Begin typing your search above and press return to search.

కుప్పంలో బాబుకు ఇల్లు లేదు.. ఏపీలో రాజసౌధాలు లేవుగా జగన్?

By:  Tupaki Desk   |   25 Sep 2022 4:24 AM GMT
కుప్పంలో బాబుకు ఇల్లు లేదు.. ఏపీలో రాజసౌధాలు లేవుగా జగన్?
X
కొత్త వాదనల్ని ఎప్పటికప్పుడు తెర మీదకు తీసుకొస్తూ.. రాజకీయాన్నిరచ్చగా మార్చటంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత టాలెంట్ మరెవరికీ లేదన్న విషయం పలువురు చెబుతుంటారు. ఆ వాదనకు బలం చేకూరేలా ఆయన మాటలు ఉన్నాయి. చంద్రబాబుకు కోటలా ఉండే ఆయన ప్రాతినిధ్యం వహించే కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఈసారి ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో భారీ షాక్ ఇవ్వాలన్న ప్రయారిటీ పెట్టుకోవటం కనిపిస్తోంది. అందుకు.. తన పరంగా ఏమేం చేయాలో అవన్నీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి.. రెండు రోజుల క్రితం కుప్పం వెళ్లి..చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కుప్పం ఎమ్మెల్యే హైదరాబాద్ కు లోకల్ అని.. కుప్పం నియోజకవర్గానికి నాన్ లోకల్ అని వ్యాఖ్యానించారు. కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదన్న ఆయన... తనకుకావాల్సింది కుప్పం నుంచి పిండుకున్నారన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉండి కూడా కుప్పంలో కరువు సమస్యను పరిష్కరించలేదన్న జగన్.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందులలో పరిశ్రమల్ని ఎందుకు తీసుకురాలేదు? కీలకమైన ఐటీ కంపెనీల్ని అక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేదు?తాను ఏమనుకున్నా చేసే దమ్ము.. ధైర్యం ఉందన్నట్లుగా వ్యవహరించే జగన్.. తన తండ్రి సీఎంగా ఉన్నప్పుడు.. తాను ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పులివెందులకు నాలుగు భారీ ప్రాజెక్టులను ఎందుకు తీసుకురానట్లు? అన్నప్రశ్నను ఏమని బదులిస్తారు?

కుప్పంలో చంద్రబాబుకు ఇల్లు లేదన్న జగన్ మాటలు గురివింజను మరిపించేలా ఉన్నాయని చెబుతున్నారు. తన తండ్రి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వేళ.. తాను మాత్రం వ్యాపారాన్ని చేసుకోవటానికి కార్యస్థలంలా బెంగళూరు మహా నగరాన్ని ఎందుకు ఎంచుకున్నట్లు? తన తండ్రిని ముఖ్యమంత్రిని చేసిన పులివెందులలో..తన వ్యాపారాన్ని ఎందుకు షురూ చేయలేదు? అన్నది కూడా ప్రశ్నే అవుతుంది కదా?

అంతదాకా ఎందుకు? తన తండ్రి సీఎంగా ఉండి చక్రం తిప్పుతున్న వేళలో.. ఇదే జగన్ తన తండ్రిని ఇరుకున పెట్టకుండా ఉండేందుకు బెంగళూరులో రాజప్రసాదాన్ని తలపించే రీతిలో ప్యాలెస్ ను ఎందుకు కట్టకున్నట్లు? అయితే గియితే ఇలాంటి ప్యాలెస్ లు అయితే ఇడుపుల పాయలోనో.. లేదంటే తన తండ్రి ప్రాతినిధ్యం వహించే పులివెందులలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? సరే.. అప్పట్లో అంత అవగాహన లేదనే అనుకుందాం. మరి.. ఇప్పుడైనా సరే.. తాను ప్రాతినిధ్యం వహించే పులివెందులలో భారీ పరిశ్రమను ఎందుకు ఏర్పాటు చేయరు? నీతులు చెప్పేందుకు బాగానే ఉన్నా.. వాటి లోతుల్లోకి వెళ్లినప్పుడు మాత్రం డొల్లతనం ఇట్టే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికైనా ఈ తరహా విమర్శల్ని కట్టిపెట్టి పాలన మీద మరింత ఫోకస్ పెంచితే పాలనారథం పరుగులు తీసే వీలుంది. ఈ వాదనకు జగన్ ఏమని బదులిస్తారో?