినట్లు) లోని జర్నలిస్టుల్నే సాక్షి తీసేసుకుందే తప్పించి.. మరేం జరగలేదు కదా?

- పచ్చళ్లు.. చిట్ ఫండ్ లు అంటే మావారిదే జరగాలన్న జగన్ మాటనే తీసుకుంటే.. ఇవాల్టి రోజున ఏ సూపర్ మార్కెట్ కు వెళ్లినా.. గల్లీలోని కిరాణా షాపుకు వెళ్లినా.. పచ్చళ్ల కంపెనీలు బోలెడన్ని కనిపిస్తాయి? మరి సీఎంకు ఎందుకు కనిపించవు? ఇక.. చిట్ ఫండ్ వ్యాపారాల్ని చూస్తే..ఎన్ని ఉన్నాయి? ఆయన టార్గెట్ చేసిన సంస్థకు సంబంధించి ఒక్కటంటే ఒక్క కంప్లైంట్ ఇప్పటివరకు రాలేదు. నిజానికి చిట్ ఫండ్ వ్యాపారాల్లో తరచూ ఏవో ఒక ఆరోపణలు.. విమర్శలు వస్తుంటాయి. మరి.. అలా జరగలేదు కదా?

- డైరీలు.. పాలు విషయానికి వస్తే హెరిటేజ్ మీద జగన్ చేసిన వ్యాఖ్యల్నే తీసుకుందాం. చిత్తూరు డైరీని బలి తీసుకున్నారనే అనుకుందాం. మరి.. సంగం డైరీని ఎందుకు బలి తీసుకోలేదు. నిజంగానే డైరీల్లో తాము కాకుండా మరెవరూ ఉండకూడదన్నదే లక్ష్యమైతే.. అన్నేసి బ్రాండ్లు ఎందుకు ఉంటున్నట్లు?

- నారాయణ.. చైతన్య సంస్థల మీద విమర్శలు చేసిన జగన్.. మరెన్ని విద్యా సంస్థలు మార్కెట్లో ఉన్నాయన్నది తెలిసిందే. అందులోనిజం ఎంతన్నది.. ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్నిచూసినప్పుడు ర్యాంకులు సాధించారంటూ హడావుడి చేసిన సంస్థల్ని చూసినప్పుడు నారాయణ.. చైతన్యలతో పాటు మరిన్ని సంస్థలు కనిపిస్తాయి. ఒకవేళ.. గుత్తాధిపత్యమే లక్ష్యమైతే.. ఆ సంస్థలు పుట్టుకు రావు కదా? అన్న ప్రశ్నలు మదిలో మెదలక మానవు. మరి.. వీటికి సీఎం జగన్ ఏం చెబుతారో? అన్నింటికి మించి.. అమరావతి రాజధాని కాదన్నప్పుడు.. 2019 ఎన్నికలకు ముందు అంత బలంగా.. అమరావతినే రాజధాని అంటూ బహిరంగ సభల్లో గొంతు చించుకొని మరీ ఎందుకు చెప్పినట్లు?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.