Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం బీజేపీ ట్రాప్ లో పడకూడదని అనుకుంటున్నారా..?

By:  Tupaki Desk   |   9 March 2021 4:30 PM GMT
ఏపీ సీఎం బీజేపీ ట్రాప్ లో పడకూడదని అనుకుంటున్నారా..?
X
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఉద్యమం కొనసాగుతోంది. స్టీల్ ప్టాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించవద్దని ప్రతిపక్షాలు, కార్మిక సంఘ నాయకులు నినదిస్తున్నారు. అయితే అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతోంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై కేంద్రానికి లేఖ రాశామని ఏపీ సీఎం జగన్ చెబుతున్నా కేంద్రం తీసుకునే నిర్ణయాలకు జగన్ భయపడుతున్నారని కొందరు అంటున్నారు. ఎందుకంటే రాష్ట్రానికి చెందిన ఓ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 'సమావేశాల్లోనే మేం వ్యతిరేకిస్తున్నాం.. అనడమే తప్ప' ఇంకేలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఈ పరిణామాలు చూస్తుంటే వైసీపీ ప్రభుత్వాన్ని ట్రాప్ లోకి పడేసేందుకు బీజేపీ ప్లాన్ వేస్తుందన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి చెందిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేదు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అంతేకాకుండా న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురైతే రాష్ట్రప్రభుత్వం సాయం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

ఈ నేపథ్యంలో అవసరమైతే న్యాయపరంగా రాష్ట్ర పోలీసుల సాయం తీసుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి..? అని మథన పడుతోంది. ఓ వైపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలా..? లేక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్లాలా..? అని సీఎం జగన్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలంతా కలిసి జేఏసీని ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు.

ఈ తరుణంలో జగన్ విశాఖ ఉక్కుపై ప్రత్యక్షంగా ఉద్యమం చేస్తేనే రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వాన్ని నమ్ముతారని వైసీపీ నాయకులు అంటున్నారట. లేదంటే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ, వామపక్షాలు విశాఖ ఉక్కు ప్రైవేటికరణ విషయం అటుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదనే నినదిస్తున్నారు. మరి ఈ సమయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.