Begin typing your search above and press return to search.

నాడు ఎన్టీయార్.. నేడు జగన్...?

By:  Tupaki Desk   |   8 April 2022 12:30 AM GMT
నాడు ఎన్టీయార్.. నేడు జగన్...?
X
ఉన్న మంత్రులను ఒక్కసారిగా తీసేసిన చరిత్ర ఏపీలోనే ఉంది. ఆ రికార్డు ఈ రోజుకీ పదిలంగానే ఉంది. ఇప్పటికి 33 ఏళ్ల వెనక్కు వెళ్తే సరిగ్గా 1989 ఫిబ్రవరి నెలలో ఎన్టీయార్ మొత్తం మంత్రులను నాడు పదవుల నుంచి తప్పించారు. దాంతో సీనియర్ నేతలు అంతా ఒక్కసారిగా మాజీలు అయిపోయారు.

వారి ప్లేస్ లో ఎన్టీయార్ కొత్త మంత్రులను నియమించారు. అలా ముక్కూ మొహం తెలియని వారు, పెద్దగా మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకోని వారు కూడా మంత్రులు అయిపోయారు. అదే టైమ్ లో సీనియర్ నేతలు మాత్రం జూనియర్లు మంత్రులు అవుతూంటే నోళ్ళు వెళ్ళబెట్టి చూడాల్సి వచ్చింది.

ఇదంతా ముఖ్యమంత్రిగా నా ఇష్టం అని నాడు ఎన్టీయార్ చేశారు. అయితే అదే సంవత్సరం అంటే 1989 నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీయార్ టీడీపీ తొలిసారి దారుణంగా ఓటమి పాలు అయింది. కేవలం 73 మంది ఎమ్మెల్యేలు మాత్రం టోటల్ 294 ఎమ్మెల్యేల సీట్లకు గానూ నెగ్గారు.

ఒక విధంగా సీనియర్ మంత్రులను తప్పించడం వల్ల ఎన్టీయార్ చేసిన రాజకీయ ప్రయోగం వల్లనే ఇలా జరిగిందని చెప్పుకున్నారు. అయితే మంత్రివర్గం నిర్ణయాలు ఇతర విషయాలు ముందే లీక్ అవుతున్నాయన్న కారణంతో, ఆగ్రహంతో ఎన్టీయార్ మొత్తానికి మొత్తం మంత్రులను తప్పించారు అని నాడు ప్రచారం జరిగింది.

ఇపుడు చూస్తే జగన్ కూడా మంత్రులందరి చేతా రాజీనామాలు తీసుకున్నారు. అయితే ఈ ఒక్క విషయంలోనే ఎన్టీయార్ తో జగన్ కి పోలిక ఉంది. జగన్ మంత్రులతో సరదాగానే మాట్లాడుతూ రాజీనామాలు తీసుకున్నారు. మంత్రులు కూడా సీఎం ఇష్టం. అంతా ఆయన ఎంపిక. మాకు ఎలాంటి బాధా లేదని అంటున్నారు.

ఇక జగన్ మాజీ మంత్రులను పార్టీ సేవలకు వాడుకోవాలని అనుకుంటున్నారు. నిజానికి ప్రాంతీయ పార్టీలలో ఇలాంటి రిస్క్ తీసుకోవడం ఎక్కడా జరగదు. జాతీయ పార్టీలు ఇలాంటి సాహసాలు చేసినా చలామణీ అవుతాయి.

ఆ మధ్య మోడీ కూడా తన మంత్రివర్గాన్ని విస్తరించారు. పెద్ద ఎత్తున పునర్ వ్యవస్థీకరించారు. కానీ ఆయన టోటల్ గా అందరికీ తీసేయలేదు. చాలా మందిని తప్పించినా అందులో కొందరికి పార్టీ బాధ్యతలు ఇచ్చారు. ఏది ఏమైనా ఏపీలో ఫస్ట్ టైమ్ జగన్ ఇలాంటి ప్రయోగం చేస్తున్నారు.

అది కూడా ప్రాంతీయ పార్టీలలో ఈ ప్రయోగం అన్నది కొంత వింతగా ఉన్నా జగన్ మార్క్ పాలిటిక్స్ ఇలాగే ఉంటుంది, సంచలనాల‌నే నమోదు చేస్తారు కాబట్టి ఆయన చేస్తున్నారు. దీని వల్ల భారీ రాజకీయ ప్రయోజనాన్ని ఆయన ఆశిస్తున్నారు. జగన్ అనుకున్నట్లుగా జరిగితే వైసీపీకి మంచి ఊపు వస్తుంది. కానీ అలా కాకుండా జరిగితే మాత్రం అన్న చర్చ కూడా ఉంది. ఏదేమైనా 2024 ఎన్నికల్లో విజయం కోసం జగన్ వేసిన మాస్టర్ ప్లాన్ ఇదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.