Begin typing your search above and press return to search.

మాట త‌ప్ప‌డం.. మ‌డ‌మ తిప్ప‌డం అంటే ఇదేనా జ‌గ‌న్ భ‌య్యా?

By:  Tupaki Desk   |   7 Aug 2022 11:30 AM GMT
మాట త‌ప్ప‌డం.. మ‌డ‌మ తిప్ప‌డం అంటే ఇదేనా జ‌గ‌న్ భ‌య్యా?
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారీ చెప్పే మాట.. మాట త‌ప్పం.. మ‌డ‌మ తిప్పం అని. అలాగే వైఎస్సార్సీపీ నేత‌లు కూడా త‌మ నాయ‌కుడి గురించి ఈ మాట‌ను చాలా గొప్ప‌గా చెబుతుంటారు. అయితే ఆయ‌న చాలాసార్లు మాట త‌ప్ప‌డం.. మ‌డ‌మ తిప్ప‌డం చేశార‌ని ప్ర‌జ‌ల్లో, నెటిజ‌న్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది.

వైఎస్సార్సీపీ నేత‌లు త‌మ మ్యానిఫెస్టోను బైబిల్, ఖురాన్, భ‌గ‌వ‌ద్గీత అని చెబుతుంటారు. ఆ పార్టీ మ్యానిఫెస్టో ప్ర‌కార‌మే.. జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇస్తామ‌ని పేర్కొన్నారు. అయితే ఇంత‌వ‌ర‌కు ఈ దిశ‌గా ఒక్క అడుగు ముందుకు ప‌డింది లేదు. పైగా త‌న‌ను క‌లిసిన ఒక సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుతో సీఎం జ‌గ‌న్ మీ జీతం ఎంత అని అడిగార‌ని.. ఆ జ‌ర్న‌లిస్టు త‌న జీతం 40 వేల అని చెప్ప‌డంతో.. అయితే మీకు ఇళ్ల స్థ‌లాలు ఎందుకు అని సీఎం అన్నార‌ని గ‌తంలో వార్త‌లు వ‌చ్చాయి.

ఇక మ్యానిఫెస్టో ప్ర‌కార‌మే.. మద్యాన్ని మూడు ద‌శ‌ల్లో నిషేధించి.. మద్యాన్ని ఫైవ్ స్టార్ హోట‌ళ్ల‌కే ప‌రిమితం చేస్తామ‌ని పేర్కొన్నారు. అయితే ఇంత‌వ‌ర‌కు ఒక్క ద‌శ కూడా మ‌ద్య‌నిషేదం జ‌ర‌గ‌లేదు. అలాగే మ‌ద్యం కూడా గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్ర‌భుత్వ‌మే అమ్మిస్తోంది. అంతేకాకుండా మ‌ద్య నిషేధం లేక‌పోగా.. మ‌రో 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు మ‌ద్యంపై వ‌చ్చే ఆదాయాన్ని ఎర‌గా చూపి.. 8000 కోట్లు అప్పులు తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు.

అలాగే ఉద్యోగులకు సంబంధించిన కంట్రిబ్యూట‌రీ పెన్ష‌న్ స్కీమ్ ను అధికారంలోకి వ‌చ్చిన వారం రోజుల్లోనే ర‌ద్దు చేస్తామ‌ని జ‌గ‌న్ ఎన్నిక‌ల ముందు పాద‌యాత్ర‌లో చెప్పారు. ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చాక అది సాంకేతిక కార‌ణాల‌తో సాధ్యం కాద‌ని నాలుక మ‌డ‌తేశార‌ని అంటున్నారు.

అలాగే ఏటా జ‌న‌వ‌రిలో ఉద్యోగాల‌కు సంబంధించిన క్యాలెండ‌ర్ ను విడుద‌ల చేస్తామ‌న్నారు. అది అతీగ‌తీ లేద‌ని చెబుతున్నారు. అలాగే అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే మెగా డీఎస్సీ ప్ర‌క‌టిస్తామ‌ని చెప్పార‌ని.. అది కూడా ఇప్ప‌టివ‌ర‌కు లేద‌ని గుర్తు చేస్తున్నారు.

ఇక త‌న‌కు 25 మంది ఎంపీల‌ను గెలిపిస్తే కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌న్నారు. అయితే కేంద్రానికి మ‌న అవ‌స‌రం లేకుండా పోయింద‌ని.. అందుకే ప్ర‌త్యేక హోదా తేలేక‌పోయామ‌ని చావుకబురు చ‌ల్ల‌గా చెప్పార‌ని అంటున్నారు. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేంద్రానికి వైఎస్సార్సీపీ మ‌ద్ద‌తు అవ‌స‌రం ఉన్న‌ప్ప‌టికీ ఈ విష‌యాన్ని లేవ‌నెత్త‌కుండా బీజేపీకి బేష‌రతుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించార‌ని గుర్తు చేస్తున్నారు.

పింఛ‌న్ చంద్ర‌బాబు హ‌యాంలోనే 2000 ఇచ్చార‌ని అంటున్నారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన ఈ మూడేళ్ల‌లో పెంచింది కేవ‌లం 500 అనే గుర్తు చేస్తున్నారు. వాస్త‌వానికి ఏటా 250 చొప్పున పెంచుకుంటూ వెళ్తే మూడేళ్ల‌కు 750 రూపాయ‌లు పెర‌గాలి. కానీ పెరిగింది రూ.500 మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హ‌మ‌ని అంటున్నారు.

ఇక ఆంధ్రుల జీవ‌నాడి పోల‌వరం ప్రాజ‌క్టును 2021 డిసెంబ‌ర్ నాటికి పూర్తి చేస్తామ‌ని నాటి జ‌ల‌వ‌నరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ తొడలు కొట్టి, మీసాలు మెలేసి నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పార‌ని గుర్తు చేస్తున్నారు. కానీ ఇంత‌వ‌ర‌కు అతీగ‌తి లేద‌ని అంటున్నారు. ఇప్పుడు తీరిగ్గా గ‌త ప్ర‌భుత్వం త‌ప్పుల వ‌ల్లే పూర్తి చేయ‌లేక‌పోతున్నార‌ని కాడి ప‌క్క‌న ప‌డేశార‌ని ఎద్దేవా చేస్తున్నారు.

ముస్లిం చెల్లెళ్లు పెళ్లిళ్లు చేసుకుంటే ల‌క్ష రూపాయ‌ల చొప్పున ఆర్థిక సాయం చేస్తామ‌ని వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలోనే ఉంది. అయితే ఒక్క‌రికి కూడా ఇచ్చిన దాఖ‌లాలు లేవ‌ని అంటున్నారు. బీసీ చెల్లెమ్మ‌ల పెళ్లిళ్ల‌కు 50 వేలు ఇస్తామ‌ని మేనిఫెస్టోలో పెట్టినా ఒక్క‌రికీ ఇవ్వ‌లేద‌ని చెబుతున్నారు. అలాగే ఎస్టీ, ఎస్సీ చెల్లెమ్మ‌ల పెళ్లిళ్ల‌కు లక్ష రూపాయ‌లు ఇస్తామ‌ని చెప్పినా అది కూడా కార్య‌రూపం దాల్చ‌లేద‌ని అంటున్నారు.