Begin typing your search above and press return to search.

మరోసారి మానవత్వం చాటిన సీఎం జగన్ !

By:  Tupaki Desk   |   25 Nov 2019 12:31 PM GMT
మరోసారి మానవత్వం చాటిన సీఎం జగన్ !
X
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తానెప్పుడూ ప్రజల మనిషేనని జననేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరోసారి రుజువు చేశారు. నిరంతరం ప్రజల గుండె చప్పుడు వింటూ , వారికి కావాల్సిన సహాయం చేయడానికి సదా సిద్ధంగా ఉంటానని చాటిచెప్పారు. ఇంతకీ సీఎం జగన్ ఏంచేశారు? అంటే ..తనకూతురు హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతుంటే, ఆపరేషన్ కి కావాల్సిన డబ్బు లేక నిస్సహాయత స్థితిలో , ఏమిచేయాలో కూడా దిక్కుతోచని స్థితిలో నిలబడిన ఒక తండ్రికి సీఎం జగన్ నేనున్నా అంటూ పెద్ద కొడుకుగా మారారు.

పూర్తి వివరాలు చూస్తే.. రెండు రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి లోని బయో డైవర్సిటీ ప్లై ఓవర్‌ పై నుండి స్పీడ్ గా వస్తున్న ఒక కారు అదుపుతప్పి ఫ్లై ఓవర్ నుండి కిందపడిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో ఒక యువతి అక్కడికక్కడే మరణించగా అనంతపురానికి చెందిన కుబ్రా బేగం అనే మరో యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైంది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న కుబ్రా బేగం కి త్వరగా ఆపరేషన్ చేయాలనీ , ఆపరేషన్ కి గాను ఐదు లక్షల రూపాయలని కట్టాలని డాక్టర్స్ .. కుబ్రా బేగం తండ్రికి చెప్పారు.

కానీ , కుబ్రా బేగం తండ్రి అబ్దుల్ అజీమ్ ఒక సాధారణ పెయింటర్. దీనితో అంత డబ్బు చెల్లించే స్థోమత లేక, కూతురిని ఆ పరిస్థితుల్లో చూడలేక సహాయం కోసం ఆసుపత్రి బయట దీనంగా కూర్చొని ఉన్నారు. ఈ వార్త సాక్షి పేపర్ లో ప్రచురించారు. అత్యంత బాధ కలిగించే ఈ వార్త చూసిన ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ. చలించి పోయి కుబ్రా బేగం చికిత్స పొందుతున్న కేర్ హాస్పిటల్ కి వెళ్లారు. అక్కడ ఆమె తల్లిదండ్రులతో , డాక్టర్స్ తో మాట్లాడి ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకొని ..సీఎం జగన్ కి తెలియజేసారు.

దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి .. కుబ్రా బేగం ఆపరేషన్ కి ఎంత ఖర్చు అయితే అంతా తక్షణమే సీఎం రిలీజ్ ఫండ్ నుండి విడుదల చేయాలని అధికారులని ఆదేశించారు. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా యువతి తిరిగి సాధారణ స్థితికి చేరుకునేవరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తమ కూతురు ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం చెయ్యడానికి ముందుకొచ్చిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కొంత ఉద్వేగానికి లోనయ్యారు. సాయం కోసం ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు ఆపద్భాంధవుడిలా వచ్చి, మా కూతురి ప్రాణాలని నిలబెడుతున్న సీఎం జగన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో సహాయపడిన ఆరోగ్య శ్రీ స్పెషల్ ఆఫీసర్ హరికృష్ణ , అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కి, సీఎంఓ అవినాష్ కి, దేవేందర్ రెడ్డి కి కుబ్రా బేగం తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.