Begin typing your search above and press return to search.

ఈరోజు ఏపీ కేబినెట్ కీలకమైనది

By:  Tupaki Desk   |   21 Jan 2022 4:43 AM GMT
ఈరోజు ఏపీ కేబినెట్ కీలకమైనది
X
అనేక వివాదాల నడుమ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. సెక్రటేరియట్ లో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే సమావేశంలో పీఆర్సీ వివాదం, ఉద్యోగులు, టీచర్ల సమ్మె, సినిమా టికెట్ల ధరల్లాంటి అనేక అంశాలపై చర్చలు జరగబోతోంది. మంత్రివర్గ సమావేశం అజెండాలో ఎన్ని అంశాలున్నా ప్రస్తుత పీఆర్సీ, ఉద్యోగుల సమ్మె మాత్రమే కీలకమైనది. పీఆర్సీ వివాదం, ఉద్యోగుల సమ్మె రెండుకూడా ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

తాజా వివాదం ఫలితంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు జనవరి జీతాలు అందటంలో బాగా ఆలస్యం అయ్యేట్లు కనబడుతోంది. పీఆర్సీ వివాదం తేలితే కానీ ఉద్యోగులు విధుల్లోకి వచ్చేట్లు కనబడటం లేదు. ఉద్యోగులు విధుల్లో చేరితే కానీ జీతాల బిల్లులు రెడీ కావు. బిల్లులు రెడీ అయితేకానీ బ్యాంకు ఖాతాల్లో జీతాలు పడవు. ఇదే విషయమై క్యాబినెట్ సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. పీఆర్సీ వివాదంపై చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ సమావేశంలో మంత్రులందరికీ వివరించబోతున్నారు.

సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే సినిమా టికెట్ల ధరల అంశం కూడా కీలకమైనదే. టికెట్ల ధరల విషయంలో ఇటు నేతలు అటు సినిమా ప్రముఖులు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. దాంతో అసలు విషయం కన్నా కొసరు విషయమే బాగా వివాదాస్పదమైపోతోంది. నిజానికి సినిమా టికెట్ల ధరలపై డైరెక్టుగా కనెక్టయ్యేది ఎగ్జిబిటర్లు అంటే సినిమా థియేటర్ల ఓనర్లు. ఎగ్జిబిటర్ల సంఘం బాధ్యులు మాత్రం బహిరంగంగా పెద్దగా మాట్లాడటం లేదు. కానీ ప్రత్యక్షంగా సంబంధంలేని కొందరు హీరోలు, డైరెక్టర్లు ముఖ్యంగా అధికార పార్టీ ఎంఎల్ఏలు మాత్రం గోల గోల చేసేస్తున్నారు.

ఈ కారణంగానే ప్రతి విషయం బాగా వివాదాస్పదమైపోతోంది. సినిమా ఫీల్డులో కొందరు ప్రముఖులు ప్రభుత్వ నిర్ణయానికి బహిరంగంగానే మద్దతు పలుకుతున్నారు. అంటే ప్రభుత్వ నిర్ణయంపై సినీ పరిశ్రమలోనే భిన్న వాదనలున్నట్లు అర్ధమవుతోంది. సరే వ్యతిరేకించే వారైనా, మద్దతు పలికేవారైనా పద్దతిగా మాట్లాడటం వల్ల సమస్య లేదు. కానీ వ్యతరేకించే రామ్ గోపాల్ వర్మ లాంటి వారు ఏకంగా ప్రభుత్వ అధికారాలనే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వాళ్ళవల్లే సమస్యలు పెరిగిపోతున్నాయి. మరి వీటన్నింటికీ క్యాబినెట్ సమావేశం ముగింపు పలుకుతుందేమో చూడాలి.