Begin typing your search above and press return to search.

కలిసొచ్చే టైం లో రాంగ్ డెసిషన్ లో తోట చంద్రశేఖర్ ?

By:  Tupaki Desk   |   8 Jan 2023 4:10 AM GMT
కలిసొచ్చే టైం లో రాంగ్ డెసిషన్ లో తోట చంద్రశేఖర్ ?
X
ఏపీ బీయారెస్ పార్టీ బాధ్యతలను తోట చంద్రశేఖర్ భుజానికి ఎత్తుకున్నారు. ఆయనకు ఇది నిజంగా అతి పెద్ద బాధ్యత. అంతే కాదు చాలా సాహసోపేతమైన బాధ్యత. ఏపీ విభజనకు మూలమైన టీయారెస్ ఇపుడు బీయారెస్ గా మారినా జనాలు విశ్వసిస్తారు అని ఎవరూ అనుకోవడంలేదు. అన్ని రకాలుగా కునారిల్లిన ఏపీని చూసి జనాలు మండుతున్నారు. ఇపుడు వారి వద్దకు వెళ్ళి బీయారెస్ కి ఓటేయండి అని ఏపీ నేతగా తోట చంద్రశేఖర్ అడగబోతున్నారు.

మరి జనాల మూడ్ తెలిసి కూడా ఆయన ఓట్లు కేసీయార్ కి అని నినదించడమంటే ఆలోచించాల్సిందే. అయినా ఇంత రిస్కీ పాలిటిక్స్ ఎందుకు తోట చంద్రశేఖర్ కి అని అన్న వారూ ఉన్నారు. ఆయన ప్రస్తుతం జనసేన పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో ఉన్నారు. పవన్ పార్టీలో ఆయనకు మంచి ప్లేస్ ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ పొత్తు కుదిరితే ఆయన సునాయాసంగా గెలిచి చట్ట సభలలో అడుగుపెట్టే చాన్స్ ఉంది అని అంటున్నారు.

మరి ఇంతటి అనుకూల వాతావరణాన్ని వదిలేసి మరీ తోట చంద్రశేఖర్ కేసీయార్ కండువా ఎందుకు కప్పుకున్నారు అన్నదే చర్చగా వస్తోంది. ఆయన మొదటి నుంచి రాజకీయంగా ఇలాంటి తప్పటడుగులే వేస్తూ వస్తున్నారు అని కూడా అంటున్నారు. ఆయన పూర్వాశ్రమంలో ఐఏఎస్ అధికారి. స్వచ్చందంగా తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల మీద ఆసక్తితో ఆయన వచ్చారు.

తొలుత ప్రజారాజ్యం పార్టీలో ఆయన చేరి గుంటూర్ నుంచి పోటీ చేసి గట్టిగానే నిలబడ్డారు. కానీ బ్యాడ్ లక్ తో ఓడారు. 2014 నాటికి ఆయన వైసీపీలో చేరి ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గాలి వీచడంతో ఓడారు. ఇక 2019 వరకూ వైసీపీలోనే కంటిన్యూ అయి ఉంటే కచ్చితంగా ఎంపీ అయ్యేవారు. ఆ ఎన్నికల్లో జగన్ వేవ్ బలంగా వీచింది.

కానీ వైసీపీలో ఉండకుండా తోట చంద్రశేఖర్ జనసేనను ఎంచుకున్నారు. గత మూడున్నరేళ్ళుగా ఆ పార్టీతో తన రాజకీయ ప్రయాణం సాగిస్తూ అన్ని రకాలుగా పార్టీకి అండగా ఉంటూ వస్తున్న ఆయన సడెన్ గా బీయారెస్ వైపు తిరగడం పట్లనే అంతా విస్తుపోతున్నారు. దగ్గరకు వచ్చి తన దారి మరచిపోయారా లేక వస్తున్న లక్ ని కాదనుకుంటున్నారా అన్నది కూడా ఆయన గురించి ఆలోచించేవారిలో ఉంది.

ప్రస్తుతం ఉన్న పార్టీలోనే కొనసాగితే కడుపులో చల్ల కదలకుండా పదవిని అందుకునేవారు అని అంటున్నారు. కానీ తోట మాత్రం షరా మామూలుగా మరో కండువా మార్చేశారు. పైగా బీయారెస్ పేరుతో ఆయన ఏపీలో సాహసోపేతమైన రాజకీయాలను చేయబోతున్నారు. మరి ఆయన వ్యూహాలు ఏంటి ఆయన టార్గెట్ ఏంటి, ఆయన ధీమా ఏంటి అన్నది తెలియదు కానీ రైట్ టైం లో రాంగ్ డెసిషన్ తీసుకున్నారా అన్నదే అంతటా చర్చ మరి.