Begin typing your search above and press return to search.

మ‌ద్య నిషేధం లేన‌ట్టే.. ఏపీలో జ‌గ‌న‌న్న మ‌ద్యం పాల‌సీ!

By:  Tupaki Desk   |   18 Jun 2022 11:30 AM GMT
మ‌ద్య నిషేధం లేన‌ట్టే.. ఏపీలో జ‌గ‌న‌న్న మ‌ద్యం పాల‌సీ!
X
మద్య నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వం నీళ్లొదిలేసింది. 2025 ఆగస్టు వరకూ నిషేధం ఉండదని చెప్పకనే చెప్పింది. మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్ల విధానం ఖరారు చేసిన సర్కార్‌.. ఒక్క బారు కూడా తగ్గదని స్పష్టంచేసింది.

ఇప్పుడున్నవి యధావిధిగా కొనసాగుతాయని తేల్చింది. 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామని గతంలో హామీ ఇచ్చిన జగన్‌... ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారు.

"కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మేము అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ఆ తర్వాత కేవలం 5స్టార్ హోటళ్లలోనే మద్యం లభ్యమయ్యేలా చేస్తాం" అని... 2019 ఎన్నికల ప్రణాళికలో వైకాపా హామీ ఇచ్చింది. దీనిద్వారా లక్షలాది కుటుంబాల్లో వెలకట్టలేని సంతోషం నింపుతామని చెప్పింది.

2019 ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో వైకాపా 151 సీట్లతో విజయం సాధించింది. గెలిచిన మూడు రోజుల తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే... ఢిల్లీలో ప్రధాని మోడీని జగన్ కలిశారు. ఆ తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో.. మద్యం ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటామని చెప్పారు.

ఎన్నికలకు ముందు, ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత జగన్‌ ఇచ్చిన దశలవారీ మద్యనిషేధ హామీకి... ఇప్పుడు తూట్లు పొడుస్తున్నారు. 2024 సంగతి అటుంచి... 2025 ఆగస్టు వరకూ అసలు మద్యనిషేధం ఊసే లేదని వైసీపీ ప్రభుత్వం చెప్పకనే చెప్పింది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి 2025 ఆగస్టు 31 వరకూ మూడేళ్ల కాలపరిమితితో కొత్త బార్ల విధానాన్ని తాజాగా ప్రకటించింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉండగా... వాటిలో ఒక్కటి కూడా తగ్గించబోమని స్పష్టంచేసింది. రాబోయే మూడేళ్లు 840 బార్లు యధావిధిగా కొనసాగుతాయని తేల్చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తాజా బార్ల విధానం ప్రకారం... 2024 నాటికి స్టార్‌ హోటళ్లకే మద్యం పరిమితమయ్యే అవకాశం లేనట్లేనని నిర్ధరణ అవుతోంది. దీనిని బ‌ట్టి.. జ‌గ‌న‌న్న పాల‌న‌లో విధానాలు.. హామీలు.. మేనిఫెస్టో కూడా రివ‌ర్సేన‌ని స్ప‌ష్ట‌మైంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.