Begin typing your search above and press return to search.

ఇప్పుడు అందరి కత్తులు పదునెక్కుతాయి: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   15 Jan 2023 4:30 PM GMT
ఇప్పుడు అందరి కత్తులు పదునెక్కుతాయి: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు!
X
ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు తమ అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి. విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

అధికార వైసీపీ ఒంటరి పోరాటానికే సిద్ధమవుతోంది. ఇక జనసేన–బీజేపీ మధ్య ప్రస్తుతం పొత్తు నడుస్తోంది. మరోవైపు టీడీపీ సైతం జనసేన–బీజేపీ తమతో కలసి రావాలని కోరుకుంటోంది. 2014లో మాదిరిగానే మూడు పార్టీలు పొత్తుతో విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌ పై అందరి దృష్టి నెలకొని ఉంది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వబోనని పవన్‌ చెబుతున్నారు. బీజేపీ కూడా జనసేన, టీడీపీలతో కలిసి రావాలని పవన్‌ భావనగా ఉందని అంటున్నారు.

మరోవైపు బీజేపీ మాత్రం వైసీపీ, టీడీపీ రెండూ అవినీతి పార్టీలని చెబుతోంది. అలాగే ఆ రెండూ కుటుంబ పార్టీలేనని.. వాటితో తమకు ఏ విదమైన పొత్తు ఉండబోదని స్పష్టం చేస్తోంది. జనసేనతోనే తమ ప్రస్థానం కొనసాగుతోందని చెబుతోంది.

అయితే కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి బహిరంగ సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ హాట్‌ కామెంట్స్‌ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు పొత్తుల దిశగానే పవన్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన, టీడీపీ పొత్తు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సోము వీర్రాజును పవన్‌ వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా కోరగా.. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇక అన్ని రాజకీయ పార్టీల కత్తులు పదునెక్కుతాయని వ్యాఖ్యానించారు.

పవన్‌ కల్యాణ్‌ మాటలు కొత్తగా ఉన్నాయని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ మాటలు ఇంకా స్పష్టంగా ఉండాలని కోరుకుంటానన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైఖరికి అనుగుణంగానే రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సోము వీర్రాజు వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

మరోవైపు సోము వీర్రాజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం న్యూఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఏపీ తాజా రాజకీయ పరిస్థితులు, పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు, వైసీపీ ప్రభుత్వ విధానాలు, టీడీపీ.. బీజేపీతో పొత్తు కోరుకుంటున్న సంగతిపై బీజేపీ అధిష్టానానికి సోము వీర్రాజు వివరిస్తారని టాక్‌ నడుస్తోంది.

బీజేపీ అధిష్టానం సూచనల మేరకు ఇక నుంచి ఏపీలో బీజేపీ విధి విధానాలు ఉంటాయని అంటున్నారు. పవన్‌ తమకంటే టీడీపీతో పొత్తుకే మొగ్గు చూపితే తాము కూడా ఆ కూటమిలో చేరడమా లేదంటే సొంతంగా పోటీకి వెళ్లడమా అనేది తేలుతుందని చెబుతున్నారు.