Begin typing your search above and press return to search.

మనం డప్పులతో రెడీగా ఉండాలి!

By:  Tupaki Desk   |   4 Sep 2016 5:00 AM GMT
మనం డప్పులతో రెడీగా ఉండాలి!
X
భారతీయ జనతా పార్టీ పదాధికారుల సమావేశం ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధాని బెజవాడలో నిర్వహించారు. రాష్ట్రస్తాయిలో కీలక నాయకులు అనేకమంది పాల్గొన్నారు. అందరూ కలిపి ఫైనల్‌ గా తీసుకున్న నిర్ణయాలు మాత్రం.. రాష్ట్రంలో పార్టీ విస్తరణ గురించే. పార్టీ విస్తరణ అంటే కార్యకర్తల బేస్‌ ను పెంచుకోవడం, కార్యక్రమాలు నిర్వహించడం ఇలాంటి ఆలోచనలు ఎవరైనా చేస్తారు. కానీ భాజపా నాయకులకు అలాంటి ఆలోచనలకంటె.. అప్పనంగా మరో అవకాశం అందివస్తున్నదని, దాన్ని పట్టుకుని.. కష్టం లేకుండా.. జనంలో పేరు తెచ్చుకోవాలని వారు ఆరాటపడుతున్నారని జనం అనుకుంటున్నారు.

మొత్తానికి పదాధికారుల సమావేశంలో రాష్ట్ర భాజపా నేతలు తేల్చింది ఒక్కటే. కేంద్రం - ఏపీకి హోదా ఇచ్చినా - ప్యాకేజీ ఇచ్చినా.. లేదా మరే ఇతర సాయం అందించినా సరే.. సదరు సాయం అనేది కేవలం రాష్ట్ర భాజపా కృషి వల్ల మాత్రమే వచ్చిందని డబ్బా కొట్టుకోవాలి. కేంద్రంలోని తమ పార్టీ ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రతిరూపాయి సహాయానికి తగినట్లుగా ప్రజల్లో పార్టీ పట్ల భక్తిని పెంపొందింపజేయాలని భాజపా నాయకులు భావించినట్లుగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో త్వరలో పురపాలక - ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయని... ఈ ఎన్నికల్లో పార్టీని వీలైతే స్వతంత్రంగా బరిలోకి దించి ప్రజల్లో తమ కరిష్మాను పరీక్షించుకోవాలని భాజపా భావిస్తోంది. ఎన్నికలు వచ్చే వరకు ఆగకుండా, కేంద్రంనుంచి రాష్ట్రానికి సాయం వచ్చిన క్షణం నుంచి దాన్ని గురించి పాజిటివ్‌ గా జనంలో సొంతడబ్బా కొట్టుకోడానికి భాజపా నాయకులు ఒక నిశ్చయానికి వచ్చేసినట్లున్నారని జనం అనుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో తెదేపా పరిపాలన సాగుతోంటే.. వారిని బైపాస్‌ చేసి మరీ దక్కగల కీర్తి మొత్తాన్ని తామే కాజేయాలని భాజపా అత్యాశకు పోతుండడం ఇరు పార్టీల సంబంధాల మీద ప్రభావం చూపగలదో ఏమో చూడాలి.