Begin typing your search above and press return to search.

జగన్ ప్లాన్ అదీ : బాబుకు అర్ధమైంది ఇదీ...?

By:  Tupaki Desk   |   17 May 2022 1:30 PM GMT
జగన్ ప్లాన్ అదీ : బాబుకు అర్ధమైంది ఇదీ...?
X
జగన్ ఒక రాజకీయ నాయకుడు. ఆయన వ్యూహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన వెనక పన్నెండేళ్ళ రాజకీయ పోరాటం ఉంది. ఒక సాధారణ ఎంపీ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా కేవలం దశాబ్ద కాలంలో తన గ్రాఫ్ ని ఆకాశానికి పెంచుకున్న జగన్ కి గెలుపు వ్యూహాలు చాలానే ఉంటాయి కదా. అధికారంలో ఉన్న పార్టీకి ఉండే అవకాశాలు, అనుకూలతలను తనకు అనువుగా మార్చుకుని వచ్చే సారి కూడా గెలవాలని జగన్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటారు కదా.

మరి జగన్ కి అధికారంలో ఉండే అనుకూలతలు ఏంటి అంటే కాస్తా తొందరగా ఎన్నికలకు వెళ్ళడం. తనకు ఎపుడు కావాలంటే అపుడు ఎన్నికలు ఏపీలో జరిపించుకోవడం. ఒక విధంగా ప్రజా వ్యతిరేకత మరింతగా పెరగకుండా ముందస్తునకు రంగం సిద్ధం చేసుకోవడం. సడెన్ గా ఎన్నికలకు వెళ్ళి విపక్షాలకు దెబ్బ తీయ‌డం.

జగన్ బయటకు ఏమీ చెప్పడంలేదు. ఆఖరుకు ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా ఆ విషయం తెలియడంలేదు. అయితే చంద్రబాబుకు మాత్రం దీని మీద పూర్తి సమాచారం ఉంది అంటున్నారు. ఆ విషయాన్ని బాబు స్వయంగా పార్టీ క్యాడర్ తో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చెప్పారు కూడా. జగన్ చూపు అంతా ముందస్తు ఎన్నికల మీదనే ఉందని బాబు జోస్యం చెప్పేశారు.

జగన్ పడుతున్న హడావుడి చూస్తూంటే ఆయన ప్లాన్ ఇదే అని బాబు అంచనా వేశారు. జగన్ ముందస్తు ఎన్నికలకు అడుగులు వేస్తున్నారు అన్న విశ్లేషణలు అయితే ఉన్నాయి. ఈ మధ్య ఆయన జిల్లాల టూర్లు చేయడం, విపక్షం మీద విమర్శల జోరు పెంచడం వంటివి కనుక చూస్తే జగన్ కచ్చితంగా ముందస్తు ఎన్నికలకే వెళ్తారన్న చర్చ అయితే ఉంది.

దానికి తగినట్లుగానే ఏపీలోని విపక్షాలు కూడా ధీటుగా సిద్ధమవుతున్నాయి. ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా మేము రెడీ అనే అంటున్నాయి. ముందుగా చంద్రబాబునే తీసుకుంటే ఆయన జగన్ ప్లాన్ పసిగట్టేశారు. మూడేళ్లలో సంక్షేమం పేరిట జగన్ జనాలను మభ్యపెట్టారు అని అర్ధమైపోయింది అని బాబు క్యాడర్ కి చెప్పారు. గడప గడపకూ మన సర్కార్ పేరిట వెళ్తే జనాలు వైసీపీని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు అని బాబు చెప్పారు.

ప్రజలు పూర్తిగా కష్టాల్లో ఉన్నారని, వారు టీడీపీ వైపే చూస్తున్నారు అని కూడా బాబు పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలతో నిత్యం ఉండడం ద్వారా టీడీపీ వచ్చే ఎన్నికల్లో అధికారానికి రాచబాట వేసుకోవాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. మొత్తానికి జగన్ తనకు మాత్రమే ప్లాన్ తెలుసు. దాన్ని సడెన్ గా అమలు చేద్దామనుకుంటున్నారు అంటే ఆ ప్లాన్ ఏంటో మాకు తెలుసు జగనూ అంటున్నారు బాబు గారు. మరి జగన్ ముందస్తు కి రెడీ అయి విపక్షాలకు షాక్ ఇవ్వాలనుకుంటే అంతకంటే ముందే విపక్షాలు ముందస్తు మంత్రం జపిస్తూ జగన్ కి షాకిచ్చేలా ఉన్నాయని అంటున్నారు.