Begin typing your search above and press return to search.

ఏపీ బీపీ : ప్ర‌జా వ్య‌తిరేక‌తను పొత్తులే నిలువ‌రిస్తాయా?

By:  Tupaki Desk   |   9 May 2022 3:29 AM GMT
ఏపీ బీపీ  : ప్ర‌జా వ్య‌తిరేక‌తను పొత్తులే నిలువ‌రిస్తాయా?
X
రాజకీయాల్లో ఏమ‌యినా జ‌ర‌గ‌వ‌చ్చు. పొత్తుల విష‌యం కూడా కొంత వ‌ర‌కూ ఇలానే ఉండ‌వ‌చ్చు. ఊహ‌ల‌కు ప‌రిమితం కాకుండా వాస్త‌వాల‌కు ప్రాధాన్యం ఇస్తే అంతా మంచే జ‌రుగుతుంది. ఆ విధంగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కాస్త సమ‌యం సంయ‌మ‌నం పాటిస్తే మంచి ఫ‌లితాలే వ‌స్తాయి. అదేవిధంగా 2014 మాదిరిగానే అంతా టీడీపీ,బీజేపీ,జ‌న‌సేన కూట‌మి త‌థ్యం అనే భావిస్తున్నారు.

అందుకే వీటిపై ఇప్ప‌టికే కొంత స్ప‌ష్ట‌త కూడా వ‌చ్చింది అని తెలుస్తోంది. అద్భుతం ఏమ‌యినా ఏ క్ష‌ణం అయినా జ‌ర‌గ‌వ‌చ్చు అని ప‌వ‌న్ అంటున్నారు. ఇక పార్టీలు ఏమ‌యినా కూడా అధికార పార్టీపై ఉన్నవ్య‌తిరేకత‌ను త‌మ‌కు అనుగుణంగా మ‌లుచుకోవాలి.ఆ విధంగా మంచి ఫ‌లితాలు సాధించాలి. చంద్ర‌బాబు నాయుడు జ‌నంలోకి వస్తేనే టీడీపీలో విప‌రీతం అయిన క‌దలిక‌లు వ‌స్తున్నాయి.

కానీ మామూలు రోజుల్లో ఇంత‌కుమించి క్షేత్ర స్థాయిలో ప‌నిచేసే వారు అరుదుగా ఉంటున్నారు. ఎలా లేద‌న్నా జ‌గ‌న్ స‌ర్కారును ఢీ కొని, పాల‌న సంబంధ వైఫ‌ల్యాల‌ను జ‌నంలోకి తీసుకువెళ్లాల్సిన బాధ్య‌త టీడీపీ కి ఉంది. టీడీపీతో పోలిస్తే జ‌న‌సేన పార్టీ నాయ క‌త్వం పిలుపు అందుకుంటే చాలు కార్య‌క‌ర్త‌లు ఇంకా బాగా ప‌నిచేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ కి సంబంధించి ప్ర‌స్తుతం కొంద‌రు ట్రోల‌ర్స్ బాగానే ప‌నిచేస్తూ, పార్టీ వాయిస్-ను వినిపిస్తున్నా, జ‌న‌సేన‌తో పోలిస్తే సోష‌ల్ మీడియా యాక్టివిజం కాస్త త‌క్కువే !

ఇక ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలలో ప్ర‌ధానంగా వినిపిస్తోంది రోడ్లు. అదేవిధంగా పింఛ‌న్లు. ఈ రెండూ వేధిస్తున్నాయి. అభివృద్ధి ప‌రంగా పాల‌కు సంబంధించి ఎటువంటి ప‌నులూ మూడేళ్లూ చేపట్ట లేదు. చేస్తామ‌న్న ప‌నులు చేయ‌లేక‌పోయారు. అందుకు ఆర్థిక ప‌రిస్థితి ఓ కార‌ణం కాగా, రెండేళ్ల పాటు క‌రోనా విజృంభ‌ణ మ‌రో కార‌ణం. మ‌రీ ముఖ్యంగా పెట్టుబ‌డుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించ‌డంలో విఫ‌లం అయ్యారు.

ఇది కూడా టీడీపీకి ప్ల‌స్ కావొచ్చు. మేక‌పాటి గౌతం రెడ్డి ఐటీ శాఖను మ‌రియు ప‌రిశ్ర‌మ‌ల శాఖను నిర్వ‌హించినంత కాలం కాస్తో కూస్తో బెట‌ర్ కానీ ఇప్పుడు అది కూడా లేదు. గుడివాడ అమ‌ర్నాథ్ ప‌గ్గాలు అందుకున్నా ఫ‌లితాలు లేవు. ఏ విధంగా చూసుకున్నా కొత్త మంత్రులు ఇంకా నిల‌దొక్కుకోలేదు. ఈలోగా ఎన్నిక‌లు వస్తే టీడీపీ కూట‌మికి ప్ల‌స్..అయితే ఈసారి జ‌న‌సేన అభ్య‌ర్థుల‌ను గెలిపించాల్సిన బాధ్య‌త కూడా బాబుదే అన్న‌ది ఓ వాస్త‌వం.

ఇదే మాట‌ను రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. పొత్తు ధ‌ర్మంలో భాగంగా గ‌తంలో మాదిరిగా కాకుండా మిత్ర ప‌క్షాల ఉనికినీ, గెలుపునూ కూడా ప్ర‌భావితం చేసే విధంగా టీడీపీ ఉంటే బెట‌ర్.. అని కొంద‌రు జ‌న‌సేన అభిమానులు సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. అయితే పొత్తులు తేలితే ఆ మూడు పార్టీలు క‌లిస్తేనే మేలు.. లేదంటే మ‌ళ్లీ వైసీపీకి అధికారం ఖాయం అని కూడా కొంద‌రు జగ‌న్ అభిమానులు అంటున్నారు అదే సోష‌ల్ మీడియాలో ! మ‌రి! ప‌వ‌న్ ఎటు ? టీడీపీతో ఉంటారా ? లేదా బీజేపీతో మైత్రీనే చివ‌రి అంకం దాకా కొన‌సాగిస్తారా? ఏదేమ‌యినా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉంటేనే టీడీపీ అనుకున్న‌దేమ‌యినా ఈ సారి సాధించే అవ‌కాశాలు ఉన్నాయి అన్న‌ది ఓ వాస్త‌వం.