Begin typing your search above and press return to search.

కొత్త పోరాటంఃకాపుల‌పై బ‌లిజ‌ల ఫైర్‌

By:  Tupaki Desk   |   31 Jan 2017 11:37 AM GMT
కొత్త పోరాటంఃకాపుల‌పై బ‌లిజ‌ల ఫైర్‌
X
కాపు, ఒంటరి, బ‌లిజ కుల‌స్తుల‌ను బీసీ జాబితాలో చేర్చాల‌నే నినాదంతో సాగుతున్న నిర‌స‌న‌ల్లో చీలిక ఏర్పడి అది తారాస్థాయికి చేరింది. ఏకంగా ర‌చ్చ కెక్కే స్థాయికి ఈ వివాదం చేరిపోయింది. కాపు-బలిజల పోటా పోటీ పూజలకు రాష్ట్రంలోని దేవాలయాలు వేదిక కానున్నాయి. కాపులకు బీసీ హోదా కల్పించాలంటూ తునిలో జరిపిన కాపుగర్జన - ఆ సందర్భంగా జరిగిన రైళ్లు, పోలీసుస్టేషన్ల దహనానికి నేటికి ఏడాది కానుంది. ఆ సందర్భంగా కాపునేత ముద్రగడ, బలిజ నేతలు ఒవి రమణ - శివశంకర్‌ బాబు ఇచ్చిన పోటాపోటీ పూజల పిలుపు కాపు-బలిజ వర్గాల్లో గందరగోళం రేపుతున్నాయి.కాపులకు న్యాయం కోసం జ‌రిగే పోరాటంలో పై చేయి సాధించ‌డం కాస్త వివాదంగా మారే ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు.

తాము అడగకపోయినా, ఎన్నికల్లో ఇచ్చిన బీసీ హామీని గుర్తు చేసినందుకు కాపులను అణచివేస్తున్న బాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ, తుని ఘటనకు ఏడాదయిన సందర్భంగా కాపు-బలిజ-ఒంటరి కులాలవారంతా అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని ముద్రగడ ప‌ద్మ‌నాభం బహిరంగ లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని కాపు వర్గాలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు సిద్ధమవుతున్నాయి. అయితే, ముద్రగడ పిలుపునకు పోటీగా బలిజ నేతలు కూడా అలాంటి పిలుపునే ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. కాపులను చీల్చి, వారిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దాసోహం చేసేందుకు ప్రయత్నిస్తున్న ముద్రగడకు మంచి బుద్ధి ప్రసాదించి, అందరం కలసి సీఎం చంద్ర‌బాబు వద్దకు వెళ్లి ఒత్తిడి చేసేలా మంచి బుద్ధి ప్రసాదించేలా చూడాలంటూ రాయలసీమతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లా బలిజలు కూడా దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహించాలని ఏపీ బలిజ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఓ.వి.రమణ, బలిజనాడు కన్వీనర్ బి.శివశంకర్‌ బాబు పిలుపునివ్వడం రసవత్తరంగా మారింది. కాగా, విధ్వంసం జరిగిన సందర్భాన్ని కూడా రాజకీయం చేసి, దానికి దేవాలయాలకు వెళ్లి పూజలు చేయడం ఏమిటో అర్ధం కావడం లేదని బలిజ నేత‌లు అంటున్నారు. మొత్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మం కూడా తీవ్ర వివాదం పాలు కావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/