Begin typing your search above and press return to search.

మాకు చంద్రబాబే ఎక్కువంటున్న రఘువీరా

By:  Tupaki Desk   |   24 July 2018 7:32 AM GMT
మాకు చంద్రబాబే ఎక్కువంటున్న రఘువీరా
X
కొత్త ఫ్రెండు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు కోసం ఏమైనా చేసేందుకు సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు మనసుకు నచ్చేలా మసలుకోవడంపైనే కాంగ్రెస్ నేతలు దృష్టిపెడుతున్నారు. అందుకోసం తామేం చేస్తున్నారో కూడా మర్చిపోతున్నారు. పార్టీ అత్యున్నత సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని రెండు రోజుల్లో తుంగలో తొక్కి రాహుల్ గాంధీ మాటను తాము వినేదేంటీ అన్నట్లుగా వ్యవహరించారు. రాష్ట్రాన్ని విభజించి ఒకసారి పాపం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాష్ట్ర హక్కుల కోసం జరుగుతున్న పోరాటాలను వ్యతిరేకించి మరో పాపం చేస్తోంది. రాహుల్ గాంధీ కంటే తమకు చంద్రబాబే ఎక్కువన్న సంకేతాలిస్తోంది.

ప్రత్యేక హోదా కోసం విపక్ష వైసీపీ రాష్ట్రవ్యాపంగా బంద్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తామని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ తీర్మానించిన మరుసటి రోజే ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి అందుకు భిన్నమైన ప్రకటన చేసి అధిష్ఠానానికి షాకిచ్చారు. టీడీపీ మనసు దోచుకోవడం కోసం రఘువీరారెడ్డి ఏకంగా తమ అధిష్ఠానం నిర్ణయాన్నే వెక్కిరించారు.

ప్రత్యేక హోదాపై మోదీ వైఖరికి నిరసనగా వైసీపీ చేస్తున్న బంద్‌ కు తాము మద్దతు ఇవ్వబోమని రఘువీరారెడ్డి ప్రకటించారు. అది కూడా పనిగట్టుకుని ప్రకటన విడుదల చేశారు రఘువీరారెడ్డి. బంద్‌ ల వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని టీడీపీ చెప్పిన వాదననే రఘువీరారెడ్డి కూడా తన ప్రకటనలో వెలిబుచ్చారు. రాబోయే రోజులను దృష్టిలో పెట్టుకునే ఇప్పటి నుంచే చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే పనులు చేయకుండా కాంగ్రెస్‌ జాగ్రత్తలు తీసుకుంటోందని…. అందులో భాగంగానే వైసీపీ బంద్‌ పిలుపుకు కాంగ్రెస్ మద్దతు తెలపలేదని చెబుతున్నారు. చేసిన పాపం కడిగేసుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అందుకు భిన్నంగా ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా వ్యవహరిస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.