Begin typing your search above and press return to search.

ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు మాజీ సీఎంకేనా ?

By:  Tupaki Desk   |   8 July 2021 1:30 PM GMT
ఏపీ కాంగ్రెస్ ప‌గ్గాలు మాజీ సీఎంకేనా ?
X
రెండు తెలుగు రాష్ట్రాల‌పై కాంగ్రెస్ ఫోక‌స్ అయితే పెట్టింది. తెలంగాణ‌లో ఏడేళ్ల త‌ర్వాత ఇప్పుడు పార్టీలో ఎంతో కొంత ఊపు క‌నిపిస్తోంది. రేవంత్‌రెడ్డికి ప‌గ్గాలు ఇవ్వ‌డంతో పార్టీ కేడ‌ర్‌లో ఎక్క‌డా లేని జోష్ అయితే నెల‌కొంది. తెలంగాణ కాంగ్రెస్ ప‌గ్గాలు ఎవ‌రికి ఇవ్వాలా ? అని ఆరేడు నెల‌లుగా పార్టీ జాతీయ నాయ‌క‌త్వం ఎన్నో ఆలోచ‌న‌లు చేసి చేసి చివ‌ర‌కు రెబ‌ల్‌గా ఉండే రేవంత్ అయితేనే క‌రెక్ట్ అని చెప్పి రేవంత్ రెడ్డికే పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. రేవంత్ పేరు అలా వెలువ‌డిందో లేదో స్త‌బ్ధుగా ఉన్న నేత‌లు అంద‌రూ ఇప్పుడు కాంగ్రెస్‌లో యాక్టివ్ అవుతున్నారు. ఇత‌ర పార్టీల్లో ప్రాధాన్య‌త లేని వారు సైతం కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఏదేమైనా అక్క‌డ అధికార టీఆర్ఎస్‌లో అల‌జ‌డి అయితే స్టార్ట్ అయ్యింది.

ఇక ఇప్పుడు కాంగ్రెస్ దృష్టి ఏపీపై ప‌డింది. ఏపీలో కూడా స‌మ‌ర్థుడు అయిన నేత‌కు పార్టీ ప‌గ్గాలు ఇస్తే పార్టీ కొంత వ‌రకు గాడిలో ప‌డుతుంద‌న్న ఆశ అధిష్టానంకు ఉంది. 2014 వ‌ర‌కు నాడు స‌మైక్య రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న కిర‌ణ్ కుమార్ రెడ్డి పేరు ఇప్పుడు ఏపీ పీసీసీ రేసులో వినిపిస్తోంది. కిర‌ణ్‌కుమ‌ర్ రెడ్డికి అన్ని వ‌ర్గాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. దీనికి తోడు ఆయ‌న స‌మైక్యాంధ్ర కోసం గ‌ట్టిగా పోరాటం చేశారు. ఆ త‌ర్వాత అదే కాంగ్రెస్ రాష్ట్ర విభ‌జ‌న నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించి జై స‌మైక్యాంధ్ర పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అప్ప‌ట్లో కేసీఆర్‌, జ‌గ‌న్‌, చంద్ర‌బాబుల‌తో ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లో ఫైట్ చేశారు.

ఆ త‌ర్వాత ఆయ‌న తిరిగి కాంగ్రెస్ గూటికి వ‌చ్చారు. అయితే రాజ‌కీయంగా మాత్రం కిర‌ణ్ సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయ‌న బ‌ల‌మైన మాస్ లీడ‌ర్ అయితే కారు కాని.. చాలా వ‌ర్గాల్లో ఆయ‌న‌కు మంచి పేరే ఉంది. కిర‌ణ్‌కుమార్ రెడ్డి ప్ర‌వేశ పెట్టిన కొన్ని ప‌థ‌కాలు, రైతులు, మ‌హిళ‌లు, సామాన్యుల్లో ఇప్ప‌ట‌కీ నిలిచ‌పోయాయి. ఇక సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా 1956 నుంచి కూడా రెడ్లు అంద‌రూ కాంగ్రెస్ వెన్నంటే ఉంటున్నారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ఏపీలో ఈ వ‌ర్గం వాళ్లు అంతా జ‌గ‌న్ వైపు వెళ్లిపోయారు. ఇక్క‌డ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం మైన‌స్‌. అటు తెలంగాణ‌లో వీరంతా కేసీఆర్ వైపు మొగ్గు చూప‌గా.. ఇప్పుడు రేవంత్ ఎంట్రీతో మ‌ళ్లీ వీళ్లంద‌రు కాంగ్రెస్ వైపే చూస్తోన్న ప‌రిస్థితి.

ఇక ఇప్పుడు ఏపీలో కూడా అదే రెడ్డి వ‌ర్గానికి చెందిన కిర‌ణ్ కుమార్ రెడ్డికి పార్టీ బాధ్య‌త‌లు ఇస్తే రెడ్ల‌తో పాటు పార్టీ సంప్ర‌దాయ ఓటు బ్యాంకు తిరిగి పార్టీ వైపు వ‌స్తుంద‌న్న అంచ‌నాల‌తో జాతీయ నాయ‌క‌త్వం ఉంది. మ‌ధ్య‌లో ఏపీ పీసీసీ అధ్య‌క్షులుగా ఉన్న ర‌ఘువీరాతో పాటు ప్ర‌స్తుత అధ్య‌క్షులు శైల‌జానాథ్‌తో ఉప‌యోగం లేద‌ని సోనియా నిర్ణ‌యానికి వ‌చ్చార‌ట‌. ఏదేమైనా మ‌ళ్లీ కిర‌ణ్ కుమార్ ఏపీ రాజ‌కీయాల్లో కీల‌కం కానున్నారు.