Begin typing your search above and press return to search.

బీయారెస్ పార్టీ ఏపీ విభాగం ప్రెసిడెంట్ గా తోట చంద్రశేఖర్ !

By:  Tupaki Desk   |   2 Jan 2023 4:31 PM GMT
బీయారెస్ పార్టీ ఏపీ విభాగం ప్రెసిడెంట్ గా తోట చంద్రశేఖర్ !
X
ఏపీలో బీయారెస్ యాక్టివిటీ అధికారికంగా మొదలైంది. ఆ పార్టీ ఏపీ విభాగం ప్రెసిడెంట్ గా తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఆయన పేరుని ఖరారు చేస్తూ బీయారెస్ జాతీయ ప్రెసిడెంట్ కేసీయార్ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేళ మంచి ముహూర్తంగా ఎంచి ఏపీలో బీయారెస్ ని విస్తరించేందుకు కేసీయార్ పక్కా ప్లాన్ వేశారు.

దాంతో కీలక సమాజికవర్గాల నుంచి నేతలను ఆయన బీయారెస్ లోకి తీసుకున్నారు. ఏపీ బీయారెస్ ప్రెసిడెంట్ గా నియమితులైన తోట చంద్రశేఖర్ తో సహా మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు, ఉత్తరాంధ్రాలోని అనకాపల్లి జిల్లాకు చెందిన జనసేన మాజీ నేత చింతల పార్ధసారధి తదితరులు కేసీయార్ సమక్షంలో బీయారెస్ కండువా కప్పుకున్నారు.

ఇక ఏపీ బీయారెస్ సారధి తోట చంద్రశేఖర్ గురించి చెప్పాలీ అంటే ఆయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయనది రాజకీయంగా సుదీర్ఘ ప్రస్థానమే. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఇక 2014 నాటికి ఆయన వైసీపీ ఎంపీగా ఏలూరు నుంచి పోటీ చేసి ఓడారు. 2019 నాటికి జనసేనలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే సీటుకు పోటీ చేసి ఓడారు. ఇలా మూడు ఎన్నికల నుంచి ప్రజా క్షేత్రంలో నిలబడి తన రాజకీయాన్ని ఆయన పరీక్షించుకుంటున్నారు.

అంగబలం అర్ధబలం దండీగా ఉన్న తోట చంద్రశేఖర్ రాజకీయ మేధావిగా ఉన్నారు. ఆయన జనసేనలో పవన్ కి సన్నిహితులుగా మెలిగారు. ఆ పార్టీ కోసం తన వంతుగా ఎంతో కృషి చేశారు. గోదావరి జిల్లాలకు చెందిన తోట చంద్రశేఖర్ ని తన పార్టీలోకి రప్పించి ఏపీ బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీయార్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు అనే అంటున్నారు. ఏపీలో బలమైన కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడం కోసం ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే రావెల కిశోర్ బాబు కూడా మరో కీలక సామాజిక వర్గానికి చెందిన వారు. ఆయన కూడా మాజీ ప్రభుత్వ అధికారి. దాంతో ఆయన సేవలను ఢిల్లీ స్థాయిలో ఉపయోగించుకుంటామని కేసీయార్ చెప్పడం విశేషం. ఈ సందర్భంగా కేసీయార్ కీలకమైన కామెంట్స్ చేశారు.

ఏపీ నుంచి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అంటున్నారు. సిట్టింగులు కూడా తనకు కాల్ చేసి మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. సంక్రాంతి తరువాత ఏపీలో బీయారెస్ రాజకీయ కార్యకలాపాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని కూడా కేసీయార్ చెబుతున్నారు. మొత్తానికి కేసీయార్ ఏపీ మీద గట్టిగానే గురి పెట్టేశారు. చూడాలి మరి కేసీయార్ దూకుడు ఏపీలో ఏ రేంజిలో ఉంటుందో ఏమిటో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.