Begin typing your search above and press return to search.

బాబు వ‌ణికి పోతున్నాడ‌న‌డానికి ఇదే రుజువు

By:  Tupaki Desk   |   5 Feb 2019 9:49 AM GMT
బాబు వ‌ణికి పోతున్నాడ‌న‌డానికి ఇదే రుజువు
X
కొత్త రాష్ట్రం.. అనుభ‌వ‌జ్ఞుడైన చంద్ర‌బాబు అయితే ఉద్ధ‌రించేస్తార‌ని అధికారం క‌ట్ట‌బెట్టారు జ‌నం. ఐతే అధికారంలోకి వ‌చ్చాక నాలుగున్న‌రేళ్ల పాటు చంద్ర‌బాబు అలా అలా కాలం గ‌డిపేసి.. ఎన్నిక‌ల ముంగిట చేస్తున్న విన్యాసాలు చూసి జ‌నం నివ్వెర పోతున్నారు. ఆరు నెల‌ల కింద‌టి వ‌ర‌కు మోడీ స‌ర్కారును పొగిడేసి.. ఎన్నిక‌లు స‌మీపిస్తుండా యుట‌ర్న్ తీసుకున్న బాబు.. ఏపీలో అభివృద్ధి జ‌ర‌గ‌క‌పోవ‌డానికి మోడీనే కార‌ణ‌మంటూ నింద వారిపై వేసేయ‌డానికి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రోవైపు ప్ర‌తిపక్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌క‌టించిన హామీల్ని కాపీ క‌ట్టి వాటిని ముందే అమ‌లు చేస్తూ క్రెడిట్ తీసుకోవాల‌ని చూస్తున్నారు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ముందు వెనుకా చూడ‌కుండా వ‌రాల జ‌ల్లు కురిపించేస్తూ అధికారం కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధ‌మ‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబులో ఓట‌మి భ‌యం పోలేద‌డానికి తాజాగా మ‌రో రుజువు దొరికింది.

తెలుగుదేశం పార్టీకి మంచి బ‌లం ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త క‌నిపిస్తుండ‌టం, అదే స‌మ‌యంలో వైకాపాకు అక్క‌డ ఆద‌ర‌ణ పెరుగుతుండ‌టంతో ఈ రెండు జిల్లాల ప్ర‌జ‌ల్ని ఆందోళ‌న‌కు గురి చేసే ఒక ప్ర‌చారాన్ని బాబు అండ్ కో మొద‌లుపెట్ట‌డం గ‌మ‌నార్హం. వైకాపా గెలిస్తే రాజ‌ధానిని అమ‌రావ‌తి నుంచి ప్ర‌కాశం జిల్లాకు త‌ర‌లించేస్తారంటూ ఒక ప్ర‌చారం మొద‌లుపెట్టారు తెలుగుదేశం నాయ‌కులు. రాజ‌ధాని రాక‌తో ఈ రెండు జిల్లాల్లో పెట్టుబ‌డులు పెరిగాయి. రియ‌ల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఇన్‌ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ వ‌చ్చింది. ఐతే ఇప్పుడు వైకాపా గెలిస్తే రాజ‌ధాని మార్చేస్తార‌న్న ప్ర‌చారంతో ఆ రెండు జిల్లాల ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న రేకెత్తించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఐతే ఇప్పుడున్న స్థితిలో రాజ‌ధాని మార్చ‌డం సాధ్యం కాద‌ని ఎవ్వ‌రిని అడిగినా చెబుతారు. చంద్ర‌బాబులా ఒక చోట అభివృద్ధిని కేంద్రీకృతం చేయ‌కుండా.. అన్ని జిల్లాల‌కూ ప్రాజెక్టులు తీసుకెళ్లాల‌న్న‌ది జ‌గ‌న్ ఆలోచ‌న‌. అంతే త‌ప్ప అమ‌రావ‌తే రాజ‌ధాని అని అంద‌రూ ఫిక్స్ అయి.. అక్క‌డి నుంచే పాల‌న సాగుతుండ‌గా.. దానిని మార్చేసే ఆలోచ‌న ఎందుకు చేస్తాడు. కానీ తెదేపా నాయ‌కులు మాత్రం ఈ లాజిక్ గురించి జ‌నాలు ఆలోచించ‌కుండా రాజ‌ధాని మార్పు అంటూ విష ప్ర‌చారానికి దిగిపోయారు. ఓట‌మి భ‌యంతో చంద్ర‌బాబే ఈ ప్ర‌చారాన్ని ఉద్ధృతం చేయాలంటూ పార్టీ నేత‌ల‌కు ఆదేశాలిచ్చిన‌ట్లు తెలుగుదేశం వ‌ర్గాల స‌మాచారం.