Begin typing your search above and press return to search.

20 ఏళ్ళు సీఎం... తరువాత పీఎం...?

By:  Tupaki Desk   |   2 April 2022 11:30 PM GMT
20 ఏళ్ళు  సీఎం... తరువాత పీఎం...?
X
ఒక్క చాన్స్ తో జగన్ పవర్ లోకి వచ్చారు. అలా మూడేళ్ళుగా సీఎం గా ఏపీలో పాలన చేస్తున్నారు. జగన్ పాదయాత్ర వేళ చెప్పుకున్నారు మూడు దశాబ్దాల పాటు తానే సీఎం గా పాలిస్తాను అని. అది ఆయన ఆత్మ విశ్వాసంగా చూడాలి, అలాగే జనాలకు సేవ చేయాలన్న తపన కూడా అనుకోవచ్చు. ఇక జగన్ ముప్పయేళ్ల సీఎం అని వీలు చిక్కినపుడల్లా వైసీపీ నేతలూ చెబుతూనే వచ్చారు. ఆయన్ని ఓడించే వారే ఏపీలో లేరని కూడా అంటూ వచ్చారు.

సరే అవన్నీ పాత నినాదాలు అనుకుంటే ఇపుడు మళ్ళీ అలాంటివే వినిపిస్తున్నాయి. తిరుమల దేవదేవుడి సాక్షిగా ఇద్దరు నేతలు ఒక రోజు వ్యవధిలోనే జగన్ గురించి శ్రీవారికి బాగా మొక్కుకున్నారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి గురించి చెప్పుకోవాలి. ఆయన జగన్ ఏపీకి మరో పదిహేనేళ్ల పాటు సీఎం గా ఉంటారని, ఉండాలని కలియుగ దైవాన్ని మొక్కుకున్నాను అని అన్నారు.

ఆ తరువాత ఆసక్తికరమైన కామెంట్ మరోటి చేశారు. జగన్ పదిహేనేళ్ల తరువాత దేశానికి ప్రధాని అవుతారు అని. అవాలని కూడా ఆ దేవుడిని మొక్కాను అని. అది నారాయణస్వామి అభిమానం కావచ్చు. నిజానికి రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ ప్రధాని కాలేదా. ఏమో రేపటి రోజుల్లో ఎవరు ఊహించగలరు. సో నారాయ‌ణస్వామి అన్న దాన్నికూడా పాజిటివ్ గానే చూడాలిక్కడ.

ఇక ఆర్కే రోజా. అదే చిత్తూరు జిల్లాకు చెందిన మహిళా నేత. ఆమె ఉగాది వేళ శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్ మరో ఇరవయ్యేళ్ల పాటు ఏపీకి సీఎం గా ఉంటారు అని ఆమె అంటున్నారు. ఆ విధంగా జరగాలని దేవదేవున్ని మొక్కుకున్నట్లుగా చెప్పారు. ఇది కూడా పాజిటివ్ గానే తీసుకోవచ్చు.

సరే జగన్ ముఖ్యమంత్రిగా చాలా ఏళ్ళు ఉండాలి, ఆ మీదట దేశానికి ప్ర‌ధాని కావాలి. ఇవన్నీ వైసీపీ నేతల కోరికలు. దేవుడికి నివేదించుకుంటున్నారు. ప్రజల మన్నన ఉంటే జగన్ అయినా ఎవరు అయినా సీఎం అయినా ప్రధాని అయినా అవుతారు. కానీ కరెక్ట్ గా ఈ మధ్యనే ఇలాంటి కోరికలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అది కూడా మంత్రి వర్గ విస్తర‌ణకు కౌంట్ డౌన్ మొదలైన వేళ జగన్ ప్రధాని అవుతారు అని ఒకరు అంటూంటే ఆయనే ఎప్పటికీ ఏపీకి సీఎం అని మరొకరు అంటున్నారు.

నిజంగా జగన్ మీద వారికి ప్రేమ ఉండదు అని అనుకోవడానికి లేదు కానీ పర్టిక్యులర్ గా ఈ టైమ్ లోనే ఇలా వరాలు కోరడం, మొక్కులు మొక్కడం చూస్తే భక్తి దేవుడి మీదనా లేక ప్రసాదం మీదనా అన్న అన్న డౌట్లు సగటు జనాలకు వచ్చినా ఆశ్చర్యం లేదు కదా. ఇక్కడ మరో మాట కూడా చెప్పుకోవాలి. రేపటి రోజున మంత్రి పదవులు వీరికి కనుక దక్కపోయినా, ఉన్న పదవులు పోయినా వీరు ఇలాగే జగన్ మరిన్ని టెర్ములు సీఎం గా ఉండాలనో, ప్రధానిగా ఉండాలనో కోరుకుంటారా. అలా కనుక కోరుకుంటే మాత్రం అదే నికరం అయిన అభిమానం. ప్రేమ.

అందుకే ఏడుకొండల వాడు కూడా ఇలాంటి మొక్కులను ఆసక్తిగా చూస్తూ ఉండవచ్చు. మంత్రి వర్గ విస్తరణలోగా మరిన్ని కోరికలతో వైసీపీ నేతలు తన దగ్గరకు రావచ్చు అని కూడా ఆయన చూస్తూ ఉండవచ్చు. సో స్వామివారు వీటిని లైట్ గానే తీసుకుంటారు, సగటు జనాలు కూడా డిటో డిటో. ఇక సీఎం జగన్ సైతం లైట్ తీస్కో అని తన మానాన తాను మంత్రులను ఎంచేసుకుంటారు. ఎనీ డౌట్స్..