Begin typing your search above and press return to search.

'ధర్నాలా' ఏపీ బీజేపీ నేతలకు ఆ అర్హత ఉందా?

By:  Tupaki Desk   |   12 Aug 2019 12:30 PM GMT
ధర్నాలా ఏపీ బీజేపీ నేతలకు ఆ అర్హత ఉందా?
X
ప్రత్యేకహోదాను ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టింది భారతీయ జనతా పార్టీ నేతలు. తమకు అధికారం అప్పగిస్తే చాలు ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామంటూ అప్పుడు హడావుడి చేసింది వాళ్లు. ఇక ఆ తర్వాత ప్రత్యేకహోదా గురించి కమలనాథులు వ్యవహరించిన తీరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వరసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన ధీమాతో బీజేపీ వాళ్లు మరింత ఓవరాక్షన్ చేస్తూ ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో.

అయితే వాళ్లకు సీట్లు వచ్చింది ఎక్కడో ఉత్తరభారతదేశంలో అని, సౌత్ కు తాము ఎలాంటి సాయం అందించాల్సిన అవసరం లేదని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్టుందని మేధావి వర్గాలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాయి. ఏపీకి ప్రత్యేకహోదా విషయమే తీసుకుంటే ఆ విషయంలో బీజేపీ ఎంత నిర్భీతిగా వ్యవహరిస్తోందో అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో అధినాయకత్వంతో మాట్లాడి ఏపీ పరిస్థితిని వివరించి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా పాటు పడాలి బీజేపీ ఏపీ విభాగం నేతలు. అయితే వారు మాత్రం ఢిల్లీ నేతల కన్నా దారుణంగా తయారయ్యారని నెటిజన్లు అంటున్నారు.

అధిష్టానాన్ని మెప్పించే ఉద్దేశంతో వారు రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడానికి కూడా వెనుకాడటం లేదని నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం అంటూ ఏపీ బీజేపీ నేతలు తరచూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అలా అంటే ఏపీలో కూడా భారతీయ జనతా పార్టీది ముగిసిన అధ్యాయమే అని సోషల్ మీడియాలో కామెంట్లు పడుతున్నాయి.

హోదా విషయంలో ఏపీ ప్రయోజనాలకు పాటుపడని బీజేపీ నేతలు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో అలా ఏ మాత్రం దృష్టి పెట్టని వారు ఏపీ ప్రభుత్వం మీద మాత్రం అడ్డగోలుగా పడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఏపీలో ధర్నాలు, ర్యాలీలు అంటూ బీజేపీ ఏపీ విభాగం అంటోందని..అది విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి నెట్ లో. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉంది, ఇలాంటి తరుణంలో ఏపీకి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంతో పాటు రాష్ట్రానికి ఇతోధికంగా నిధులు వచ్చేందుకు ఏపీ బీజేపీ నేతలు కృషి చేయాల్సింది. అయితే వారు అలాంటి పనులు పెట్టుకోవడం లేదని నెటిజన్లు అంటున్నారు.

మాటెత్తితే జగన్ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారని, 0.84 శాతం ఓటు పర్సెంటేజీతో బీజపీ నేతలు చాలా ఎక్కువ అథారిటీ చెలాయిస్తూ ఉన్నారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. బీజేపీ నేతలకు రాష్ట్రం మీద అంత శ్రద్ధ ఉంటే ముందుగా రాష్ట్రానికి దక్కాల్సినవి ఢిల్లీ నుంచి తీసుకురావాలని, ఆ తర్వాత మాట్లాడాలని నెటిజన్లు చురకలు అంటిస్తున్నారు కమలనాథులకు.