Begin typing your search above and press return to search.

బాబుకు ఎదురెళ్లి ఆహ్వానించిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   18 Oct 2015 2:29 PM GMT
బాబుకు ఎదురెళ్లి ఆహ్వానించిన కేసీఆర్‌
X
ఇద్ద‌రు ప‌రిణితి చెందిన రాజ‌కీయ ఉద్దండులు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న‌టానికి ఏపీ ముఖ్య‌మంత్రి.. తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌లిసిన దృశ్య‌మే నిద‌ర్శ‌నంగా చెప్పాలి. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు బాబు ఆయ‌న ఇంటికి వెళ్ల‌టం తెలిసిందే.

తొలిసారి కేసీఆర్ ఇంటికి వెళ్లిన ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఆద‌ర స్వాగ‌తం ఎదురైంది. ఓటుకు నోటు.. ఫోన్ ట్యాపింగ్ లాంటి అంశాల నేప‌థ్యంలో ఇరువురు ముఖ్య‌మంత్రులు బాహాబాహీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించి.. ఒక‌దశ‌లో ఇరువురునేత‌లు ఎదురెదురు ప‌డ‌టానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని వైనం తెలిసిందే.

అలాంటి ప‌రిస్థితుల నుంచి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇంటికి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వెళ్ల‌టం విశేషంగా చెప్పాలి. చాలా అరుదైన సంద‌ర్భంగా చెప్పుకునే ఈ భేటీకి సంబంధించి తాను మాత్రం త‌క్కువ తిన‌లేద‌న్న‌ట్లుగా బాబుకు స్వాగ‌తం ప‌లికేందుకు.. కేసీఆర్ ఎదురెళ్లి మ‌రీ చంద్ర‌బాబుకు స్వాగ‌తం ప‌లికారు. సాద‌రంగా ఇంట్లోకి బాబును తీసుకెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు. ఇంట్లో ఉన్న కేసీఆర్ కుటుంబ స‌భ్యుల్ని చంద్ర‌బాబు ప‌లుక‌రించారు.

ఏపీ రాజ‌ధాని శంకుస్థాప‌న ఆహ్వాన‌ప‌త్రాన్ని కేసీఆర్ కు అంద‌జేసి.. కుటుంబ స‌భ్యులంతా క‌లిసి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల్సిందిగా బాబు ఆహ్వానించిన‌ట్లుగా తెలుస్తోంది. ఆదివారం సాయ‌త్రం 6.35 గంట‌ల స‌మ‌యంలో బేగంపేట కేసీఆర్ నివాసానికి చంద్ర‌బాబు చేరుకున్నారు. ఇరువురు చంద్రుళ్లు ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణంలో క‌లిసిన‌ట్లుగా చెబుతున్నారు.

మ‌న‌సుల్లో ఏం ఉన్నా.. రాజ‌కీయంగా ఇరువురి మ‌ధ్య ఎంత ర‌చ్చ ఉన్నా.. కొన్ని సంద‌ర్భాల్లో వాటిన్నింటిని ప‌క్క‌న పెట్టాల‌ని.. మాట‌కు త‌గ్గ‌ట్లే ఇరువురు చంద్రుళ్లు వ్య‌వ‌హ‌రించిన వైఖ‌రిని చూపురుల్ని క‌దిలించిన‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జ‌రిగిన ఉద్య‌మంలో ఒక మాట త‌ర‌చూ వినిపించేది. విడిపోయి క‌లిసి ఉందామ‌న్న మాట‌కు త‌గ్గ‌ట్లే ఈ రోజు ఇద్ద‌రు చంద్రుళ్లు క‌లుసుకొని.. అప్యాయంగా మాట్లాడుకున్న వేళ‌.. చాలామందికి అప్పుడెప్పుడో విన్న మాట గుర్తుకు రావ‌టం ఖాయం.