Begin typing your search above and press return to search.

అలాంటోళ్లతో జగన్ కు నష్టమేనా ?

By:  Tupaki Desk   |   21 Aug 2021 4:00 PM IST
అలాంటోళ్లతో జగన్ కు నష్టమేనా ?
X
మన రాజకీయాల్లో వ్యక్తి పూజ తక్కువేమీ కాదు. ఢిల్లీ స్థాయిలో గాంధీ కుటుంబం, రాష్ట్రాల స్థాయిలో ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, ఎన్టీఆర్ అభిమానులను చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సరే వాళ్ళ శకం అయిపోయిందని అనుకుంటే మాయావతి హవా కూడా కొంతకాలం అలాగే నడిచింది, వీళ్లందరినీ వదిలేసి తెలుగు రాష్ట్రాలను చూస్తే కేసీయార్, జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా గుడి కట్టారు. మధ్యలో చంద్రబాబు నాయుడు కి కూడా అభిమానులు భజనలు చేశారు కానీ గుడైతే కట్టలేదు.

ఇపుడింతా ఎందుకంటే శ్రీకాళహస్తిలో వైసీపీ ఎంఎల్ఏ బియ్యపుమదుసూధన రెడ్డి జగన్ కు పెద్ద గుడే కట్టేశారు. కట్టిన గుడి కూడా మామూలుగా కాదు ఏకంగా రు. 3 కోట్లు ఖర్చుపెట్టి మరీ నవరత్నాలను ప్రతిబింబిస్తూ జగన్ విగ్రహం పెట్టి మరీ గుడి కట్టేశారు. రాష్ట్రంలో ప్రత్యేకించి వైసీపీలో ఇపుడిదే హాట్ టాపిక్ అయిపోయింది. పార్టీలకు, అధినేతలకు అభిమానులుండటంలో తప్పులేదు. కానీ ఆ అభిమానం హద్దులు దాటితేనే సమస్యలు వస్తాయి.

అభిమానుల అతి చేష్టల వల్ల పార్టీ లేదా అధినేతలకు ఇబ్బందులు ఎదురైన ఘటనలు చాలానే ఉన్నాయి. ఏ ఎంఎల్ఏ కానీ లేకపోతే ఏ నేతకానీ ఏదోకటి ఆశించే ఇలాంటి పనులు చేస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇపుడు బియ్యపు కూడా మంత్రిపదవిని ఆశించే గుడికట్టారని పార్టీలో టాక్ నడుస్తోంది. రాబోయే విజయదశమికి మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రక్షాళనలో తనకు జగన్ చోటివ్వకపోతారా ? అన్నది ఎంఎల్ఏ ప్రయత్నమట.

ఏదో ఒకటిచేసి అధినేత దృష్టిలో పడితే చాలు మంచిమార్కులు కొట్టేయచ్చు, అదృష్టం కలిసొస్తే మంత్రికూడా అయిపోవచ్చని ఎంఎల్ఏలు ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటారు. ఇందులో వారిని తప్పుపట్టాల్సింది కూడా ఏమీలేదు. కాకపోతే జగనే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే తీవ్రంగా నష్టపోతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎంఎల్ఏగా నియోజకవర్గం అభివృద్ధికి కృషిచేసి జనాభిమానాన్నిసంపాదిస్తే నియోజకవర్గంలో పార్టీ బలోపేతమవుతుంది. అలా కాకుండా గుళ్ళు కట్టడం, జగన్ విగ్రహాలు పెట్టడం, పుట్టిన రోజుల్లో రచ్చ రచ్చ చేయటం లాంటి షార్ట్ కట్ పాలిటిక్స్ తో పైకి రావాలని చూసే ఎంఎల్ఏ లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండకపోతే జగన్ నష్టపోక తప్పదు. ఇలాంటివి జనాలకు చికాకు తెప్పిస్తాయే కానీ జగన్ మీద కానీ లేదా ప్రభుత్వం మీదకాని పాజిటివిటీని పెంచవు. కాబట్టి జగన్ జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు.