Begin typing your search above and press return to search.

పోలవరం ఎమ్మెల్యేకు బాబు కలవరం

By:  Tupaki Desk   |   12 Dec 2015 8:37 AM GMT
పోలవరం ఎమ్మెల్యేకు బాబు కలవరం
X
చంద్రబాబు తనకు అత్యంత ప్రీతిపాత్రమైన పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేను చెడామడా వాయించారు. క్లీన్ స్వీప్ తో 15కి 15 సీట్లు టీడీపీ గెలుచుకున్న పశ్చిమగోదావరికి చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అక్కడి టీడీపీ ఎమ్మెల్యేలను కూడా చంద్రబాబు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ జిల్లాలో మితిమీరిన దూకుడు ప్రదర్శిస్తున్న ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కూడా ఏ రోజూ ఒక్క మాట అనడం కానీ, మందలించడం కానీ చేయని చంద్రబాబు తాజాగా పోలవరం ఎమ్మెల్యేను ఏకంగా భయపెట్టేశారు. జాగ్రత్త పడకపోతే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని హెచ్చరిస్తూ వచ్చే ఎన్నికల్లో టిక్కెటు కూడా ఇవ్వనన్నట్లుగా సంకేతాలు పంపారు. చంద్రబాబులో ఇంతమార్పు రావడానికి కారణమేంటా అని ఆరా తీస్తే అసలు సంగతి బయటపడింది. పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పనితీరు ఏమాత్రం బాగులేకపోవడంతోనే ఆయన గట్టిగా హెచ్చరించారట.

'నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను' అనే చంద్రబాబు దేన్నయినా సహిస్తారు కానీ పని చేయనివారిని మాత్రం సహించరు. పోలవరం ఎమ్మెల్యేకు ఇప్పుడు అదే ఇబ్బందిగా మారింది. పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతి విషయంలో కానీ, ముంపు గ్రామాల ప్రజలను ఒప్పించి ఖాళీ చేయించే విషయంలో కానీ ఎమ్మెల్యే ఏమాత్రం చొరవ చూపడం లేదట. ఈ సంగతి పశ్చిమ గోదావరి టీడీపీ నేతలు, అధికారుల ద్వారా తెలుసుకున్న చంద్రబాబు ఆయనకు గట్టిగా క్లాసు పీకారట.

ఎంతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో లోకల్ ఎమ్మెల్యేయే ఇన్వాల్వు కాకపోతే ఎలా అంటూ ఆయన మండిపడ్డారని సమాచారం. అంతేకాదు... ఇంకా ఖాళీ చేయాల్సిన మూడు ముంపు గ్రామాలను ఖాళీ చేయించే బాధ్యతను ఆయనకే అప్పగించి ఆ పని పూర్తికాకపోతే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదని స్ట్రాంగ్ వార్నింగు కూడా ఇచ్చారని తెలుస్తోంది. మరి చంద్రబాబు మాటతోనైనా ఆయన చురుగ్గా పనిచేస్తాడో లేదో చూడాలి.