Begin typing your search above and press return to search.

ఏపీ స్థానికత డెడ్ లైన్

By:  Tupaki Desk   |   7 Oct 2015 8:34 AM GMT
ఏపీ స్థానికత డెడ్ లైన్
X
స్థానికతపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది. 2017 జూన్‌ కల్లా ఏపీలో స్థిర నివాసం ఏర్పర్చుకున్న వారినే స్థానికులుగా గుర్తిస్తామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా ఉప సంహరించుకున్నట్లు సమాచారం. వచ్చే మంత్రి మండలి సమావేశంలో ఈ అంశంపై మరోసారి సుదీర్ఘంగా చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది.

స్థానికతపై ఉద్యోగ సంఘాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న సీమాంధ్రులు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్నారు. తమతో ఏ మాత్రం సంప్రదించకుండా 2017ను స్థానికతగా నిర్ణయించడంపై అధికార ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఈ సంఘాల ముఖ్య నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ముఖ్యమైన మంత్రులను కలిసి తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్థానికత గడువును మరో రెండు లేదా మూడేళ్ళపాటు పొడిగించాలన్న యోచనలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికతకు 2017 జూన్‌ నెలను నిర్ణయిస్తూ ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్‌ను పదేళ్ళపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం నిర్ణయించిందని, హైదరాబాద్‌లో 2024 వరకు ఉండే అవకాశం ఉన్నా స్థానికత విషయంలో ఏపీ ప్రభుత్వం 2017ను నిర్ణయించడంపై ఉద్యోగ సంఘాలు గుర్రుమంటున్నాయి. తమ పిల్లలు ఇంజనీరింగ్‌, ఎంబీబీఎస్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరం చేరారని ఈ కోర్సులు పూర్తి చేయడానికి మరో ఆరేడేళ్లు పడుతుందని, అయితే 2017ను స్థానికతగా నిర్ణయించడం వల్ల తమ పిల్లల చదువులను మధ్యలోనే మానివేయించి ఏపీకి ఎలా రాగలమని అధికారులు, ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎంబీబీఎస్‌ కోర్సులో చేరిన తమ పిల్లలు ఈ కోర్సు పూర్తికి కనీసం ఐదున్నరేళ్లు పడుతుందని, ఆ తర్వాత ఎండీ కోర్సులో చేరితే అది మరో రెండేళ్లు చదవవలసి ఉంటుందని మొత్తంగా ఏడున్నర సంవత్సరాల తర్వాత ఏపీకి వస్తే తమను ప్రభుత్వం స్థానికేతరులుగా పరిగణిస్తుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో పని చేస్తున్న ఉద్యోగుల్లో 50 శాతం మంది వచ్చే నాలుగైదేళ్ళలో పదవీ విరమణ చేస్తున్నారని, స్థానికత విషయంలో ఈ ఉద్యోగులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని వివిధ విశ్వ విద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా కేంద్రాలు, కళాశాలలు, పాఠశాలల్లో సీమాంధ్రకు చెందిన వేలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారని, వారంతా ఉన్నఫలంగా తమ ఉద్యోగాలను వదిలి తమ స్వస్థలాలకు రాలేని పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలోనే చంద్రబాబు దీనిపై పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.