Begin typing your search above and press return to search.

ఈ దూకుడు జ‌గ‌న్‌కు క‌లిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   23 Oct 2021 11:30 PM GMT
ఈ దూకుడు జ‌గ‌న్‌కు క‌లిసొచ్చేనా?
X
త‌న తండ్రి దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం.. ఆయ‌న బాట‌లో సాగుతూ రాజ‌కీయాల్లో వెలుగు వెలిగేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పార్టీ స్థాపించి ద‌శాబ్దం గ‌డిచిపోయింది. ఈ కాలంలో పార్టీ ప‌రంగా వ్య‌క్తిగ‌తంగా జ‌గ‌న్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని నిల‌బ‌డ్డారు. మొద‌ట్లో సానుభూతి రాజ‌కీయాలు చేసిన జ‌గ‌న్ ఇప్పుడు పంథా మార్చిన‌ట్లు క‌నిపిస్తున్నారు. త‌న తండ్రి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మృతి చెందిన ఆయ‌న అభిమానుల కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించేందుకు జ‌గ‌న్ ఓదార్పు యాత్ర‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత అక్ర‌మాస్తుల కేసులో జైలుకు వెళ్ల‌డం.. వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌జ‌ల సానుభూతి పొందేందుకు పాద‌యాత్ర చేశారు. 2014 ఎన్నిక‌ల్లో ఎదురు దెబ్బ త‌గిలిన‌ప్ప‌టికీ.. 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు.

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్‌లో మార్పు స్ప‌ష్టం క‌నిపిస్తుంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలు జ‌గ‌న్ రాజ‌కీయ పంథా మారింద‌నేందుకు స‌రైన నిద‌ర్శ‌న‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వైసీపీ దూకుడు రాజ‌కీయాల‌కు తెర‌తీసింది. అధికారం చేతిలో ఉండ‌డ‌తో ప్రత్య‌ర్థి పార్టీని దెబ్బ తీసేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తుంద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. టీడీపీలో ప‌ట్టాభి వంటి నాయ‌కుణ్ని ఆయ‌న మాట‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న వైసీపీ ఇప్పుడు చేస్తున్న రాజ‌కీయాలు చూస్తుంటే నిపుణుల‌కే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. తాజాగా కేబినేట్ స‌మావేశంలో మంత్ర‌ల‌కు జ‌గ‌న్ ఇచ్చిన సంకేత‌మే వైసీపీ దూకుడుకు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది.

గ‌తంలో గుంటూరులో టీడీపీ నేత‌ల కారుపై దాడి.. ఆ త‌ర్వాత ఇటీవ‌ల మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇంటి ముట్ట‌డికి వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేశ్ ప్రయ‌త్నించ‌డంతో ఏర్ప‌డ్డ ఘ‌ర్ష‌ణ.. ఇక ఇప్పుడేమో టీడీపీ పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు.. ఇలా ప్ర‌తి విష‌యంలోనూ వైసీపీ ముద్ర క‌నిపిస్తుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే వైసీపీ ఇలా వ్య‌వ‌హ‌రించ‌డానికి ముఖ్య కార‌ణం టీడీపీనే అని తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 23 సీట్ల‌కే ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌పై ఆ పార్టీ నాయ‌కులు మాట‌ల‌తో రెచ్చిపోతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా ప్ర‌తిఘ‌టిస్తున్నారు. దీంతో అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌గ‌న్ చేప‌డుతోన్న సంక్షేమ ప‌థ‌కాలపై కంటే టీడీపీ ఆరోప‌ణ‌లు విమ‌ర్శ‌ల‌పైనే ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లుతోంది.

ఈ వాస్త‌వ ప‌రిస్థితిని అర్థం చేసుకున్నా జ‌గ‌న్‌.. దూకుడుగా వ్య‌వ‌హ‌రించాల్సేంద‌న‌ని త‌న మంత్రుల‌కు దిశానిర్దేశం చేసిన‌ట్లు టాక్‌. బీజేపీ విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధాన‌మివ్వ‌డంతో పాటు టీడీపీపై సై అంటే సై అంటూ దూసుకెళ్లాల‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది. విప‌క్షాల దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టేందుకు వ‌చ్చే ఏడాది నుంచి జ‌నాల్లోకి వెళ్లాల‌ని ఆయ‌న మంత్రుల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. ఇలా జ‌గ‌న్ నుంచి ఆదేశాలు రావ‌డంతో వైసీపీ నేత‌లు గేరు మార్చిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. టీడీపీ నాయ‌కుల‌పై వైసీపీ నేత‌లు మాట‌ల‌తో రెచ్చిపోతున్నారు. అయితే ఈ దూకుడు జ‌గ‌న్కు క‌లిసొస్తుందా? అనే అనుమానాలు ఇప్పుడు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే గ‌తంలో అధికారంలో ఉన్న‌పుడు చంద్ర‌బాబు కూడా జ‌గ‌న్ ప‌ట్ల ఇలాగే ప్ర‌వ‌ర్తించారు. అది గ‌మ‌నించిన ప్ర‌జ‌లు.. ఎన్నిక‌ల్లో బాబును గ‌ద్దెదించారు. ఇప్పుడు జ‌గ‌న్ కూడా ఇలా దూకుడుతో సాగ‌డంతో ప్ర‌జ‌లు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌కు తిరుగులేని మెజారిటీ ఉంది. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో మంచి పేరే ఉంది. ఇప్పుడు ఇలా దూకుడుగా వ్య‌వ‌హ‌రించ‌డంతో టీడీపీని అస‌లు పోటీలోనే లేకుండా చేయాల‌నే ఆయ‌న ప్ర‌ణాళిక కూడా స‌క్సెస్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది.