Begin typing your search above and press return to search.

ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులా ఉంది: ఏపీ బీఆర్‌ఎస్‌ నేత హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   2 Jan 2023 10:42 AM GMT
ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరాకులా ఉంది: ఏపీ బీఆర్‌ఎస్‌ నేత హాట్‌ కామెంట్స్‌!
X
తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు, మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి చింతల పార్థసారథి చేరడం ఖాయమైంది. జనవరి 2 సాయంత్రం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌ లో కేసీఆర్‌ సమక్షంలో ఈ ముగ్గురు నేతలు బీఆర్‌ఎస్‌ లో చేరనున్నారు.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా తయారైందని విమర్శించారు. ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందన్నారు.

చరిత్రలో మూడు రాజధానుల నిర్మాణం ఎక్కడా లేదన్నారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే అద్భుతమైన రాజధాని, సెక్రటేరియట్‌ ను నిర్మిస్తామన్నారు. తోట చంద్రశేఖర్, తాను మంచి స్నేహితులమని తెలిపారు. గతంలో ఇద్దరం ఒకే పార్టీలో కలిసి పని చేశామని చెప్పారు. ఇప్పుడు కూడా కలిసే పని చేస్తామని రావెల స్పష్టం చేశారు.

గతంలో కాంగ్రెస్‌ పార్టీ వేధించినట్టే ఇప్పుడు బీజేపీ కూడా ప్రతిపక్ష పార్టీలను వేధిస్తోందని రావెల కిశోర్‌ బాబు మండిపడ్డారు. సీబీఐ, ఈడీ, ఐటీ పేరుతో రాజకీయ పార్టీలను అణిచివేయాలని బీజేపీ చూస్తోందని రావెల కిశోర్‌ బాబు ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బీజేపీకి దేశ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. చివరి శ్వాస వరకు కేసీఆర్‌ తోనే ఉంటానని రావెల కిశోర్‌ బాబు తెలిపారు. బీఆర్‌ఎస్‌ లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుందన్నారు. కేసీఆర్‌ చేస్తున్న కార్యక్రమాలు తనను బాగా ఆకర్షించాయని ఆయన వ్యాఖ్యానించారు.

కాగా 2014లో టీడీపీలో చేరిన రావెల కిశోర్‌ బాబు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గెలుపొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత రావెలతోపాటు ఆయన కుమారుడి వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు రావడంతో చంద్రబాబు రావెలను మంత్రివర్గం నుంచి తొలగించారు.

2019లో రావెల కిశోర్‌ బాబు జనసేన పార్టీలో చేరారు. ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆ పార్టీని కూడా వదిలేసి బీఆర్‌ఎస్‌ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.