Begin typing your search above and press return to search.

లెక్క తప్పింది ఎక్కడ? దావోస్ లో తెలంగాణ వెలుగులు.. ఏపీ వెలవెల

By:  Tupaki Desk   |   1 Jun 2022 7:30 AM GMT
లెక్క తప్పింది ఎక్కడ? దావోస్ లో తెలంగాణ వెలుగులు.. ఏపీ వెలవెల
X
మీకు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే అక్కస్సు. అందుకే అలా ఉత్తి పుణ్యానికే మీద పడిపోతుంటారు. జగన్ సర్కారు మీద విషం చిమ్మే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. ఇష్టారాజ్యాంగా రాసే రాతలు మా జగనన్న కీర్తిప్రతిష్ఠల్ని ఇసుమంత కూడా తగ్గించవంటూ ఆగ్రహావేశాలతో శాపనార్థాలు పెట్టేస్తున్నారా? కాస్త ఆగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే.. ఆగ్రహంతోనో.. ఆవేశంతోనో విరుచుకుపడినంత మాత్రాన అబద్ధం నిజం అయిపోదు. అదే సమయంలో ఎంత దాచినా నిజం అబద్ధంగా మారదు.

దావోస్ లో జరిగిన సదస్సులో పెట్టుబడుల సాధన కోసం రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలు తమ టీంలతో వెళ్లాయి. అంతకు ముందే విదేశీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ నేరుగా దావోస్ వెళ్లగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం తన టీంను గుట్టుచప్పుడు కాకుండా పంపేసి.. తాను మాత్రం తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన ప్రయాణమే వార్తాంశంగా మారింది. దావోస్ వెళ్లాల్సిన ఆయన విమానం.. కారణాలు ఏమైనా లండన్ కు వెళ్లి.. అక్కడి నుంచి ఆయన దావోస్ చేరుకున్నారు.

గన్నవరం ఎయిర్ పోర్టులో తన సతీమణితో విమానం ఎక్కిన జగన్.. దావోస్ కు చేరుకునే సమయానికి వారి పిల్లలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అదేమీ తప్పుకూడా కాదు. ఒకవేళ.. అలాంటిది ఉన్నప్పుడు లండన్ లో చదువుతున్న తమ కుమార్తెల్ని కలిసి.. దావోస్ కు వెళుతున్నట్లు ముందే చెప్పేసి ఉంటే వేలెత్తి చూపించే వారి వేలు పైకి లేచే అవకాశమే ఉండేది కాదు. ఆ విషయాన్ని పక్కన పెడితే.. దావోస్ కు వెళ్లిన కారణం.. పెట్టుబడుల్ని ఆకర్షించటానికి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. అదే సమయంలో ఏపీలోని జగన్ ప్రభుత్వం మాత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురితో డీల్ కుదుర్చుకుంది. ఈ ముగ్గురిలో ముగ్గురు ముందు నుంచి తెలిసిన వారు. అందులో ఒకరైతే తనకు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి వియ్యంకుడి కంపెనీ కావటం మరింత ఆసక్తికరం. మరొకటి అదానీకి చెందినది.

కానీ.. తెలంగాణ విషయానికి వస్తే అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఒప్పందాలు చేసుకున్న దానికి సంబంధించి రూపాయిల్లో చూస్తే ఏపీ చాలా ఎక్కువగా చేసినట్లు కనిపించినా.. వాస్తవంగా ఆ ఒప్పందాలు అయితే తాడేపల్లిలోని తన నివాసంలో కానీ.. దేశంలోని మరెక్కడైనా చేసుకోవచ్చు. దాని కోసమే దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అండ్ కో చేసుకున్న ఒప్పందాలు మాత్రం దావోస్ లో మాత్రమే చేసుకోగలిగినవి.

ఇంతకూ.. తెలంగాణ ప్రభుత్వం అన్ని ఒప్పందాలు చేసుకోగా.. ఏపీ ప్రభుత్వం అలా ఎందుకు చేయలేకపోయింది? తప్పు ఎక్కడ దొర్లింది? పొరపాటు ఎక్కడ జరిగింది? అంటే.. మొదట్నించి తప్పటడుగులు పడినట్లుగా చెబుతున్నారు. దావోస్ కు వెళ్లి.. పెట్టుబడుల్ని ఆకర్షించాలంటే కనీసం ఆర్నెల్ల ముందు నుంచి గ్రౌండ్ వర్కు జరగాలి. అప్పటికప్పుడు అనుకుంటే సాధ్యం కాదు. ఎందుకంటే.. వివిధ దేశాల అధినేతలు.. మంత్రులతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల్లో దావోస్ కు వచ్చే వాటికి సంబంధిన వాటిపై ఒక అవగాహన చాలా ముఖ్యం.

విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించటం ద్వారా రాష్ట్ర ఇమేజ్ ను పెంచే వీలుంటుంది. అదే సమయంలో మరిన్ని కంపెనీలు భవిష్యత్తులో రావటానికి అవకాశం ఉంటుంది. అయితే.. పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ కు వెళ్లినంతనే పెట్టుబడులు రావు. దానికి గ్రౌండ్ వర్కు చాలానే జరగాలి. ఏ కంపెనీ కూడా దావోస్ లో కలిసినంతనే.. మాట్లాడిన కొద్ది మాటలకే పెట్టుబడులు పెట్టేయటానికి ఆసక్తి చూపదు. ఎంవోయూ రాసుకోదు. అలా ఎవరైనా చెబితే తప్పు చెబుతున్నట్లే. దావోస్ లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే ముఖ్యనేత రాష్ట్రానికి సీఈవో మాదిరి వ్యవహరించగలగాలి.

మా రాష్ట్రానికి వస్తే మీకు కలిగే ప్రయోజనం ఏమిటన్న విషయంపై పూర్తిస్థాయి అవగాహనతో చెప్పగలగాలి. వారికి ఉన్న అవకాశాలు.. మిగిలిన రాష్ట్రాలకు లేని ప్రత్యేకతలు తమకు ఏం ఉన్నాయన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. వారికి ఉన్న సందేహాల్ని తీర్చాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. నిజానికి దావోస్ కంటే ముందే.. పలు కంపెనీలతో దశల వారీగా చర్చలు జరిపి.. ఒక అవగాహనకు వస్తారు. ఈ సందర్భంగా తమకున్న అభ్యంతరాలతో పాటు..తమ డిమాండ్లను కూడా వారు ప్రభుత్వాలకు చెబుతారు. వీటిపై కసరత్తు చేసి.. ఒక స్థాయి వరకు విషయాన్ని తీసుకెళితే.. ఒప్పందాలు త్వరగా జరిగే వీలుంది.

సాధారణంగా దావోస్ కు తక్కువలో తక్కువగా 500 మంది వరకు విదేశీ ప్రముఖులు వస్తారు. వారిని ఆకర్షించగలిగితే.. రాష్ట్రంలో ఉన్న అవకాశాల గురించి చెప్పి.. ప్రభుత్వం వారికి దన్నుగా ఎలా ఉంటుందన్న విషయాల్ని వివరించి చెప్పగలగాలి. ఇందుకోసం మనకున్న పరిచయాల్ని అవసరానికి తగ్గట్లు తెర మీదకు తీసుకురావాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తే రాష్ట్రానికి భారీ ప్రయోజనం కలుగుతుందనుకుంటే.. వారిని సంప్రదించాలి. అలాంటి వేళలో వారికి ఇష్టం లేకున్నా.. వారికి ఉండే సానుకూలతలు చెప్పి ఒప్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ఈ టాస్కు కాస్త కష్టమైనది. ఈ సందర్భంగా ఎంత సమర్థవంతంగా వ్యవహరించగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది.

కొందరు సానుకూలంగా ఉన్నప్పటికీ పెట్టుబడులు పెట్టేందుకు సంశయిస్తుంటే అలాంటి వారిని రాష్ట్రానికి ఆహ్వానించి వారికున్న సందేహాల్ని తీర్చాల్సి ఉంటుంది. ఇలా చేయటానికి కొంతకాలం పడుతుంది. అదే దావోస్ అయితే నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ కీలక నేత కానీ అందుబాటులో ఉండటంతో రెండు మూడు గంటల కసరత్తుతో ఒప్పందాలకు అవకాశం ఉంటుంది. ఒక అంచనా ప్రకారం సరైన గ్రౌండ్ వర్కు చేయగలిగితే మూడు రోజుల వ్యవధిలో పాతిక నుంచి ముఫ్ఫై సమావేశాల్ని నిర్వహించే వీలుందని చెబుతున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ టీం పక్కాగా ప్లాన్ సిద్దం చేస్తే.. ఏపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటమే తాజా పరిస్థితికి కారణమన్న మాట వినిపిస్తోంది.