Begin typing your search above and press return to search.

హోదా పోరాట రేసులోకి కాంగ్రెస్‌ బ్యాలెట్!

By:  Tupaki Desk   |   19 Sep 2016 7:04 AM GMT
హోదా పోరాట రేసులోకి కాంగ్రెస్‌ బ్యాలెట్!
X
ప్ర‌త్యేక హోదా కోసం ఆంధ్రాలో అన్ని రాజ‌కీయ పార్టీలూ పోరాటాలు చేస్తున్నాయి! శ‌క్తివంచ‌న లేకుండా ఎవ‌రి స్థాయిలో వారు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అద్దం ప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు అనే ఒక పాజిటివ్ ఫీల్ ప్ర‌జ‌ల్లో ఉంది. జ‌న‌సేన స‌భ‌లు పెడితే ప్ర‌జ‌లు హాజ‌ర‌వుతున్నారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ బందుల‌కు పిలుపు ఇస్తుంటే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. వామ‌ప‌క్షాలు ధ‌ర్నాలు చేస్తే క‌లిసి వ‌స్తున్నారు. కానీ, ఇదే క్ర‌మంలో కాంగ్రెస్ కూడా త‌న‌వంతు ప్ర‌య‌త్నం తాను చేస్తున్నా... ఎందుకో ఆ పార్టీ ప్ర‌య‌త్నాన్ని పెద్ద‌గా గుర్తించ‌డం లేదు అనే అభిప్రాయం కొన్ని వ‌ర్గాల నుంచి వ్య‌క్తం అవుతోంది!

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ను అడ్డ‌గోలుగా విభ‌జించారు అనే అప‌వాదు కాంగ్రెస్ పై బ‌లంగా ప‌డింది. ఆ దెబ్బ‌తో గ‌త ఎన్నిక‌ల్లో డిపాజిట్లు కూడా గ‌ల్లంతైపోయాయి. ఆంధ్రాలో ఆ పార్టీ ఉనికి లేకుండా పోయింది. ఎన్నిక‌ల త‌రువాత.. వివిధ ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాటం అంటూ కాంగ్రెస్ నాయ‌కులు ముందుకొచ్చినా ప్ర‌జ‌ల నుంచి మ‌ద్ద‌తు సోసోగానే వ‌చ్చింద‌ని చెప్పాలి. ఆ మ‌ధ్య కొన్ని భూపోరాటాలు చేసింది. ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. నిజానికి... ప్ర‌త్యేక‌హోదాపై తాజా ఒక ఊపు రావ‌డానికి కాంగ్రెస్ పార్టీయే కార‌ణం అని చెప్పాలి. ఎందుకంటే, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రాజ్య‌స‌భ‌లో ప్రైవేటు బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. చ‌ర్చ‌కోసం గ‌ట్టిగానే ప‌ట్టుబ‌ట్టారు. ఒక‌దశ‌లో ఆ బిల్లుపై ఎలా స్పందించాలో తెలియ‌క భాజ‌పా ఉక్కిరిబిక్కిరి అయింది. ఆంధ్రాలో కూడా ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌నే ల‌భించింది. ఆమేర‌కు అది కాంగ్రెస్ విజ‌య‌మే అనాలి. కానీ.. త‌రువాత‌, తెలివిగా దాన్లో ఏవో ఆర్థిక అంశాలున్నాయంటూ ఆ బిల్లును నెమ్మ‌దిగా లోక్ స‌భ‌కు భాజ‌పా రిఫ‌ర్ చేసింది. ఈ ద‌శ‌లో ఏపీ కాంగ్రెస్ కు కొంత కొత్త ఉత్సాహం వ‌చ్చింది. రాష్ట్ర విభ‌జ‌న గ‌తం... రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు ప్ర‌స్తుత ప్రాధాన్యం అన్న‌ట్టుగా ప్ర‌జ‌ల్లోకి ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసుకెళ్ల‌బోయారు!

ఇంత‌లో ప్ర‌త్యేక ప్యాకేజీని కేంద్రం ప్ర‌క‌టించేసింది. దాంతో ప్ర‌త్యేక‌హోదాపై ప్రైవేటు బిల్లు చ‌ర్చ‌కు ఫుల్ స్టాప్ ప‌డిపోయింది. ప్రైవేటు బిల్లు ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి ద‌గ్గ‌ర‌వుదాం అనుకుంటే... క‌థ అడ్డం తిరిగిపోయింది. అలాగ‌ని, ప్యాకేజీతో ఏపీ ప్ర‌జ‌లు సంతృప్తిగా లేరు. కాబ‌ట్టి ఇప్పుడు మ‌రో పోరాటానికి కాంగ్రెస్ తెర తీసింది. ప్ర‌త్యేక హోదాపై ఈనెల 28న ప్ర‌జా బ్యాలెట్ కార్య‌క్ర‌మాన్ని కాంగ్రెస్ నిర్వ‌హించ‌బోతోంది. తిరుప‌తిలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తామ‌ని ర‌ఘువీరా రెడ్డి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతానికి ఆంధ్రా కాంగ్రెస్ ఆశ‌ల‌న్నీ ఈ కార్య‌క్ర‌మం మీద‌నే ఉన్నాయి. ఇప్ప‌టికే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైకాపా ప్ర‌త్యేక హోదా పోరాటం దిశ‌గా దూసుకుపోతోంది. జ‌న‌సేన కూడా దూకుడుగానే ఉంది. దీంతో త‌మ స‌త్తాను చాటుకునేందుకు కాంగ్రెస్ నేత‌లు ఆరాట‌ప‌డుతున్నారు! ప్ర‌త్యేక హోదా తెచ్చే స‌త్తా కాంగ్రెస్ పార్టీకి మాత్ర‌మే ఉంద‌ని నేత‌లు ఇప్పుడు అంటున్నారు. తాజా ప్ర‌జా బ్యాలెట్ కార్య‌క్ర‌మం కాంగ్రెస్‌ కు ఎంత మైలేజ్ ఇస్తుందో చూడాలి.