Begin typing your search above and press return to search.

ఆ అగ్ర‌ నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి అమ‌రావ‌తిలో భూములు!

By:  Tupaki Desk   |   16 Sep 2022 6:31 AM GMT
ఆ అగ్ర‌ నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి అమ‌రావ‌తిలో భూములు!
X
న‌లుగురి చేతిలో చంద్ర‌బాబు కీలుబొమ్మ‌గా మారార‌ని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ధ్వ‌జ‌మెత్తారు. అశ్వినీద‌త్‌, కె.రాఘ‌వేంద్ర‌రావులాంటి వాళ్ల‌కు కోరుకున్న చోట అమ‌రావ‌తిలో భూములిచ్చార‌ని నిప్పులు చెరిగారు. చంద్రబాబు తనకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కట్టబెట్టార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖమ్మంలో కార్పొరేటర్‌గా గెలవలేని రేణుకా చౌదరి అమరావతి గురించి మాట్లాడటం సిగ్గు చేట‌న్నారు. ఒక్క ప్రాంతమే అభివృద్ధి అయితే.. మిగతా ప్రాంతాలు ఏం కావాలి? అని నిల‌దీశారు.

ఈ మేర‌కు ఏపీ అసెంబ్లీలో ప‌రిపాల‌న‌ వికేంద్రీక‌ర‌ణ‌పై జ‌రిగిన స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌లో కొడాలి నాని మాట్లాడారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాల‌నే సీఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న తెచ్చార‌ని చెప్పారు. ఒక కులానికో, మ‌తానికో వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న తేలేద‌న్నారు.

సీఎం జగన్‌పై బురద జల్లడమే కొందరు పనిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. వాళ్లకు రాష్ట్రం బాగుప‌డ‌టం ఇష్టం లేద‌న్నారు. అలాగే రాష్ట్రాన్ని బాగుచేయాలన్న ఉద్దేశం కూడా లేద‌ని తెలిపారు. చంద్రబాబు బినామీలు దళితులను భయపెట్టి అసైన్డ్‌ భూములను లాక్కున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. అమరావతిలో పేదలకు ప్ర‌భుత్వం ఇళ్లు ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నిస్తే కోర్టుకెళ్లి అడ్డుకున్నార‌ని విమ‌ర్శ‌లు చేశారు.

అమరావతిలో కేవ‌లం ధనికులే ఉండాలా.. పేదలు ఉండొద్దా? అని కొడాలి నాని ప్ర‌శ్నించారు. అమరావతిని కమ్మ‌రావతి, భ్రమరావతి చేసింది చంద్రబాబు కాదా? అని నిల‌దీశారు. అమరావతిని ప్రకటించక ముందు ఆ ప్రాంతంలో ఎకరం రూ.50 లక్షలు ఉంటే గ్రాఫిక్స్‌తో ఎకరం రూ.5 కోట్లకు తీసుకెళ్లార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అమరావతిలో టీడీపీ నేతలందరికీ భూములు ఉన్నాయ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇతర ప్రాంతాల్లో భూములు అమ్మి అమరావతిలో టీడీపీ నేత‌లు భూములు కొన్నార‌ని ఆరోపించారు.

ఎక్క‌డో రాజ‌మండ్రిలో ఉన్న ఆస్తుల‌మ్ముకుని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల‌ బుచ్చ‌య్య చౌద‌రి అమ‌రావ‌తిలో భూములు కొన్నార‌ని చెప్పారు. తీరా ఇప్పుడు రాజ‌ధాని మార్పుతో అమ‌రావ‌తి ప్రాంతంలో భూముల రేట్లు అమాంతం ప‌డిపోయాయ‌ని తెలిపారు. అమరావతిలో మూడెక‌రాల భూమిని బుచ్చ‌య్య చౌద‌రి రూ.3 కోట్ల‌కు కొన్నార‌ని, ఇప్పుడు ఆ రేట్లు అమరావ‌తిలో లేవ‌న్నారు. రూ.3 కోట్లు పెట్టి కొంటే కేవ‌లం రూ.4.5 కోట్లు మాత్ర‌మే అయ్యింద‌న్నారు. కానీ ఆయ‌న రాజ‌మండ్రిలో అమ్మిన భూమి విలువ మాత్రం ఇప్పుడు రూ.11 కోట్లు మాత్ర‌మే చేస్తోంద‌ని బుచ్చ‌య్య చౌద‌రి బాధ‌ప‌డుతున్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అమరావతిని చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ కంపెనీగా మార్చార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అక్క‌డ భూములుకొన్నవాళ్లే అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నార‌ని నిప్పులు చెరిగారు. వీరంతా వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఓడిపోవాల‌ని కోరుకుంటున్నార‌ని ఆరోపించారు.

టీడీపీ నేతలకు రాష్ట్రాభివృద్ధి ప‌ట్ట‌ద‌న్నారు. వారికి స్వార్థ ప్రయోజనాలే కావాల‌న్నారు. దుర్మార్గులంతా కలిసి రోడ్లపైకి వచ్చారని రైతులు చేస్తున్న పాద‌యాత్ర‌పై ప‌రోక్షంగా నాని మండిప‌డ్డారు. పాదయాత్ర రాజధాని కోసమా.. చంద్రబాబు కోసమా? అని నిల‌దీశారు. 40 ఆలయాలు కూల్చిన దుర్మార్గుడు చంద్రబాబు.. ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడుతున్నారుఅని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.