Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం కీల‌క చ‌ర్చ‌లు.. `దావోస్‌`పై పెరుగుతున్న ఆశ‌లు

By:  Tupaki Desk   |   22 May 2022 2:30 PM GMT
ఏపీ సీఎం కీల‌క చ‌ర్చ‌లు.. `దావోస్‌`పై పెరుగుతున్న ఆశ‌లు
X
దావోస్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌.. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. సీఎం జగన్‌తోపాటు.. మంత్రులు బుగ్గన, అమర్నాథ్‌ పరిశ్రమల శాఖ అధికారులు సదస్సుకు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహ వ్యవస్థాపకుడు ప్రోఫెసర్ క్లాజ్‌ ష్వాప్‌తో జగన్‌ సమావేశం అయ్యారు.

కరోనా మహమ్మారి ప్రభావంతో రెండేళ్ల విరామం తర్వాత నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సంఘం సదస్సు.. ఈ నెల 26వరకూ జరగనుంది. రాష్ట్రం నుంచి సీఎం జగన్‌ తోపాటు, మంత్రులు, అధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా వేయాల్సిన అడుగులపై దావోస్‌ వేదికగా సీఎం కీలక చర్చలు జరపనున్నారు. పెట్టుబడులకు ఉన్న అవకాశాల ను ఈ సదస్సు ద్వారా ప్రస్తావించనున్నారు. కొవిడ్‌ నియంత్రణలో రాష్ట్రం అనుసరించిన ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ అంశా ల్నివివరించనున్నారు.

ప్రభుత్వ పాలనలో తీసుకొచ్చిన మార్పులు, నవరత్నాల అమలు, అధికార వికేంద్రీకరణ, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో వచ్చిన మార్పుల్ని తెలియజేయనున్నారు. సంప్రదాయ ఇంధన వనరుల రంగం, పారిశ్రామిక వ్యర్థాల శుద్ధి అంశాలపైనా ఈ సదస్సులో దృష్టిసారించనున్నారు. కాలుష్యంలేని పారిశ్రామిక, ఆర్థిక ప్రగతి దిశగా చేపట్టిన కార్యక్రమాల్ని సీఎం జగన్‌ వివరించనున్నారు.

సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యంలో భాగంగా ఇంటర్‌ కనెక్టివిటీ, రియల్‌టైం డేటా, యాంత్రీకరణ, ఆటోమేషన్‌ అంశాల వివరణకు అధికారులు దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు చేశారు. "పీపుల్‌ –ప్రోగ్రెస్‌ –పాజిబిలిటీస్‌" నినాదంతో ఈ పెవిలియన్‌ జరుగుతోంది. ఇండిస్ట్రియలైజేషన్‌ 4.0కు వేదికగా నిలిచేందుకు రాష్ట్రానికి ఉన్న వనరులు, అవకాశాలు, మౌలిక సదుపాయాలను వివరించనున్నారు.

విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్ఈజెడ్, పోర్టుల నిర్మాణం, కొత్తగా మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధి ఇండస్ట్రియలైజేషన్‌ 4.0కు ఏ రకంగా దోహదపడుతోందో సవివరంగా తెలియజేయనున్నారు. బెంగళూరు –హైదరాబాద్, చెన్నై –బెంగుళూరు, విశాఖపట్నం–చెన్నై కారిడార్లలో ఉన్న అవకాశాల్ని ఈ సదస్సు ద్వారా పారిశ్రామిక సంస్థలు, వ్యాపారవేత్తల ముందు ఉంచనున్నారు. మానవవనరుల నైపుణ్యాల అభివృద్ధి సహా పారిశ్రామిక వ్యూహాల్లో తీసుకురావాల్సిన మార్పులపైనా దృష్టి సారించనున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీకి ఎన్ని పెట్టుబ‌డులు తీసుకువ‌స్తార‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది. దీనిపైనే రాజ‌కీయంగా కూడా చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.