Begin typing your search above and press return to search.

ఏపీలో రోడ్డెక్కిన కొత్త అంబులెన్సులు..సువర్ణాధ్యాయానికి నాంది!

By:  Tupaki Desk   |   1 July 2020 6:15 AM GMT
ఏపీలో రోడ్డెక్కిన  కొత్త అంబులెన్సులు..సువర్ణాధ్యాయానికి నాంది!
X
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఆరోగ్యం విషయం లో మరో సువర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ పథకం లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చి రాష్ట్రం లో 95 శాతం కుటుంబాలకు పైగా ఆరోగ్య శ్రీ ద్వారా భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్‌ రెడ్డి ఇప్పుడు అత్యవసర వైద్య సేవలందించే 108, 104 సర్వీసుల్లో కూడా తనదైన ముద్ర వేశారు.

ఒకేసారి ఏకంగా 1,088 వాహనాలను (108–104 కలిపి) బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నడిబొడ్డున బెంజ్‌ సర్కిల్‌ లో జెండా ఊపి ప్రారంభించారు. మారుతున్న కాలానికి, అందుబాటులో ఉన్న ఆధునిక వైద్య ప్రమాణాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దారు. విషమ పరిస్థితిల్లో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో కూడా చికిత్స అందించేలా వాటిలో మార్పులు చేశారు. వాటి సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు. ఇంకా చిన్నారుల కోసం కూడా ప్రత్యేకంగా నియో నేటల్‌ అంబులెన్సులు కూడా ఏర్పాటు చేసారు.

వైద్య సదుపాయాలు పెద్దగా అందుబాటులో లేని గ్రామాలను లక్ష్యంగా పెట్టుకుని ఈ అంబులెన్స్‌లను తీర్చిదిద్దింది ప్రభుత్వం. రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ 108, 104 అంబులెన్స్ వాహనాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పట్టణాల్లో 15 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో అరగంట వ్యవధిలో సంఘటనా స్థలానికి చేరుకునేలా ఏర్పాట్లను చేసింది.

కొత్తగా అందుబాటులోకి తీసుకుని రాబోతోన్న అంబులెన్సులను బేసిక్‌ లైఫ్‌ సపోర్టు (బీఎల్ ‌ఎస్‌), అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టు (ఏఎల్ ‌ఎస్‌)తో తీర్చిదిద్దారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా మరో 26 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. బీఎల్ ‌ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఉంటాయి. ఏఎల్ ‌ఎస్‌ అంబులెన్సుల్లో రోగిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా వైద్య సేవలందించేలా అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. నియో నాటల్‌ అంబులెన్సులలో ఇన్‌ క్యుబేటర్లు, వెంటిలేటర్లను అమర్చారు. సకాలంలో వైద్యం అందక ఏ ఒక్క రోగి కానీ, ప్రమాదానికి గురైన వారు కానీ, చిన్నారులు కానీ మృత్యువాత పడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం.