Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రోళ్లు రైతులు కాదేటి? - సోము ప్రశ్న

By:  Tupaki Desk   |   16 Jun 2022 3:30 AM GMT
ఉత్తరాంధ్రోళ్లు రైతులు కాదేటి? - సోము ప్రశ్న
X
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు చెంత వంశ‌ధార ప్రాజెక్టు పై కన్నేసి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా బీజేపీ ఈ ప్రాజెక్టు విష‌య‌మై ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించింది. అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక ఉత్త‌రాంధ్ర ప్రాజెక్టుల విష‌య‌మై బీజేపీ క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న చేప‌ట్టి, వాస్త‌వాలు తెలుసుకునే ప్ర‌య‌త్నం ఒక‌టి చేసింది. వాస్త‌వానికి వైసీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల ఊసు పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు అన్న విమ‌ర్శ‌లు న్నాయి. నిధుల కేటాయింపుల‌న్న‌వి లేనే లేవు అని కూడా తెలుస్తోంది.

బ‌డ్జెట్ లో కూడా కొద్దిపాటి నిధులే కేటాయించి వాటిని కూడా ఇవ్వ‌ని లేదా ఇవ్వ‌లేని అవ‌స్థతోనే కాలం గ‌డుపుతోంది అన్న విమ‌ర్శ కూడా ఉంది. ముఖ్యంగా రెండేళ్లుగా ఉత్త‌రాంధ్ర వ‌ర ప్ర‌దాయినిగా చెప్పుకునే తోట‌ప‌ల్లి కానీ వంశ‌ధార ప్రాజెక్టు విష‌య‌మై కానీ అస్స‌లు వైసీపీ పట్టించుకున్నదే లేదు అని కూడా విమ‌ర్శ‌లు విప‌క్షం నుంచే ఉన్నాయి.

టీడీపీ హయాంలో అధిక శాతం ప‌నులు పూర్తి చేసి ఇచ్చినా ఇంకా మిగిలిన ఆ కొద్ది పాటి ప‌నుల పూర్తిగా ప్ర‌భుత్వం దృష్టి సారించ‌క, మీన‌మేషాలు లెక్కిస్తోంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా ఓ రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లు కేటాయిస్తే ప్రాజెక్టు ప‌నులు పూర్తి అయిపోతాయ‌ని సోము వీర్రాజు అంటున్నారు. నిన్న‌మొన్న‌టి వేళ ప్రాజెక్టు సంద‌ర్శ‌న సంద‌ర్భంగా ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు. క్షేత్ర స్థాయిలో నెల‌కొన్న స‌మ‌స్య‌లు, నిజానిజాలు నిర్థారించుకున్నాకే తాను ఈ మాట‌లు చెబుతున్నాన‌ని సోము వీర్రాజు అంటున్నారు.

పోల‌వ‌రం నిర్మాణానికి యాభై వేల కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చిస్తున్న వైసీపీ సర్కారు ల‌క్ష ఎక‌రాల‌కు నీళ్లు ఇచ్చి, ప‌చ్చ‌ని పంట పొలాల‌కు జీవ ధార‌గా నిలిచే ఈ ప్రాజెక్టు విష‌య‌మై ఎందుక‌ని చొర‌వ చూప‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు.

ఏం ఉత్తరాంధ్రోళ్లు రైతులు కాదా, వారు మీకు కనపడరా అని నిలదీశారు. శ్రీ‌కాకుళం జిల్లా, టెక్క‌లి మండ‌లంలో వీర్రాజు ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగానే పై వ్యాఖ్య‌లు చేశారు. ఇదేవిధంగా స్థానిక వైసీపీ నాయ‌కుల అరాచకాలు అంటూ ఆయన కొన్ని కామెంట్లు చేశారు.