Begin typing your search above and press return to search.

ఏపీకి చెందిన కూలీ కుర్రాడు.. ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు

By:  Tupaki Desk   |   31 Dec 2021 3:30 AM GMT
ఏపీకి చెందిన కూలీ కుర్రాడు.. ప్రపంచాన్ని చుట్టేస్తున్నాడు
X
చదివింది పదో తరగతి. ఇంగ్లిషు కూడా పెద్దగా రాదు. కానీ.. నిండైన సంకల్పం.. అంతకు మించి తన లక్ష్యాన్ని చేరుకోవటం కోసం దేనికైనా సిద్ధమన్నట్లుగా వ్యవహరించే తీరు ఇప్పుడు అతన్ని యూట్యూబ్ సంచలనంగా మారాడు. ఇంతకీ అతడెవరో కాదు.. తెలుగు ట్రావెలర్ ఉమ. ఇదే పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న ఇతడ్ని 7 లక్షల మంది ఫాలో అవుతున్నారు.

ఏపీలోని క్రిష్ణా జిల్లా మొవ్వ మండలం మూలపాలానికి చెందిన ఉమా ప్రసాద్ తల్లిదండ్రులతో ఉండేవాడు. ప్రస్తుతం గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపనిలో ఉండే ఇతడికి ప్రపంచంలోని 197 దేశాల్ని తిరగాలన్నది కోరిక. అయితే.. రోజువారీ కూలీగా పని చేసే ఇతడికి ఆ కల చాలా ఖరీదైనదిగా మారింది. అయినప్పటికి తాను దాచుకున్న రూ.1.5లక్షలతో ప్రపంచ దేశాల్ని చుట్టేయాలని ఆశించాడు. అందుకు తగ్గట్లే దారిన పోయే వాహనాల్ని లిఫ్టు అడుగుతూ తన ప్రయాణాన్ని షురూ చేస్తాడు.

అలా వేమూరు మండలం నుంచి నేపాల్ వరకు పది రోజుల వ్యవధిలో చేరుకోగలిగాడు. అక్కడ జర్మనీకి చెందిన ఒక ట్రావెలర్ పరిచయం కావటం.. అలా ప్రయాణిస్తే.. ప్రపంచ దేశాల్ని పర్యటించటం అంత తేలిక కాదన్న సూచన చేశాడు. దీంతో.. తన టూర్ ను ఆపేసిన ఉమ.. కూలీ పని కోసం ఆఫ్రికా ఖండంలోని మాలీ దేశానికి వెళ్లాడు. అక్కడ పని చేస్తూనే.. వీడియోల్ని యూట్యూబ్ లో పోస్టు చేసేవాడు. రెగ్యులర్ గా అప్డేట్ చేసే ఇతడి వీడియోల్ని పెద్ద ఎత్తున ఫాలో అయ్యేవారు. అలా ఫాలో అయ్యే వారు లక్షకు చేరటం.. దాంతో వచ్చే ఆదాయంతో ప్రపంచ పర్యటన మొదలు పెట్టాడు.

ఇలా మొదలైన అతని జర్నీ ఇప్పుడు 7 లక్షల మంది వీక్షకులు అతని యూట్యూబ్ చానల్ ను ఫాలో అవుతున్నారు. ఇప్పటికే దుబాయ్.. టాంజానియా.. ఆఫ్రికాలోని ఉగాండ.. నమీబియా.. కెన్యా తదితర దేశాల్ని తిరిగి వచ్చిన అతడు.. తాను తిరిగే దేశాల విశేషాలు.. అక్కడి ఆహారం.. జీవనశైలి.. ప్రజల గురించి.. ప్రక్రతి అందాల్ని వివరిస్తూ ముందుకు సాగుతుంటాడు. తాము వెళ్లలేని దేశాల్లో అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలియజేసే ఇతడి వీడియోలు పాపులర్ కావటం.. అందుకు తగ్గట్లే ఆదాయం పెరగటంతో గడిచిన 14 నెలల్లో ఏకంగా 20 దేశాల్ని చుట్టేసిన అతడు.. తన ప్రపంచ దేశాల పర్యటన లక్ష్యాన్ని మరింత వేగంగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నాడు. మరి.. ట్రావెలర్ ఉమాకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం. కొత్త సంవత్సరంలో మరిన్ని దేశాల్ని చుట్టేయాలని ఆకాంక్షిద్దాం.