Begin typing your search above and press return to search.

హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివెళుతోన్న కరోనా

By:  Tupaki Desk   |   8 July 2020 5:33 PM GMT
హైదరాబాద్ నుంచి ఏపీకి తరలివెళుతోన్న కరోనా
X
తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. తెలంగాణలో రోజుకు సుమారు రెండు వేల కేసులు నమోదవుతుండగా...మొత్తం కేసుల సంఖ్య 30 వేల మార్క్ ను అందుకోనుంది. పోలీస్ అకాడమీ, ప్రగతి భవన్, హైకోర్టు...ఇలా కరోనా కాటుకు రోజుకో కార్యాలయం బలవుతోంది. తెలంగాణలో నమోదవుతోన్న రోజువారీ కేసుల్లో అధిక శాతం జీహెచ్ ఎంసీ పరిధిలోనే నమోదు కావడం భాగ్యనగరవాసులను కలవరపెడుతోంది. ప్రత్యేకించి హైదరాబాద్ లో కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో ఇటు తెలంగాణతోపాటు అటు ఏపీలోనూ ప్రజల్లో ఆందోళన మొదలైంది. తెలంగాణలో కేసుల సంఖ్య పెరగడంతో అక్కడి నుంచి ఆంధ్రాకు తరలి వెళ్లేందుకు ఆంధ్రా సెటిలర్స్ మొగ్గుచూపుతున్నారు. ప్రత్యేకించి హైదరాబాద్ నుంచి రోజులు రెండు వేల మంది వరకు ఏపీకి తరలి వెళుతున్నారు.

దీంతో, ఏపీలో కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాదులోని కరోనా కేసులకు ఏపీలో కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదలకు లింక్ ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై, చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జనసాంద్రత ఎక్కువగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాల్లో కేసులు పెరగడం సాధారణం. అయితే, కరోనా టెస్టుల్లో నిర్లక్ష్యం, లక్షణాలు లేని కరోనా కేసులను గుర్తించడంలో అలసత్వం వెరసి జీహెచ్ ఎంసీ పరిధిలో కరోనా విలయతాండవం చేస్తోంది. అందుకే, లాక్ డౌన్ ముందూ...తర్వాత కూడా జీహెచ్ ఎంసీ పరిధిలో...ప్రత్యేకించి హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

అయితే, రూరల్ తెలంగాణలో మాత్రం కేసుల సంఖ్య తక్కువగా ఉంది. అన్ లాక్ 1.0లో ఏపీలో కేసుల సంఖ్య కొద్దిగా పెరిగింది. అయితే, హైదరాబాద్ నుంచి ఏపీలోకి వాహనాలను అనుమతించిన తర్వాత ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఏపీలో కేసుల పెరుగుదల తీవ్రతకు హైదరాబాదుకు లింక్ ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో రోజుకు దాదాపు 2 వేల కేసులు నమోదవుతుండడంతో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లాలని భావించారు. ముఖ్యంగా ఏపీ సెటిలర్స్...తమ తమ ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గు చూపారు. హైదరాబాదు నుంచి చాలా మంది సెటిలర్స్ ఏపీకి పోవడం వల్లే ఏపీలో కేసులు పెరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలోకి వచ్చేవారికి ఈ పాస్ తప్పనిసరి అని ఏపీ అధికారులు, పోలీసులు చెబుతున్నారు.