Begin typing your search above and press return to search.

ఏపీ రాజధాని మంగళగిరి.. లెక్క ఇదే..

By:  Tupaki Desk   |   19 Oct 2019 11:14 AM GMT
ఏపీ రాజధాని మంగళగిరి.. లెక్క ఇదే..
X
ఏపీ రాజధాని అమరావతి. దీనికి సంబంధించి పలు గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూముల్ని సేకరించి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు ఇప్పటికే కసరత్తు చేపట్టటం.. తాత్కాలిక భవనాల్ని నిర్మించటం తెలిసిందే. అమరావతి పరిధిలోని రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములు సేకరించి.. రాజధాని నగరాన్ని నిర్మించాలన్న ఆలోచన చేయటం తెలిసిందే.

అయితే.. చినుకు పడితే చిత్తడయ్యే నేలలు.. రాజధాని నగరానికి ఏ మాత్రంగా అనువుగా లేని పరిస్థితుల వేళ.. రాజధాని నగరం మీద కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే నిర్మించిన తాత్కాలిక సచివాలయం వర్షాల కారణంగా ఎలాంటి ఇబ్బందులకుగురి అవుతున్నది చూస్తున్నదే.

ఇదిలా ఉంటే.. జగన్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏపీ రాజధానిగా అమరావతి కొనసాగే అంశంపై పలు సందేహాలు తెర మీదకు వచ్చాయి. దీనికి తోడు మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల నేపథ్యంలో రాజధానిగా అమరావతి కాకుండా వేరే చోటుకు తరలిస్తున్నారా? అన్నది సందేహంగా మారింది. రాజధాని మార్పు మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ.. దీనికి సంబంధించి ఇప్పటివరకూ ముఖ్యమంత్రి జగన్ నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్య రాలేదన్నది మరవకూడదు.

తాజాగా నెలకొన్న పరిణామాలు.. వినిపిస్తున్న మాటల్ని చూస్తే.. ఏపీ రాజధానిగా మంగళగిరిని ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పకతప్పదు. ఈ వాదనకు బలం చేకూరేలా.. ఇటీవల ఏపీ రాష్ట్రప్రభుత్వం మంగళగిరి పట్టణానికి భారీ ఎత్తున నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాజధాని నిర్మాణానికి అనువైన ప్రదేశంగా విజయవాడ - గుంటూరు మధ్యనున్న మంగళగిరి అందరికి అనువైనదన్నారు. ఇదే విషయాన్ని అధ్యయన కమిటీకి చెబుతానని పేర్కొన్నారు.

మంగళగిరి.. తాడేపల్లి ప్రాంతంలో 10 వేల ఎకరాలకు పైనే ప్రభుత్వ అటవీ భూమి ఉందని.. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మాణం చేయొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అమరావతిప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మించేందుకు ఎదురవుతున్న ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ నేపథ్యంలో ఆళ్ల చెప్పినట్లుగా మంగళగిరి.. తాడేపల్లి ప్రాంతంలో రాజధాని నగరాన్నినిర్మించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలో పాటు.. అమరావతికి కాకుండా వేరే చోట రాజధాని నిర్మాణం చేయాలన్న ఆలోచనలో ఉన్న పక్షంలో మంగళగిరి చక్కటి అప్షన్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.