Begin typing your search above and press return to search.

ఏటా అయిదు వేల కోట్ల అవినీతి... స్టేట్మెంట్స్ తోనే సరా సోమూ ?

By:  Tupaki Desk   |   23 Jan 2023 1:30 AM GMT
ఏటా అయిదు వేల కోట్ల అవినీతి... స్టేట్మెంట్స్ తోనే సరా సోమూ ?
X
ఏపీలోని వైసీపీ సర్కార్ మీద అతి పెద్ద ఆరోపణ చేశారు బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు. అయితే ఇది ఆరోపణ కంటే కుంభకోణం అనే చెప్పాలి. ఏటా పౌరసరఫరాల శాఖలో అయిదు వేల కోట్ల రూపాయల భారీ అవినీతి సాగుతోందని సోము వీర్రాజు అంటున్నారు. ఇప్పటిదాకా తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇంతటి భారీ అవినీతి ఆరోపణ చేయలేదు.

సోము వీర్రాజు కూడా ప్రభుత్వం మీద సాదా సీదా విమర్శలే చేస్తూ వచ్చారు. కానీ ఏటా అయిదు వేల కోట్లు అంటూ మూడేళ్ళలో 15 వేల కోట్ల కుంభకోణం వైసీపీ ఏలుబడిలో సాగుతోందని తెలిశాక సోము కేవలం స్టేట్మెంట్ ఇచ్చి అలా వదిలేస్తారా అన్న చర్చ అయితే వస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది.

ఏపీ ప్రభుత్వం కూడా కేంద్రం విషయంలో వినే పరిస్థితుల్లోనే ఉంది. మరి అలాంటపుడు ఏ కేంద్ర దర్యాప్తు సంస్థనో దించి ఈ అవినీతి భాగోతాన్ని బయటపెడితే బీజేపీకి మంచి పొలిటికల్ స్కోర్ పేరు వస్తుంది కదా అని అంటున్నారు. అలా కాకుండా ఊకదంపుడుగా అవినీతి అక్కడ జరిగింది అంటే అది జనంలోకి వెళ్తుందా అని కూడా చూడాల్సి ఉంది. పైగా జనాలు సైతం దాన్ని లైట్ తీసుకుంటారు అనే అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పౌర సరఫరా శాఖకు కేంద్రం నుంచి ఉచిత బియ్యంతో పాటు ఇతర సరుకులు సబ్సిడీ మీద వస్తున్నాయి. మరి అవి అనుకున్నట్లుగా జనాలకు అందడం లేదా లేక వాటిని దారి మళ్ళించి వేరేగా తరలిస్తున్నారా అన్నది సోము చెప్పాలి. నిజానికి ఉచిత బియ్యం అంటున్నా వాటిని జనాలు తినడంలేదు అనే అంటున్నారు. డీలర్లకే అమ్ముకుంటున్నారు. వారు అలా ఇతర రాష్ట్రాలకు బ్లాక్ లో తరలించి తమకు తోచిన కాడికి అమ్ముకుంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి.

అయితే అదంతా సరుకు బయటకు వచ్చాక జరిగే తంతు. కానీ ఏకంగా పౌరసరఫరాల శాఖలోనే అంతులేని అవినీతి అంటున్నారు. అంటే అది మంత్రిత్వ శాఖలో జరుగుతోందా లేక ఉన్నత స్థాయి అధికారుల లెవెల్ లో సాగుతోందా అన్నది కూడా తేటతెల్లం చేయాలని అంటున్నారు. ఏమీ లేకుండా ఆరోపణలు చేస్తే మాత్రం అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంది అని అంటున్నారు.

ఇక సోము వీర్రాజు మరో విషయం కూడా చెబుతున్నారు. ఈ భారీ అవినీతి గత రెండు దశాబ్దాలుగా సాగుతోందని. అంటే ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ దానికి ముందు రెండు సార్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పౌరసరఫాల శాఖలో అవినీతి గూడు కట్టుకుని ఉందని సోము చెప్పారు. మరి ఇంతకాలం అవినీతి సాగుతోందని తెలిసి సోము ఇపుడే పెదవి విప్పడం ఒక చిత్రమైతే ఇప్పటికైనా ఆ అవినీతికి అడ్డుకట్ట వేసే పనులు ఆయన చేస్తారా కేంద్రంతో చెప్పి విచారణకు ఉపక్రమిస్తరా అన్నది చూడాలని అంటున్నారు.