Begin typing your search above and press return to search.

శ్రీకాకుళం టూర్ - జగన్ హామీలే సమస్యలయ్యాయా?

By:  Tupaki Desk   |   22 Jun 2022 5:57 AM GMT
శ్రీకాకుళం టూర్ - జగన్ హామీలే సమస్యలయ్యాయా?
X
రైతులు, విద్యార్థులు, కాంట్రాక్టు మ‌రియు రెగ్యుల‌ర్ ఉద్యోగులు వీరంతా ఒక్క‌టే నినాదంతో ఉన్నారు. ముఖ్యమంత్రి మూడేళ్ల తర్వాతన్నా మా స‌మ‌స్యల ప‌రిష్కారానికి ప్రాధాన్యం ఇస్తారా? అని. పోనీ నిలదీద్దాం అంటే... స్థానిక అధికార పార్టీ నాయ‌కుల హ‌డావుడిలో తామేమ‌యిపోతా మో అన్న ఆందోళ‌న వీరిలో ఉంది. మ‌రి ! రానున్న సోమ‌వారం ఏం జ‌ర‌గ‌నుంది. సీఎంతో మాట్లాడే అవ‌కాశం ఎంపిక చేసిన బాధిత వ‌ర్గాల‌కేనా అంద‌రికీ కూడానా?

ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో శ్రీకాకుళం జిల్లాకు ఏమ‌యినా వ‌రాలు ఉంటాయా అన్న ఆస‌క్తిదాయ‌క చ‌ర్చ ఒక‌టి న‌డుస్తోంది. కేవ‌లం నాలుగు మాట‌లు చెప్పి వెళ్తారా సుదీర్ఘ కాలం ఆయ‌న కోసం వేచి చూస్తున్న ఉత్త‌రాంధ్ర వాసుల‌కు ఏమ‌యినా శుభ‌వార్త‌లు అందించి వెళ్తారా అన్న సంశ‌యాలు రేగుతున్నాయి. ఎందుకంటే ఇప్ప‌టిదాకా పంట కాల్వ‌ల నిర్వ‌హ‌ణ‌కే నిధులు ఇవ్వ‌ని స‌ర్కారుగా వైసీపీ పేరు పొందింది.

రైతాంగానికి ఈ ఖ‌రీఫ్ లో ఏమ‌యినా సాయం చేసి వెళ్లాల‌నే విప‌క్షాలు కోరుతున్నాయి.సాగునీటి కాలువ‌ల నిర్వ‌హ‌ణ లేక ఏటా న‌ష్ట‌పోతున్నామ‌ని, క‌నీసం తీరువా చెల్లింపుల నుంచి అయినా నిధులు ఇవ్వాల‌ని వీరంతా వేడుకుంటున్నారు. ఇంత చిన్న స‌మ‌స్య ను కూడా ప రిష్క‌రించ‌కుండా వేల కో ట్ల ప‌థ‌కాలు త‌మ‌కు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. ఇదొక శాంపిల్ మాత్రమే!

మూడేళ్ల త‌రువాత శ్రీ‌కాకుళం జిల్లాకు సీఎం జ‌గ‌న్ వ‌స్తున్నారు. ఆయ‌న రాక నేప‌థ్యంలో నాయ‌కులు చాలా మంది సంద‌డి చేసేందుకు సిద్ధం అవుతున్నారు. సీఎం దృష్టిలో ప‌డేందుకు తెగ తాప‌త్ర‌య‌ప‌డనున్నారు కూడా ! నాయ‌కుల హ‌డావుడి, ఫ్లెక్సీల గోల ఎలా ఉన్నా జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి ఏర్పాట్ల‌ను మాత్రం న‌ర‌స‌న్న‌పేట ఎమ్మెల్యే ధ‌ర్మాన కృష్ణ‌దాసు చూస్తున్నారు. ఆయ‌న నేతృత్వంలో ప్ర‌స్తుతం ప‌నులు సాగుతున్నాయి.

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లా నేత‌ల‌తో పాటు ఉత్త‌రాంధ్ర నాయ‌కుల‌కూ ఈ వేదిక‌పై ప్రాధాన్యం ద‌క్కేవిధంగా జాగ్రత్త‌లు తీసుకుంటున్నారు. పాద‌యాత్ర త‌రువాత జిల్లా కేంద్రంలో నిర్వ‌హిస్తున్న ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొంటుడ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో ముఖ్య‌మయిన నేత‌లంతా స‌భా ప్రాంగ‌ణాన మోహ‌రించ‌నున్నారు. అయితే ముఖ్య‌మంత్రికి సమ‌స్య‌లు చెప్పేందుకు వివిధ రాజ‌కీయ పార్టీల నేత‌లు కూడా సిద్ధం అవుతున్నారు. వారిని అనుమ‌తిస్తారా అడ్డుకుంటారా అన్న‌ది ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కంగా ఉంది.

జిల్లా కేంద్రంలో సుదీర్ఘ కాలంగా కోడిరామ్మూర్తి స్టేడియం ప‌నులు పెండింగ్ ఉన్న దగ్గ‌ర నుంచి ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితుల‌కు ఓ మ‌ల్టీ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణం వ‌ర‌కూ చాలా స‌మస్య‌లు ఉన్నాయి. వీటిపై మాట్లాడాల్సినంత మాట్లాడాలి. ఈ నెల 27న శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి యువ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌స్తున్నారు. ఈ సంద‌ర్భంగా మూడో విడ‌త అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ప్రారంభించి, స్థానిక కేఆర్ స్టేడియంలో ఏర్పాటుచేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడ‌నున్నారు. ఒక రోజు షెడ్యూల్ కూడా క‌న్ఫం అయింది.

సోమ‌వారం ఉద‌యం ప‌ద‌కొండు గంట‌ల‌కు బ‌హిరంగ స‌భ జ‌ర‌గ‌నుంది. బ‌హిరంగ స‌భ జ‌రిగే ముందు న‌గ‌రంలో డే అండ్ నైట్ కూడలి నుంచి శ్రీ‌కాకుళం రోడ్ (ఆమ‌దాల‌వ‌ల‌స‌) వ‌ర‌కూ త్వ‌ర‌లో చేప‌ట్ట‌నున్న ర‌హ‌దారి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారు. త‌రువాత తిత్లీ తుఫాను బాధితుల‌తోనూ, వంశ‌ధార నిర్వాసితుల‌తోనూ మాట్లాడ‌నున్నారు. బ‌హిరంగ స‌భ అనంత‌రం తిరిగి విజ‌య‌వాడ‌కు ప్ర‌యాణం అవుతారు.