Begin typing your search above and press return to search.

జగన్ కేసీయర్ వైపు రావాల్సిందేనా... మోడీ షాలు చూస్తున్నారా...?

By:  Tupaki Desk   |   2 Oct 2022 11:34 AM GMT
జగన్ కేసీయర్ వైపు రావాల్సిందేనా... మోడీ షాలు చూస్తున్నారా...?
X
రెండు తెలుగు రాష్ట్రాలు. రెండు కళ్ళు కానీ చెరో వైపు చూస్తున్నాయి. కాళ్ళు తలో వైపు సాగుతున్నాయి. విడిపోయినా అన్నదమ్ముల మాదిరిగా ఉందామనుకున్నా రాజకీయ అసలు కుదరనీయడం లేదు. చంద్రబాబు ఏపీకి తొలి సీఎం అయ్యారు. కేసీయార్ తెలంగాణాకు మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే ఆ ఇద్దరు మధ్య ఉన్న రాజకీయ వైరం రెండు రాష్ట్రాల మీద పడింది. చివరికి అయిదేళ్ల పాటు ఉప్పు నిప్పుగానే గడచింది.

ఇక జగన్ అంటే కేసీయార్ అభిమానం చూపించారు. ఆయన సీఎం కావాలని భావించారు. మొత్తానికి టీయారెస్ కోరిక తీరి 2019లో జగన్ సీఎం అయ్యారు. ఇక చూస్తే ఈ ఇద్దరు నేతలను కలిపింది కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం, అలాగే చంద్రబాబు అంటే ఉన్న అపరిమితమైన రాజకీయ వైరం. ఇలా కామన్ పాయింట్ ఉండడంతో సన్నిహితులు అయ్యారు. ఓడిన తరువాత చంద్రబాబు కామన్ శత్రువుగా ఉన్నా పెద్దగా ప్రాముఖ్యత లేని విషయం అయింది. ఇక కాంగ్రెస్ రెండు సార్లు దేశంలో ఓడి చివరిని ఎటూ కాకుండా పోయింది.

దాంతో కాంగ్రెస్ వ్యతిరేకత అన్న మరో పాయింట్ కూడా ఇపుడు లేకుండా పోయింది. ఇలా తెలుగు నాట, జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. దాంతో మొదట్లో కొన్నాళ్ళు బాగానే జగన్ కేసీయార్ ల దోస్తీ ఉన్నా కూడా ఆ తరువాత మాత్రం కధ అడ్డం తిరిగింది. ఇంకో వైపు చూస్తే కేసీయార్ రాజకీయం రూట్ మార్చుకుంది. ఆయన బీజేపీ మీద కత్తులు నూరుతున్నారు.

అదే సమయంలో జగన్ బీజేపీకి చేరువగా ఉంటూ వస్తున్నారు. ఆయనకు ఏపీలో బీజేపీ ప్రధమ శత్రువు కాదు. అదే కేసీయార్ కి బీజేపీతోనే పేచీ ఉంది. కేసీయార్ ని దింపేయాలని బీజేపీ కంకణం కట్టుకుంది. దాంతో సహజంగానే కేసీయార్ కూడా బీజేపీ మీద కత్తికట్టారు.

ఇక్కడే మిత్రుల మధ్య తేడా వచ్చింది. ఇంకో వైపు చూస్తే జాతీయ పార్టీని పెట్టడానికి కేసీయార్ రెడీ అవుతున్నారు. ఆయనకు ఏపీ సాయం ఈ సమయంలో కావాలి. అది చాలా కీలకం కూడా. జాతీయ స్థాయిలో ఏ ఇతర పార్టీ దగ్గరకు వెళ్ళినా ముందు ఏపీ నుంచి ఏ మేరకు మద్దతు దక్కింది అన్నది చూస్తారు. ఏపీ సపోర్టు లేదు అన్నది తెలిస్తే కేసీయార్ చులకన అవుతారు. దాంతో పాటు ఏపీలో పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇలా 42 సీట్లను తన వైపు ఉంచుకుని కేసీయార్ జాతీయ రాజకీయం మొదలుపెడితే ఎవరైనా నమ్ముతారు. ఆ ప్రయత్నానికి కూడా ఒక సార్ధకత అర్ధం ఉంటాయి.

అయితే ఏపీలో జగన్ మాత్రం డోన్ట్ టచ్ మీ అంటున్నారు. అదే ఇపుడు కేసీయార్ గుస్సాకు కారణం అవుతోంది. దాంతో ఆయన సహించలేకనే తమ మంత్రులతో ఏపీ సీఎం మీద ఆయన పాలన మీద నరుగా కామెంట్స్ చేయిస్తున్నారు అని అంటున్నారు. కేసీయార్ సొంత మేనల్లుడు హరీష్ రావు జగన్ పాలన నిర్వాకం మీద కామెంట్స్ చేశారు అంటే మామ అనుమతి లేకుండా చేయరు అనే అంతా అంటున్నారు.

ఇక మంత్రులు ప్రశాంత్ రెడ్డి కానీ గంగుల కమలాకర్ కానీ ఏపీ మీద అదే పనిగా విరుచుకుపడుతున్నారు. దీని వల్ల వారికి రెండు లాభాలు అని అంటున్నారు. జగన్ కచ్చితంగా దారికి వచ్చి తమ జాతీయ రాజకీయాలతో చేతులు కలిపితే ఎలాంటి ఇబ్బంది లేదు, అదే జగన్ అడ్డం తిరిగితే ఆయన పాలన అసలు ఏమీ బాగాలేదని చెబుతూ ఏపీలో నేరుగా పోటీ చేయడం ద్వారా ప్రత్యర్ధిగా మారవచ్చు. అపుడు జనంలో జగన్ సర్కార్ మీద చెడా మడా విమర్శలు చేసి తమ రాజకీయ వాటాను పొందే వీలు అవుతుంది.

ఈ విధంగా ఏపీ రాజకీయాల్లో టీయారెస్ ప్రవేశించడానికి అక్కడ తన స్పేస్ పెంచుకోవడానికి జగన్ మీద ఎటాక్ చేస్తోందని అంటున్నారు. అయితే ఏపీ సీఎం ఈ దశలో కూడా టీయారెస్ వైపు వచ్చే అవకాశం లేదు. ఆయన బీజేపీతోనే పరోక్ష దోస్తీ చేస్తున్నారు. కేంద్రంలో మోడీ షాలే అత్యంత శక్తిమంతులు అన్నది వైసీపీ పెద్దలకు తెలిసిందే. కానీ కేసీయార్ పాత మిత్రుడు. జగన్ సీఎం గా చూడాలని కోరుకున్న వారు. అందుకు తన వంతుగా సహకరించిన వారు.

కేసీయార్ మంచి వ్యూహకర్త. పైగా పొరుగున ఉన్న నాయకుడు కేసీయార్ తో పెట్టుకుంటే ఏమి జరుగుతుందో అన్న గుబులు ఉంది. కానీ వైసీపీకి ఏమీ చేయలేని పరిస్థితి. దాంతో టీయారెస్ దూకుడు ఎంత చేసినా వైసీపీ కౌంటర్లు ఇచ్చుకుంటూ పోతుందా లేక సైలెంట్ గా ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది.