Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగం ఇదీ

By:  Tupaki Desk   |   15 Aug 2021 11:30 AM GMT
ఏపీ సీఎం జగన్ స్వాతంత్య్ర దినోత్సవం ప్రసంగం ఇదీ
X
ఏపీలో స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రసంగించారు. ఏపీ ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఏపీలో 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన సాగుతోందని జగన్ తెలిపారు. ప్రతి కుటుంబం ఆత్మగౌరవంతో బతికేందుకు సొంతిల్లు ఉండాలన్నారు. వ్యవసాయ రంగంలో రూ.83వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం చెప్పారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చామన్నారు.

రైతు భరోసా కింద ఏపీ రైతులకు రూ.13500 చొప్పున అందిస్తున్నామని తెలిపారు. ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చామన్నారు. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని జగన్ తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30వేల శాశ్వత ఉద్యోగాలిచ్చామని జగన్ తెలిపారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా 61 లక్షల మందికి అండగా నిలిచామని జగన్ తెలిపారు. ఇన్ ఫుట్ సబ్సిడీకి రూ.1039 కోట్లు చెల్లించామని.. పేద రైతులందరికీ నవరత్న పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మేలు జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అనేక మార్పులు తెచ్చామని సీఎం జగన్ తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నామని.. ప్రతి ఒక్కరూ డిగ్రీ లేదా సాంకేతిక విద్యా పొందాలనేది ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నామని జగన్ అన్నారు. పిల్లలకు చదువువులకు ఇప్పటివరకు 26వేల కోట్లకు పైగా ఖర్చు చేశమన్నారు. అమ్మఒడిలో రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చామని జగన్ తెలిపారు.