Begin typing your search above and press return to search.

న‌వ్యాంధ్ర‌లో సీఎం న‌యా ఆఫీస్ ఇదే స్పెషాలిటీస్!

By:  Tupaki Desk   |   11 Oct 2016 3:12 PM GMT
న‌వ్యాంధ్ర‌లో సీఎం న‌యా ఆఫీస్ ఇదే స్పెషాలిటీస్!
X
న‌వ్యాంధ్ర రాజ‌ధానిలో ముఖ్య‌మంత్రి కార్యాల‌యం స‌ర్వాంగ సుంద‌రంగా రూపుదిద్దుకుంది. అత్యాధునిక స‌దుపాయాలు, ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాల మేళ‌వింపుతో ఈ ఏపీ సీఎం కార్యాల‌యం సిద్ధ‌మౌతోంది. బుధ‌వారం ఉద‌యం 8 గంట‌ల త‌రువాత ఏపీ సీఎం ఆఫీస్ ను లాంఛ‌నంగా ప్రారంభిస్తున్నారు. ఇప్ప‌టికే ఏపీ స‌చివాల‌య సిబ్బంది అంతా న‌వ్యాంధ్ర రాజ‌ధానికి చేరుకున్నారు. ఇక‌పై అధికారికంగా ఆంధ్రా ప‌రిపాల‌న అంతా అమ‌రావ‌తి నుంచే జ‌ర‌గ‌బోతోంది.

ముఖ్య‌మంత్రి కార్యాల‌యం విష‌యానికొస్తే... క‌ట్టుదిట్ట‌మైన సెక్యూరిటీ వ్య‌వ‌స్థ‌, బులెట్ ప్రూఫ్ అద్దాలు, సువిశాల స‌మావేశ మందిరాలు, విశ్రాంతి గ‌దులు, పెద్ద డైనింగ్ హాల్‌, ఎక్క‌డ చూసినా మార్బుల్ ఫ్లోరింగ్ తో రూపొందింది. అమ‌రావ‌తిలో స‌చివాల‌యం కోసం మొత్తం ఆరు భ‌వ‌నాల‌ను నిర్మించారు. వీటిలో నాలుగు ఇప్ప‌టికే సిద్ధ‌మైపోయి వినియోగంలోకి వ‌చ్చేశాయి. 2 నుంచి 5 వర‌కూ ఉన్న నాలుగు భ‌వ‌నాలూ పాల‌న‌కు సిద్ధ‌మైపోయాయి. ప్రారంభం కావాల్సిన‌వి రెండే ఉన్నాయి. వీటిలో ఆరో భ‌వ‌నంలో శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లి స‌మావేశాల‌కు అనుకూలంగా ఉంటాయి. మొద‌టి భ‌వ‌నం మొత్తం ముఖ్య‌మంత్రి కార్యాల‌యంగా ఉంటుంది. అంటే, ఇందులో సీఎం ఆఫీస్ సిబ్బందితోపాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, సీఎం ఆఫీస్ సెక్ర‌ట‌రీలు ఉంటారు. వీరి ఆఫీస్ ల‌తోపాటు సువిశాల‌మైన మీటింగ్ హాల్‌, వీడియో కాన్ఫ‌రెన్స్ హాలుతోపాటు ఇత‌ర స‌మావేశ మందిరాలు కూడా ఉంటాయి. ఈ మొద‌టి భ‌వ‌నానికి సంబంధించిన నిర్మాణ ప‌నుల‌న్నీ తుది మెరుగులు దిద్దుకుంటున్న ద‌శ‌లో ఉన్నాయి.

ఇక‌, సీఎం ఆఫీస్ కొల‌త‌ల విష‌యానికొస్తే... మొత్తం 50 వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో నిర్మిస్తున్నారు. అంటే, మొత్తంగా రెండు అంత‌స్తుల్లో క‌లిపి ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల‌న్న‌మాట‌. ఈ భ‌వ‌నంలో మొత్తం ఏడు లిఫ్టులు ఉన్నాయి. ముఖ్య‌మంత్రి కోసం ప్ర‌త్యేకంగా ఒక లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ఈ భ‌వ‌నంలో మొత్తంగా 36 గ‌దులు ఉంటాయి. సెక్యూటిరీ, టెక్నాల‌జీ ప‌రంగా చూసుకుంటే.. అత్యాధునిక స‌దుపాయ‌ల‌న్నీ సీఎం ఆఫీస్ లో ఉన్నాయి. భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను క‌ట్టుదిట్టంగా పాటించారు. భ‌ద్ర‌తా నిపుణుల స‌మక్షంలో సీఎం ఆఫీస్ ను ప్ర‌త్యేకంగా నిర్మించారు. సీఎం ఆఫీస్ మీద రాకెట్ లాంచ‌ర్ తో దాడి జ‌రిగినా కూడా ఎలాంటి ప్ర‌మాదం లేని విధంగా డిజైన్ చేశారు. అంతేకాదు, ఆఫీస్ లో వాడిన అద్దాల‌న్నీ బుల్లెట్ ప్రూఫ్‌. అడుగ‌డుగునా సీసీ టీవీ కెమెరాల నిఘా నేత్రం ఎలాగూ ఉంటుంది. ఇంత పెద్ద కార్యాల‌యానికి విద్యుత్ వినియోగం కూడా భారీగానే ఉంటుంది. కానీ, విద్యుత్ పొదుపు విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. డే లైట్ స‌ద్వినియోగంతోపాటు త‌క్కువ విద్యుత్ వినియోగించుకునే లైట్ల‌ను వాడారు. ఇక‌, సీఎం ఆఫీస్ ఇంటీరియ‌ర్‌, ఇత‌ర అలంక‌ర‌ణ అంతా ముఖ్య‌మంత్రి అభీష్టం మేర‌కు మార్పులూ చేర్పులూ చేశారు. మొత్తానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిపాల‌నా ప‌రంగా ఒక ముంద‌డుగు ప‌డ్డ‌ట్టే!