Begin typing your search above and press return to search.

ఏపీకి.. 'బ్యాడ్ ఫ్రైడే'... కొత్త అప్పు పుట్ట‌లేదు!

By:  Tupaki Desk   |   23 April 2022 10:30 AM GMT
ఏపీకి.. బ్యాడ్ ఫ్రైడే... కొత్త అప్పు పుట్ట‌లేదు!
X
అప్పులు చేస్తే... త‌ప్ప రొజు గ‌డ‌వ‌ని.. ప‌రిస్తితికి చేరుకున్న ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు.. ఇప్పుడు ఆ అప్పు కూడా పుట్ట‌క నానా తిప్ప‌లు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ప్ర‌తి శుక్ర‌వారం కేంద్రంలోని ఆర్థిక శాఖ వ‌ద్ద‌కు వెళ్లే మంత్రి+అధికారులు.. అక్క‌డ అప్పుల‌కు ఆమోద ముద్ర వేయించుకుంటారు. అనంత‌రం.. త‌దుప‌రి వ‌చ్చే మంగ‌ళ‌వారం నాడు.. ఆర్బీఐ వేలంపాట‌లో పాల్గొని.. అప్పులు తెచ్చుకోవ‌డమా.. లేక అప్ప‌టికే తీసుకున్న అప్పులకు వ‌డ్డీలు చెల్లించ‌డ‌మో.. చేస్తారు. ఇది.. గ‌త ఏడాదిన్న కాలంగా జ‌రుగుతున్న తంతు!

ఈ నిధుల‌తోనే జీతాలు.. భ‌త్యాలు.. ప‌థ‌కాలు.. సంక్షేమం.. ఇలా అనేకం అమ‌లు చేస్తున్నారు. అయితే.. తాజాగా కేంద్రం పిడికిలి బిగించింది. దేశంలోనూ శ్రీలంక త‌ర‌హా ప‌రిస్థితి వ‌చ్చేలా ఉందంటూ.. అధికారులు చేసిన హెచ్చ‌రిక‌ల‌తో.. అప్పులు ఇచ్చేందుకు కేంద్రం వెనుకాడుతోంది. ఈ క్ర‌మంలోనే కొత్త అప్పులకు అనుమతి కోసం ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసినా నిరాశే ఎదురైంది. శుక్రవారం నాటికి ఇంకా కేంద్రం నుంచి అనుమతి రాకపోవడంతో రావత్‌ తిరిగి విజయవాడ వచ్చేశారు.

కొత్త అప్పులకు అనుమతిచ్చేందుకు వీలుగా కేంద్రం అడిగిన వివరాలన్నీ ఆర్థికశాఖ అధికారులకు బుగ్గన, రావత్‌ సమర్పించినట్టు తెలుస్తోంది. దీనిపై సోమవారం నాటికి కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఎంతో కొంత అప్పునకు కేంద్రం నుంచి అనుమతి వస్తే మంగళవారం ఆర్‌బీఐ వద్ద జరిగే రాష్ట్ర సెక్యూరిటీల వేలంలో పాల్గొనాలని ఏపీ భావిస్తోంది. సాధారణంగా ఈ వేలంలో పాల్గొనేందుకు వీలుగా శుక్రవారమే ఆర్‌బీఐకి రాష్ట్రాలు ఇండెంట్లు పెడతాయి.

ఏపీకి ఇంకా కొత్త అప్పులకు అనుమతివ్వక పోవడంతో ఇండెంట్‌ పెట్టలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జగన్‌ సర్కారు కేంద్రాన్ని ఏకంగా రూ.80 వేల కోట్ల అప్పు అడిగింది. ఈ అప్పులు వస్తాయనే ఆశతోనే జనవరిలో ఇవ్వాల్సిన అమ్మఒడి పథకాన్ని జూన్‌లో ఇస్తామని చెప్పారు. ఈ పథకానికి రూ.6,500కోట్లు అవసరం. కేంద్రం నుంచి అనుమతి మరింత ఆలస్యమైతే రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటు చేసిన బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని భావిస్తు న్నట్టు సమాచారం.

కానీ, ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులిచ్చేందుకు ఎస్‌బీఐ సహా అన్ని బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి. ఒక్క బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రమే అప్పులిచ్చేందుకు ఉత్సాహం చూపుతోంది. జగన్‌ సర్కారు దాస్తున్న అప్పుల లెక్కలన్నీ కేంద్రం గుర్తిస్తే మరో మూడేళ్లు కొత్త అప్పులకు అనుమతిచ్చే అవకాశం ఉండదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రంతో ఏదైనా పంచాయితీ వస్తే కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకునే కసరత్తును కూడా ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం