Begin typing your search above and press return to search.

జగన్ ఇపుడు పాదయాత్ర చేస్తే..?

By:  Tupaki Desk   |   1 April 2022 2:30 AM GMT
జగన్ ఇపుడు పాదయాత్ర చేస్తే..?
X
వైఎస్ ఫ్యామిలీకి పేటెంట్ గా మారిన పాదయాత్రను ముగ్గురు సభ్యులు చేశారు. వారిలో ఇద్దరు ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. వైఎస్సార్ 2003లో పాదయాత్ర చేసే 2004లో సీఎం పదవి దక్కింది. ఇక 2012లో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తే అది వైసీపీ పటిష్టతకు ఉపయోపడింది. జగన్ 2017లో పాదయాత్ర చేస్తే 2019లో ముఖ్యమంత్రి అయ్యారు.

ఈ నేపధ్యంలో జగన్ మరోసారి పాదయాత్ర చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది. అసలు ఆయన జనాల్లోకి వస్తే ఎలా ఉంటుంది. ఇవన్నీ ఆసక్తిని రేపే ప్రశ్నలే. జగన్ సీఎం అయ్యాక తాడేపల్లి నుంచి బయటకు అడుగు పెట్టడంలేదని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉంటాయి. జగన్ కరోనా రెండేళ్ల సమయంలో కూడా సమీక్షలు అక్కడ నుంచే నిర్వహించారు.

అయితే దీని మీద కూడా కామెంట్స్ వచ్చాయి. అయినా కూడా జగన్ బయటకు నాడు రాలేదు. ఇక కరోనా తగ్గిన తరువాత అపుడపుడు బహిరంగ సభల్లో ఆయన పాలుపంచుకుంటున్నారు. అయితే జగన్ జనాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని, ఆయన వచ్చి జనాలు తన పాలనలో పడుతున్న కష్టాలు చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీకి చెందిన సీనియర్ నేత భానుప్రకాష్ రెడ్డి అయితే జగన్ తాడేపల్లి ప్యాలస్ వదిలి ఏకంగా వారం రోజుల పాటు జనాల గుడిసెలలో పడుకుంటే ఆయనకు వారు పడే కష్టాలు తెలుస్తాయని అంటున్నారు. జగన్ జనం మధ్యన ఉంటే వారి ఇబ్బందులు ఏంటో అర్ధమవుతాయని కూడా అంటున్నారు.

మరి ఏపీలో పన్నుల మీద పన్నులు అని ప్రతిపక్షాలు అంటున్నాయి. విద్యుత్ చార్జీలతో జనాలకు షాక్ ఇచ్చేశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే జగన్ కి భారీ షాక్ ఇస్తారన్ని భాను ప్రకాష్ రెడ్డి జోస్యం చెప్పారు. ఏది ఏమైనా జగన్ అప్పట్లో రచ్చబండ పేరిట కార్యక్రమాలను రూపకల్పన చేసుకున్నారు అని వినిపించింది. అయితే కరోనా రావడంతో అది వాయిదా పడింది.

ఆ తరువాత పెద్దగా ఆ ఊసే లేకుండా పోయింది. మరిపుడు జగన్ ప్రజల మధ్యకు వస్తారా. రచ్చబండ కాకపోయినా ఆ టైప్ లో కార్యక్రమాలు చేపడతారా అన్నది చర్చగా ఉంది. ఇంకో వైపు చూస్తే మంత్రులు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అంతా జనాల్లో ఉండాలనే వైసీపీ పెద్దలు అంటున్నారు. ఈ విధంగా చూసుకుంటే మాత్రం జగన్ ఇప్పట్లో జనాల్లోకి వచ్చే అవకాశం లేదనే అనుకోవాలి.

మరి ఎన్నికల వేళ ఆయన వస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుందా అన్నది కూడా చూడాలి. మొత్తానికి జగన్ ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తానుగా నేరుగా తెలుసుకుంటే పాలనాపరమైన లోపాలు ఏమైనా ఉంటే సవరించుకోవచ్చు అన్న మాట అయితే వైసీపీలో ఉంది. మరి అది జరుగుతుందా. వేచి చూడాల్సిందే.