Begin typing your search above and press return to search.

బడ్జెట్ లో కొత్త లెక్కలు

By:  Tupaki Desk   |   19 May 2021 10:30 AM GMT
బడ్జెట్ లో కొత్త లెక్కలు
X
గురువారం రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2021-22 ఆర్ధిక బడ్జెట్లో కొత్తగా మహిళలు, పిల్లల కోసం కేటాయించిన నిధుల లెక్కలను ప్రత్యేకంగా చూపించబోతున్నారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇలాంటి ప్రత్యేక లెక్కలు చూపించలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటి వర్గాలతో పాటు మహిళలకు కూడా బాగా ప్రాధాన్యత ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్లలో కానీ, నియమించిన వివిధ రకాల పోస్టుల్లో కూడా మహిళలకు ప్రత్యేక కోటాను కేటాయించారు. దేవాదాయ ధర్మాదాయ పాలకమండళ్ళు, బీసీలకు కేటాయించిన కార్పొరేషన్లలో కూడా మహిళలకు పెద్దపీట వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే పద్దతిలో తాజా బడ్జెట్లో కూడా మహిళ కోసం చేసిన ఖర్చులను ప్రత్యేక పద్దులో చూపించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

ఎలాగూ మహిళలకు ప్రత్యేక పద్దు చూపిస్తోంది కాబట్టి పనిలో పనిగా పిల్లలకోసం చేసిన ఖర్చులను కూడా చూపాలని డిసైడ్ అయ్యింది. 18 ఏళ్ళల్లోపు పిల్లలకు వివిధ పథకాల్లో ఎంత ఖర్చులు చేసింది లెక్కల్లో చూపించాలని జగన్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగానే ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి బడ్జెట్లో ఏర్పాట్లుచేశారు.

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభంలో ప్రవేశపెడుతున్న ఒక్కరోజు బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరించాలని టీడీపీ నిర్ణయించింది. ఒక్కరోజు సమావేశంలో చర్చించేందుకు ఏమీ ఉండదు కాబట్టి ఎక్కువ రోజులు సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే కరోనా తీవ్రత కారణంగా తప్పనిపరిస్దితుల్లో బడ్జెట్ కోసం ఏర్పాటు చేసిన సమావేశం కాబట్టి ఒక్కరోజు కన్నా సాధ్యం కాదని ప్రభుత్వం చెప్పింది.