Begin typing your search above and press return to search.

కేంద్రంలో స్టాప్‌.. ఏపీలో నాన్‌స్టాప్‌గా

By:  Tupaki Desk   |   6 Jun 2020 6:15 AM GMT
కేంద్రంలో స్టాప్‌.. ఏపీలో నాన్‌స్టాప్‌గా
X
ఇచ్చిన మాట కోసం.. ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను అమ‌లుచేయ‌డంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తూ వాటిని అమ‌లు చేసుకుంటూ ముందుకువెళ్తున్నారు. కొత్త కొత్త ప‌థ‌కాలు తీసుకొస్తూ ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి పొందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అయితే రెండున్న‌ర లాక్‌డౌన్‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలు కాగా, ప్ర‌స్తుతం వ్యాపారాలు, మిగ‌తా రంగాలు ప్రారంభ‌మైనా అంతంత ఆదాయ‌మే వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనూ కూడా జ‌గ‌న్ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. గ‌తంలో తెచ్చిన వాటిని నిరాటంకంగా అమ‌లుచేస్తూనే మ‌రిన్ని కొత్త ప‌థ‌కాలు తీసుకొస్తున్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి క‌న్నా భేష్‌గా ప‌ని చేస్తున్నారు. మొన్న కేంద్ర ప్ర‌భుత్వం పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా కొత్త ప‌థ‌కాలు తీసుకురాలేమ‌ని తేల్చి చెప్పింది. ఈ ఏడాది బడ్జెట్‌లో ప్ర‌క‌టించిన కొత్త ప‌థ‌కాలు కూడా అమ‌లు చేయ‌వ‌ద్ద‌ని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణ‌యం తీసుకుంది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ అంటూ సంక్షేమ ప‌థ‌కాలు ఉన్న వాటిని అమ‌లు చేయ‌డం క‌ష్టంగా ఉంద‌ని పేర్కొంది.

కేంద్ర ప్ర‌భుత్వ‌మే అలా అన్న ప‌రిస్థితిలో లోటు బ‌డ్జెట్ ఉన్న రాష్ట్రంలో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లుచేస్తూ మ‌రికొన్ని తీసుకురావ‌డం ఆస‌క్తిగా మారింది. ఇటీవ‌ల వాహ‌న‌మిత్ర ప‌థ‌కం కింద డ్రైవ‌ర్ల‌కు రూ.10 వేలు చొప్పున వారి బ్యాంక్‌ ఖాతాల్లో జ‌మ చేయ‌డం గ‌మ‌నార్హం.

కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణ‌యంలో భాగంగా బ‌డ్జెట్‌లో ప్రకటించిన పథకాల అమలును వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు వివిధ శాఖ‌ల‌కు శుక్రవారం ఉత్వ‌ర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. కొత్త పథకాలకు నిధుల కోసం ఎలాంటి అభ్యర్థనలూ పంపకూడదని కేంద్రం పేర్కొంది. నిధులను పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ఇప్పటికే ఆమోదించిన, అనుమతించిన పథకాలనూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ నిలిపివేస్తున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది. దీంతో రూ.500 కోట్లలోపు ఇప్పటికే ఆమోదం పొందిన పథకాలు నిలిచిపోనున్నాయి. జనవరిలో ఆమోదం పొంది, ఇప్పటికే కొనసా గుతున్న పథకాలు మాత్రం కొనసాగుతాయి.

ఈ విధంగా కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యం ఉండ‌గా ఏపీలో మాత్రం జ‌గ‌న్ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను కొన‌సాగిస్తూనే కొత్త‌వి తీసుకువ‌స్తున్నాడు. న‌వ‌ర‌త్నాల పేరుతో ప్ర‌క‌టించిన మ్యానిఫెస్టోలోని సంక్షేమ ప‌థ‌కాల‌కు ఏ మాత్రం కోత విధించ‌డం లేదు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నాడు. కొత్త ప‌థ‌కాలు తీసుకొస్తుండ‌డంతో వాటికి, పాత ప‌థ‌కాల‌కు, ఇన్నేసి సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు నిధులు ఎక్క‌డి నుంచి తెస్తాడో అనే చ‌ర్చ సాగుతోంది. అప్పోసొప్పో చేసి ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాలు అందాల‌నే ధ్యేయంతో జ‌గ‌న్ ముందుకు వెళ్తున్నారు. అందుకే ఖజానాలో ఎంత ఉందో చూసుకోకుండానే ప‌థ‌కాలు అమ‌లుచేసుకుంటూ వెళ్తున్నారు. ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వానికి క‌న్నా జ‌గ‌న్ మేలుగా ప్ర‌జ‌లు భావిస్తున్నారు.