Begin typing your search above and press return to search.

జగన్ చిరునవ్వుకు అర్ధాలు ...?

By:  Tupaki Desk   |   17 March 2022 11:00 PM IST
జగన్ చిరునవ్వుకు అర్ధాలు ...?
X
జగన్ అందరితోనూ బాగా మాట్లాడుతారు. వచ్చిన వారిని చిరునవ్వుతో రిసీవ్ చేసుకుంటారు. వారు చెప్పినది ఓపికగా వింటారు. అంతే అవతల వారు తమకు అభయం దొరికిందని సంబరపడతారు. కానీ జగన్ మార్క్ పాలిటిక్స్ లో చిరునవ్వుకు అర్ధాలు వేరయా అని ఆ పార్టీలోనే చర్చ వస్తోందిట.

ప్రస్తుతం వైసీపీలో మంత్రి వర్గ విస్తరణ మీదనే జోరుగా మాటల ముచ్చట సాగుతోంది. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలసినా తమకు ఏ మేరకు చాన్స్ ఉంది, ప్రత్యర్ధులకు ఉన్న ఈక్స్వేషన్స్ ఏంటి అన్న దాని మీదనే హాట్ హాట్ డిస్కషన్స్ పెడుతున్నారు.

అయితే జగన్ మదిలో ఏముందో మాత్రం ఏ నాయకుడికీ అంతు పట్టేది కాదని సీనియర్లు అంటున్నారు. ఇపుడు వైసీపీలో కాబోయే మంత్రులు అంటూ కొందరికి కంగ్రాట్స్ చెప్పేస్తున్నారు. దాంతో వారు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. నిజంగా అలా జరుగుతుందా బయటకు వచ్చిన పేర్లే నిజమవుతాయా. జగన్ వారికే అందలం ఎక్కిస్తారా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న అని అంటున్నారు.

దానికి ఉదాహరణలు కూడా చెబుతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక చూసినా, లేక రాజ్యసభ సభ్యుల సెలక్షన్ అయినా లోకల్ బాడీస్ లో మేయర్ చైర్మన్ల ఎంపికలు అయినా ఎవరి ఊహకు అందకుండానే ఉన్నాయని అంటున్నారు. అంత వరకూ ఎందుకు 2019లో జగన్ సీఎం అయ్యాక చేసిన తొలి మంత్రివర్గం కూర్పే ఎవరి అంచనాలకు అందనిది అని కూడా చెప్పుకుంటున్నారు.

ఈసారి కూడా బయటకు ఎన్నో పేర్లు రావచ్చు కానీ జగన్ మదిలో ఉన్న లిస్ట్ రాజ్ భవన్ కి చేరి అఫీషియల్ గా రిలీజ్ అయితేనే తప్ప ఎవరు మంత్రి ఎవరు కారు అన్నది తేలేదే కాదని అంటున్నారు. ఇక ఈసారి మంత్రి వర్గం అంటే కచ్చితంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కూర్పు ఉంటుందని మాత్రం అంతా అంగీకరిస్తున్నారు. దాంతో ఎలాంటి రాజీలూ పేచీలు లేకుండా అన్ని సామాజిక వర్గాల సమతూల్యతతో పాటు, అన్ని రకాల బలాలను బేరీజు వేసుకునే మంత్రులను చేస్తారు అని గట్టిగా వినిపిస్తోంది.

ఈ రకమైన ఎంపిక చేసినపుడు కొత్త వారికీ ఎమ్మెల్సీలకు కూడా చాన్స్ దక్కినా దక్క వచ్చు అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ మార్క్ మంత్రివర్గం విషయంలో ఎవరు ఎంత ఎక్కువగా ఊహించుకున్నా కాబోయే మంత్రులుగా కంగ్రాట్స్ అందుకున్నా అసలు లిస్ట్ ఏంటో బయటకు తెలిసేంతవరకూ అంతా సస్పెన్స్ అన్న మాట వైసీపీ నుంచే వస్తోంది. సో వెయిట్ అండ్ సీ.