Begin typing your search above and press return to search.

పార్టీలో మరెవరికి లేని రీతిలో ఆ తండ్రికొడుకులకు జగన్ అమిత ప్రాధాన్యం

By:  Tupaki Desk   |   20 April 2022 4:29 AM GMT
పార్టీలో మరెవరికి లేని రీతిలో ఆ తండ్రికొడుకులకు జగన్ అమిత ప్రాధాన్యం
X
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి.. ఆయన కుమారుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డికి మధ్య చాలానే పోలికలు ఉన్నట్లుగా చెబుతారు. కానీ.. తరచి చూస్తే.. వీరిద్దరి తీరు.. ట్రీట్ మెంట్ కాస్తంత భిన్నంగా ఉంటుందన్న మాట వినిపిస్తూ ఉంటుంది. వైఎస్ ఒక్కసారి మనసుకు తీసుకుంటే.. వారి మీద కాన్ఫిడెన్సు పోయే ఛాన్సే లేదు. ఇక.. ఆయన కోర్ టీం ఎప్పుడూ ఆయనతోనే ఉంటుంది. వారికిచ్చే ప్రాధాన్యత విషయంలోనూ ఆయన అస్సలు తగ్గరు.

అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి విషయం అందుకు భిన్నం. ఆయన ఎప్పుడు ఎవరిని దగ్గరకు తీసుకుంటారో.. మరెప్పుడు దూరంగా పెడతారో అస్సలు అర్థం కాని పరిస్థితి ఉందని చెబుతారు. అందుకు తగ్గట్లే పరిణామాలు చోటు చేసుకోవటాన్ని ప్రస్తావిస్తారు. జగన్మోహన్ రెడ్డి కోర్ టీం అన్నంతనే గుర్తుకు వచ్చే వారిలో వైవీ సుబ్బారెడ్డి.. విజయసాయిరెడ్డి.. సజ్జల రామక్రిష్ణారెడ్డి పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి.

వీరు కాకుండా పెద్దిరెడ్డి.. బాలినేని.. లాంటి వారి జాబితా చాలానే ఉంటుంది. అయితే.. పార్టీలో మరెవరి మీదా లేనంత ఎక్కువ ప్రేమను తండ్రికొడుకులైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదా ఆయన కుమారుడు కమ్ ఎంపీగా వ్యవహరిస్తున్న మిధున్ రెడ్డి మీద చూపించిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మొత్తం 26 జిల్లాలకు ప్రాంతీయ సమన్వయ కర్తల్ని ఎంపిక చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఈ బాధ్యతను కేవలం పదకొండు మందికే పరిమితం చేశారు. అందులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాలుగు జిల్లాల్ని అప్పజెప్పారు. ఈ జిల్లాల పరిధిలో మొత్తం 27 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక.. ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలకు చెందిన మొత్తం ఐదు జిల్లాల బాధ్యతల్ని అప్పజెప్పారు. వీటి పరిధిలో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.

ఈ లెక్కన చూస్తే ఈ తండ్రికొడుకుల చేతిలో మొత్తం తొమ్మిది జిల్లాలు.. 62 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం గమనార్హం. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో దగ్గర దగ్గర 40 శాతం అసెంబ్లీ స్థానాల్ని తండ్రికొడుకులకు అప్పజెప్పటం ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో.. జగన్ కోర్ టీంగా చెప్పుకునే విజయసాయిరెడ్డికి ఇప్పటివరకు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త పదవిని తీసేశారు. ఇలాంటి నిర్ణయాలు జగన్ కు మాత్రమే సాధ్యమన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ప్రాంతీయ సమన్వయకర్తల ఎంపికలో జగన్ మార్కు స్పష్టంగా కనిపించిందని.. ఎవరు శాశ్వితం కాదన్న సంకేతాల్ని ఆయన పంపినట్లుగా చెబుతున్నారు.

ప్రాంతీయ సమన్వయకర్తలు వీరే..

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి: చిత్తూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాలు
బుగ్గన, సజ్జల: కర్నూలు, నంద్యాల జిల్లాలు
బాలినేని శ్రీనివాసరెడ్డి: నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలు
కొడాలి నాని: గుంటూరు, పల్నాడు జిల్లాలు
మర్రి రాజశేఖర్: ఎన్టీఆర్, క్రిష్ణా జిల్లాలు
మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్: ఏలూరు, పశ్చిమ, తూర్పు, కాకినాడ, కోనసీమ
వైవీ సుబ్బారెడ్డి: విశాఖ, అనకాపల్లి, అల్లూరి
బొత్స సత్యానారాయణ: పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం