Begin typing your search above and press return to search.

జగన్ మంచి నిర్ణయం

By:  Tupaki Desk   |   19 Oct 2021 6:35 AM GMT
జగన్ మంచి నిర్ణయం
X
పాలకులన్నవారు ప్రతి విషయాన్ని బుర్రపెట్టే కాదు అప్పుడప్పుడు మనసుతో కూడా ఆలోచించాలి. ఇదే సమయంలో బాధితుల విషయంలో మానవతా హ్రదయంతో ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఇపుడు తీసుకున్న నిర్ణయం ఇలాగే అనిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కరోనా వైరస్ కారణంగా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు వెంటనే కారుణ్య మరణాల క్రింద ఉద్యోగాలు ఇవ్వాలని తాజాగా జగన్ ఆదేశించారు. నిజంగా ఇది మంచి నిర్ణయమనే చెప్పాలి.

మామూలుగా విధి నిర్వహణలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు వారి అర్హతలకు తగ్గట్లుగా కారుణ్య మరణాల కింద ఉద్యోగాలు ఇవ్వటం అన్నది ఎప్పటి నుండో ఉన్నదే. అయితే ఆ పద్దతి కొన్నిసార్లు అమలవుతున్నది మరికొన్ని సార్లు కావటంలేదు. అయితే కారుణ్య నియామకాల పద్దతిలో తాజాగా కరోనా వైరస్ ను చేర్చటమన్నది ఆశ్చర్యంగా ఉంది. గతంలో మనకు కరోనా వైరస్ అన్నది అనుభవంలో లేదు. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించటం ఇదే మొదటిసారి.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కరోనా వైరస్ తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు 400 వరకు ఉండచ్చు. ప్రాపర్ చానల్లో ఇపుడు మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే వెంటనే వారి అర్హతలకు తగ్గట్లుగా ఏదో శాఖలో ఉద్యోగం వస్తుంది. పైగా ఈ ప్రక్రియను నవంబర్ నెలలోగా పూర్తి చేయాలని జగన్ డెడ్ లైన్ కూడా విధించారు. కారుణ్య నియామకాలకు ఈ విధంగా గతంలో ఎప్పుడూ డెడ్ లైన్ లేదు.

నిజానికి కరోనా వైరస్ సోకిందంటే వైద్యం కోసం ఆసుపత్రుల్లో చేరిన వారిని ఆసుప్రతి యాజమాన్యాలు డబ్బుల కోసం పీల్చి పిప్పిచేసేశాయి. మందే లేని కరోనా వైరస్ కు వైద్యం పేరిట ఆసుపత్రుల యాజమాన్యాలు లక్షల రూపాయలు దోచేసుకున్నాయి. పైగా ఇన్స్యూరెన్సును కూడా ఆసుపత్రులు అనుమతించలేదు. ఓన్లీ క్యాష్ క్యారీ అనటంతో చాలామంది ఇబ్బందిపడిపోయారు. ఇలాంటి వారిలో ప్రభుత్వోద్యోగులు కూడా ఉన్నారు.

ఒకవైపు డబ్బూ పోయి మరోవైపు మనిషీ తిరిగిరాకపోవటంతో కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతాకాదు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్ధికంగా పటిష్టమైన స్ధితిలో ఉన్న వారిసంఖ్య చాలా తక్కువనే చెప్పాలి. మిగిలిన వారంతా వైద్యం కోసం అప్పు చేసిన వారే ఉంటారు. అలాంటి వారి కుటుంబాలకు జగన్ తాజా నిర్ణయం ఊరటకలిగించేదే అనటంలో సందేహంలేదు. తీసుకున్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తే బాధిత కుటుంబాలకు మంచి జరిగినట్లవుతుంది.