Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ టార్గెట్‌: మంత్రుల ఉరుకులు.. ప‌రుగులు!

By:  Tupaki Desk   |   10 March 2021 3:30 PM GMT
జ‌గ‌న్ టార్గెట్‌:  మంత్రుల ఉరుకులు.. ప‌రుగులు!
X
ఏపీ సీఎం జ‌గ‌న్ పెట్టిన టార్గెట్.. కేబినెట్ మంత్రుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగు తున్న కార్పొరేష‌న్‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌కు సంబంధించి మంత్రుల‌కు జ‌గ‌న్ బ‌ల‌మైన టార్గెట్లు పెట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా మూడు రాజ‌ధానుల‌కు సంబంధించి విజ‌య‌వాడ‌, గుంటూరు ప్ర‌జ‌ల ఆమోదం ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ రెండు కార్పొరేష‌న్ల‌లోనూ వైసీపీని గెలిపించే బాధ్య‌త‌ను మంత్రుల‌కు అప్ప‌గించారు. ఇక‌, విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

అయితే.. ప్ర‌తిప‌క్షాలు మాత్రం ఎవ‌రు అడిగారు..ఇక్క‌డ ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌! అంటూ.. విమ‌ర్శ‌లు చేశా యి. అంతేకాదు..వైసీపీ నాయ‌కులు దోచుకునేందుకు విశాఖ‌ను అడ్డాగా చేసుకుంటున్నార‌ని కూడా తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.. దీంతో విశాఖ కార్పొరేష‌న్‌ను గెలుపొంద‌డం ద్వారా.. ఇక్క‌డ ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉంద‌ని నిరూపించుకోవాల‌ని సీఎం జ‌గ‌న్ త‌హ‌త‌హ‌లాడుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ బాధ్య‌త‌ను పార్టీలోని కీలక ఎంపీ స‌హా మంత్రికి అప్ప‌గించారు.

అదేవిధంగా క‌ర్నూలును న్యాయ రాజ‌ధానిగా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రి ఇక్క‌డి ప్ర‌జ‌ల ఉద్దేశం ఏంటి? వారు జ‌గ‌న్ నిర్ణ‌యానికి ఏమేర‌కు జై కొడుతున్నారు? అనే వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలోనే స‌ద‌రు కార్పొరేష‌న్ల‌లో వైసీపీని ప‌రుగులు పెట్టించే బాధ్య‌త‌ను మంత్రులకు అప్ప‌గించారు.. త్వ‌ర‌లోనే మంత్రి వ‌ర్గంలో మార్పులు ఉండ‌డం, స్థానిక ఎన్నిక‌ల్లో స‌ద‌రు మంత్రులు చూపించిన ప్ర‌తిభ‌ను జ‌గ‌న్ కొల‌మానంగా భావిస్తుండ‌డంతో మంత్రులు వ‌ణికిపోతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. అందుకే ప్ర‌తి కార్పొరేష‌న్‌లోనూ అభ్య‌ర్థుల కంటే కూడా మంత్రులు దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు.

కేబినెట్ ఏర్పాటుస‌మ‌యంలోనే రెండున్న‌రేళ్ల త‌ర్వాత‌.. 90 శాతం మంది మంత్రుల‌ను మారుస్తాన‌ని.. ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌.. దీనికి అనుగుణంగా ఇప్పుడు స్థానిక సంస్థ‌ల్లో ప్ర‌తిభ చూపించిన వారిని కొన‌సాగించి.. మిగిలిన వారిని ప‌క్క‌న పెడ‌తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే మంత్రులు త‌మ ప‌దవులు కాపాడుకునేందుకు స్థానికంలో తీవ్రంగా కృషి చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి వీరిలో ఎంత‌మందికి మంచి మార్కులు ప‌డ‌తాయో.. లేదో చూడాలి.