Begin typing your search above and press return to search.

బెయిలూ...జైలూ... బీజేపీ సభలో పేలిన తూటాలు

By:  Tupaki Desk   |   29 Dec 2021 6:00 AM IST
బెయిలూ...జైలూ... బీజేపీ సభలో పేలిన  తూటాలు
X
మొత్తానికి ప్రజాగ్రహ సభ పేరిట బీజేపీ నేతలు తమ ఆగ్రహాన్ని బాగా చూపించారు. మాటలను తూటాలుగా పేల్చేసారు. ఖబ‌డ్దార్ కాచుకో అంటూ ప్రత్యర్ధుల మీద శరసంధానమే చేశారు. బెయిల్ జైలూ అంటూ కమలనాధులు పేల్చిన బాంబులు పొలిటికల్ గా ఇపుడు ఏపీలో బాగా పేలుతున్నాయి. ఇంతకీ ఆ బాంబులు ఎవరి మీద అన్నదే చర్చ.

ఈ సభకు వచ్చిన అగ్ర నేత ప్రకాష్ జావదేకార్ అయితే ఏపీలో చాలా మంది నాయకులు ఈ రోజుకీ బెయిల్ మీద ఉన్నారని హాట్ హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో వారంతా జెయిల్ కి వెళ్లబోతున్నారని కూడా జోస్యం చెప్పేశారు. అవినీతి పార్టీలుగా కుటుంబ పార్టీలు మారాయని ఆయన వైసీపీ, టీడీపీలని టార్గెట్ చేశారు.

ఏపీకి ఎంతో చేశామని అయినా కూడా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఆ రెండు పార్టీలే అంటూ ప్రకాష్ జావదేకర్ ఘాటుగానే విమర్శించారు. పోలవరాన్ని అన్ని అనుమతులూ ఇచ్చినా ఈ రోజుకీ పూర్తి చేయకపోవడం దారుణమే అన్నారు. అమరావతి రాజధానికి కూడా అటవీ భూములు తాను కేంద్ర మంత్రిగా ఉండగా ఇచ్చామని ప్రకాష్ జావదేకర్ చెప్పారు.

ఇక సోము వీర్రాజు అయితే ఇంకా గట్టిగానే మాట్లాడారు, జగన్ కి బీజేపీ ఏం చూపించాలో అదే చూపిస్తుంది అంటూ మాట్లాడారు. తాము ఎవరికి ఎందుకు భయపడాలి, తాము ఏమైనా జైలుకు వెళ్ళి వచ్చిన వాళ్లమా, మళ్లీ భవిష్యత్తులో జైలుకి వెళ్లబోతామా అని సోము పేల్చిన మాటల తూటాలు బీజేపీ సభలో హైలెట్ అనే చెప్పాలి.

మొత్తానికి ఏపీకి తామూ అన్నీ చేశామని, చేతగానితనమంతా టీడీపీ వైసీపీదే అని బీజేపీ నేతలు చెప్పుకున్నారు. తమకు అధికారం ఇస్తే ఏపీ అభివృద్ధిని ఎక్కడో పెడతామని కూడా చెప్పేశారు. సోము వీర్రాజు అయితే అమరావతి రాజధాని మీద ఆశల ఊసులే పెంచారు. బీజేపీకి పవర్ ఇస్తే కేవలం మూడేళ్ళ లోపే అమరావతి రాజధాని నిర్మాణం జరగకపోతే చూడండి అని చాలెంజి చేశారు.

మొత్తానికి బీజేపీ ప్రజాగ్రహ సభ లక్ష్యం నెరవేరింది అనుకోవాలి. తమది అణా కాణీ పార్టీ కానే కాదు, తేడా వస్తే తోలు తీస్తామంటూ పవర్ ఫుల్ పంచులతో కమలనాధులు తమ ఆవేశాన్ని బాగానే చూపించారు. మరి బీజేపీ దూకుడు చూస్తూంటే ఏపీలో ఎవరు ఎక్కడ సర్దుకోవాలో అక్కడ సర్దుకోవాల్సిందే అన్నట్లుగానే ఈ సభ హెచ్చరించినట్లుగానే చూడాలేమో.